హైదరాబాద్ పై మొదలయిన చిచ్చు

 

హైదరాబాద్ పై రెండు ప్రాంతాలవారి పట్టుదలలు గురించి కేంద్రానికి పూర్తి అవగాహన ఉన్నపటికీ, దానిపై సరయిన వివరణ ఈయకుండా, హైదరాబాదును పదేళ్ళపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని క్లుప్తంగా చెప్పి రాష్ట్ర విభజన ప్రకటన చేసి చేతులు దులుపుకొంది. కేంద్రం హైదరాబాద్ పై స్పష్టత ఈయకపోవడంతో దానిపై రకరకాల అనుమానాలు, ఊహాగానాలు, వాదనలు, ప్రతిపాదనలు మొదలయ్యాయి. కొంత మంది నేతలు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరుతుంటే, మరికొందరు దేశానికి రెండవ రాజధానిగా ప్రకటించి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు మరో సరికొత్త రాజధానులు ఏర్పరచాలని వాదిస్తున్నారు.

 

చిరంజీవికి అత్యంత సన్నిహితుడుగా చెప్పబడుతున్న మంత్రి సి.రామచంద్రయ్య హైదరాబాద్ ను శాశ్వితంగా ఉమ్మడి రాజధానిగా ఉంచాలని మరో సరికొత్త ప్రతిపాదన చేసారు. అయితే, హైదరాబాద్ కి ఆంధ్ర ప్రాంతానికి మధ్య తెలంగాణా ప్రాంతాలు ఉండటం వలన హైదరాబాదును శాశ్విత ప్రాతిపాదికన రాజధానిగా చేయడం అసాదయం. అయినప్పటికీ, అక్కడ నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొనే ఇటువంటి ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. నిన్న కొందరు కాంగ్రెస్ యంపీలు రాజీనామాలు చేసిన తరువాత కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపివచ్చిన చిరంజీవి కూడా హైదరాబాద్ ను శాశ్విత ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలని కోరడం గమనిస్తే బహుశః కేంద్రం కూడా అటువంటి ఆలోచనలోనే ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే, ఇటువంటి ప్రతిపాదనలు చేసినంత తేలికగా ఆచరణ సాధ్యం కాదు.

 

రాష్ట్ర విభజన ప్రక్రియ సజావుగా సాగాలంటే, ముందుగా రాజధాని హైదరాబాద్ పై రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఉన్న భయాలు, అపోహలు, అనుమానాలను తొలగించవలసి ఉంటుంది. హైదరాబాద్ మరియు ఇతర అంశాలను అధ్యయనంచేసి ఇరు ప్రాంతాల వారికి ఆమోధయోగ్యమయిన తగిన పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు నిన్ననే ప్రకటించింది.

 

అయితే, కేసీఆర్ వంటి అతివాదులు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తుండటం వల్ల, అక్కడ స్థిరపడిన లక్షలాది ఆంద్ర ప్రజల భయాందోళనలు మరింత పెరిగాయి. అనేక సంవత్సరాలుగా ఒకే చోట కలిసిమెలిసి పనిచేస్తున్న ఉద్యోగులలో ఇటువంటివి చిచ్చు పెట్టి వారి మధ్య ఉద్రిక్తతలకు పెంచడం ఖాయం. అదేవిధంగా హైదరాబాదులో నివసిస్తున్న ప్రజల మధ్య కూడా వైషమ్యాలు సృష్టించడం ఖాయం. అందువల్ల కేంద్రం హైదరాబాద్ ను ముందు తన అధీనంలోకి తీసుకొని ప్రజల అపోహలు దూరం చేయడం మంచిది. లేకుంటే రెండు ప్రాంతాల అతివాదుల వాద ప్రతివాదాల కారణంగా ప్రజల మధ్య ఘర్షణ చెలరేగితే మరో కొత్త సమస్య మొదలవుతుంది. చేతులు కాలిన తరువాతనే ఆకులు పట్టుకొనే అలవాటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇకనయినా ఆ అలవాటు మానుకొని ముందుగానే మేల్కొంటే మంచిది.