హైదరాబాద్‌లో మహానిమజ్జనం అదుర్స్... ఫస్ట్ టైమ్ RSS చీఫ్ మోహన్ భగవత్...

హైదరాబాద్‌లో వినాయక మహానిమజ్జనం అంగరంగ వైభవంగా సాగింది. వివిధ మార్గాల్లో దాదాపు 400 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరిగింది. భక్తుల కోలాటాలు, నృత్యాలు, విజిల్స్, డప్పు శబ్దాలతో భాగ్యనగర రహదారులన్నీ దద్దరిల్లిపోయాయి. 18 ప్రధాన మార్గాల్లో శోభాయాత్ర శోభాయమానంగా జరగగా, అందంగా అలకరించిన భారీ వాహనాల్లో గణనాథులు తరలివచ్చి ట్యాంక్ బండ్ దగ్గర గంగమ్మ ఒడికి చేరుకున్నారు. ఇక మహానిమజ్జనోత్సవాన్ని కన్నులారా చూసేందుకు నగరం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. దాంతో ట్యాంక్ బండ్ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి.

ఇక ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవంగా సందడిగా జరిగింది. ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ సిక్స్ దగ్గర హుస్సేన్ సాగర్ లో భారీ బొజ్జగణపయ్యను నిమజ్జనం చేశారు. ఉదయమే ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభించిన నిర్వాహకులు... కేవలం ఆరేడు గంటల్లోనే ట్యాంక్ బండ్ కి తరలించి మధ్యాహ్నం రెండు గంటలకల్లా నిమజ్జనం పూర్తిచేశారు. అయితే, దారిపొడవునా ఖైరతాబాద్ గణపతికి ప్రజలు జయజయధ్వానాలు పలికారు. ఇక మహాగణపతి శోభాయాత్ర, వీడ్కోలు కార్యక్రమాన్ని స్వయంగా తలకించి తన్మయత్వం చెందారు. అంతేకాదు, వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసరాలు జనసంద్రాన్ని తలపించాయి.

ఇదిలాఉంటే, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్... మొట్టమొదటిసారి భాగ్యనగర గణేష్ శోభాయాత్రలో పాల్గొన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోహన్ భగవత్ రాకతో చార్మినార్ ప్రాంతం మరింత కోలాహలంగా మారింది. పాతబస్తీ మార్గంలో పలుచోట్ల శోభాయాత్రలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్... భక్తులనుద్దేశించి ప్రసంగించారు. మొత్తంగా, హైదరాబాద్ మహానగరంలో మహానిమజ్జనోత్సవం కన్నుల పండువగా సాగింది.