ఆత్మహత్యలకు కారణం మనమే!

 

హత్యలు, ఆత్మహత్యల వార్తలు ఎప్పుడూ వినిపించేవే. కానీ అవి ఇంకా ప్రపంచాన్ని చూడాల్సిన కుర్రవాళ్లవి అయితే బాధాకరం. నవ్వుతూ తుళ్లుతూ సాగే సెలయేరు కాస్తా ఒక్కసారిగా మాయమైపోవడం ఎంత దారుణం! కానీ ఏ దిష్టి తగిలిందో కానీ ఈ వారం ఏ రోజు ఏ పేపరు చూసినా ఇలాంటి వార్తలే కనిపిస్తున్నాయి.

- ఆలస్యంగా పరీక్ష హాలుకి వెళ్లినందుకు పరీక్ష రాయలేక ఓ 28 ఏళ్ల యువకుడు దిల్లీలో ఆత్మహత్య చేసుకున్నాడు.

- హైదరాబాదుకి చెందిన 18 ఏళ్ల జస్లీన్‌ కౌర్‌ నీట్‌ పరీక్ష సరిగా రాయనందుకు పదంతస్తుల మీద నుంచి దూకి చనిపోయింది.

- తమిళనాడులో ప్రతిభ, శుభశ్రీ అనే ఇద్దరు అమ్మాయిలు నీట్‌లో ఉత్తీర్ణత రానందుకు తనువు చాలించారు.

ఏదో ఉదాహరణగా చెప్పుకోవాలి కాబట్టి పై మూడు సందర్భాలూ చెప్పుకొన్నాం. కానీ చెప్పుకొనేందుకు స్థలం చాలని వార్తలెన్నో. ఏదన్నా పరీక్ష ఫలితాలు వస్తున్నాయంటే ఇంతకుముందు ఓ పండుగ వాతావరణం కనిపించేంది. పాసయ్యేవాళ్లు సంతోషించేవాళ్లు, ఫెయిల్‌ అయ్యేవాళ్లు ఓ రెండ్రోజులు బాధపడి ప్రత్నామ్నాయం దిశగా సాగిపోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్ని ఆత్మహత్యల వార్తలు వినాలో అని భయపడాల్సి వస్తోంది.

ఇంత దరిద్రపుగొట్టు పరిస్థితి ఎందుకు వచ్చిందా అంటే- దానికి కారణం మన విద్యావ్యవస్థే అని చెప్పుకోవడంలో సంకోచించాల్సిన అవసరం లేదు. పిల్లల్ని విచక్షణ కలిగిన మనుషులుగా తీర్చిదిద్దాల్సిన వ్యవస్థ వాళ్లని పందెంకోళ్లుగా దిగజారుస్తోంది. కార్పొరేట్‌ సంస్థల సంతల్లో పిల్లలు బలిపశువులుగా మారిపోతున్నారు. చాలామంది ఇదంతా కేవలం ప్రైవేట్‌ స్కూళ్ల వల్లే జరుగుతున్న అనర్థం అంటారు. ఒకరకంగా నిజమే కావచ్చు. ఫలితాల మర్నాడు టీవీలలో వినిపించే అరుపులూ, పేపర్లలో మొదటి పేజీలలో కనిపించే మెరుపులూ... ర్యాంకుల కోసం రోడ్డున పడి మరీ కొట్టుకునే వివాదాలూ చూసి కార్పొరేట్‌ సంస్థల సంస్కారం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ బలుపుకి బలాన్నిస్తోంది మాత్రం తల్లిదండ్రులే!

ఇప్పుడు పిల్లల ర్యాంకులు ఓ స్టేటస్‌, వాళ్లు చటుక్కున ఎంట్రెన్సులలో పాసైపోయి క్యాంపస్ ఇంటర్వ్యూలలో లక్షల జీతానికి కుదురుకుంటేనే సమర్థత, అమెరికాలో గ్రీన్‌కార్డు సంపాదించుకుంటే వంశోద్ధరణ! తెలుగువారిలోనే ఈ తరహా జాడ్యం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే దేశంలో ఎక్కడా కనిపించని విధంగా తెలుగుగడ్డ మీద కార్పొరేట్‌ సంస్థలు వీరంగం వేస్తుంటాయి. మార్కులు, ఎంట్రెన్సులకి సంబంధించిన వార్తలలో తెలుగు పేర్లే వినిపిస్తుంటాయి. మరి ఇతర రంగాల మాటో అంతరిక్ష పరిశోధన, సాహిత్యం, సంగీతం, రాజకీయం, సమాజసేవ, వ్యాపారం... ఇలాంటి రంగాలలో మనం కనిపించమే! ఈ ఒక్క ప్రశ్న చాలు, మన ప్రాధాన్యతలు ఏమిటో తెలియడానికి.

మన సామర్థ్యాన్ని మార్కులతోను, భవిష్యత్తుని ఎంట్రెన్సులతోను కొలుస్తున్నప్పుడు యువతకి చదువే ‘ప్రాణం’ అన్న భ్రాంతి కలగడంలో తప్పేముంది. అలాగని పిల్లలలో చదువు పట్ల విముఖత కలిగించాలని కాదు. చదువు జీవితంలో ఓ ముఖ్యభాగమే కానీ, చదువే జీవితం కాదని తెలియచెప్పాలి; పిల్లవాడిలో అనూహ్యమైన ఆసక్తులు ఉంటే, వాటిని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి; ఆరోగ్యవంతమైన అలవాట్లకీ, ఆటపాటలకీ అవకాశం ఇవ్వాలి; చదువులో వెనకబడినప్పుడు కారణాలు తెలుసుకోవాలి; మార్కులు తక్కువగా వస్తే ప్రత్యామ్నాయాలను సూచించాలి.

అన్నింటికీ మించి పిల్లవాడిలో జీవితం పట్ల నిబ్బరాన్నీ, గమ్యం పట్ల స్పష్టతనీ అలవర్చుకునేలా చేయాలి. అప్పుడు పిల్లవాడు ఎప్పుడ్నా పరీక్షలో తప్పుతాడేమో కానీ, జీవితంలో మాత్రం తప్పడు. ఇవేవీ ఎరగని పిల్లవాడు ఎన్ని మార్కులు సాధించినా.... జీవితంలో మాత్రం అరకొర మార్కులతోనే మిగిలిపోతాడు. ఇప్పుడు ఎంపిక మన చేతుల్లోనే ఉంది- పరీక్షా? జీవితమా? ఏది ముఖ్యం!