హైదరాబాద్ యు.టి. కన్ఫర్మా?

 

 Hyderabad UT proposal, UT status for Hyderabad, telangana, samaikyandhra, congress, digvijay singh

 

 

అడ్డగోలుగా తెలంగాణ ఇచ్చేసి యువరాజు రాహుల్ని దొడ్డిదారిలో అయినా పీఎం చేయాలని ప్లాన్ వేసిన కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున లేచిన నిరసన జ్వాలల ధాటికి డీలాపడినట్టే అనిపిస్తోంది. పైకి విభజన మీద వెనక్కి తగ్గేది లేదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, సీమాంధ్రులను మంచి చేసుకునే ప్రయత్నాలు చేస్తూనే వుంది.

 

తాజాగా ఢిల్లీ కాంగ్రెస్ నాయకుల మాటతీరు చూస్తుంటే హైదరాబాద్‌ని శాశ్వత యు.టి. చేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తాజాగా హైదరాబాద్‌ని యు.టి. చేయడమే అన్ని సమస్యలకి పరిష్కారం అని  కేంద్రమంత్రి జేడీ శీలం చేసిన వ్యాఖ్యలు ఏవో ఆషామాషీగా చేసినవి కావని అంటున్నారు. జేడీ శీలం నోటికొచ్చినట్టు మాట్లాడే వ్యక్తికాదు. గతంలో ఉండవల్లి, లగడపాటి లాంటి సీమాంధ్ర  కాంగ్రెస్ నాయకులంతా తెలంగాణ రాదని కుండ బద్దలు కొట్టిన కాలంలో కూడా జేడీ శీలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం ఖాయమని నిర్మొహమాటంగా చెప్పారు.  ఇంకా చాలా సందర్భాలలో  శీలం చెప్పిన మాటలు శీలంతో కూడుకునే వున్నాయి.


చాలామంది సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల మాదిరిగా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పే అలవాటు లేని  జేడీ శీలం యు.టి.యే అన్ని సమస్యలకు పరిష్కారం అని అన్నారంటే నిప్పు లేకుండా పొగ రాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఐఎఎస్ ఆఫీసర్ అయిన జేడీ శీలం సోనియాగాంధీకి వీర విధేయుడిగా వుంటూ, కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. అలాంటి వ్యక్తి నోటి వెంట వచ్చిన మాటని ఆషామాషీగా తీసుకోవడానికి వీల్లేదు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడినా లైట్‌గా తీసుకునే దిగ్విజయ్‌సింగ్ కూడా జేడీ శీలం నోటివెంట యు.టి. అనే మాట రాగానే ఢిల్లీలో ఉన్నవాడు ఉలిక్కిపడి కవర్ చేయడానికి ఏదేదో మాట్లాడాడు. యు.టి. చేస్తున్నామని నేనెవరితోనూ అనలేదు అన్నాడు. డిగ్గీ అన్నాడని ఎవరన్నారంట? డిగ్గీరాజా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న సామెతని రుజువు చేసేట్టు మాట్లాడాడంటే  హైదరాబాద్‌ని యు.టి. చేయడం ఖాయమనే అనిపిస్తోంది.