మన ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేదెన్నడు?

 

హైదరాబాదులో నిన్న జరిగిన బాంబు పేలుళ్ళు తరువాత పోలీసు అధికారుల హడావుడి, రాష్ట్రమంతటా రెడ్ఎలెర్ట్ ప్రకటన, ప్రభుత్వ ఎక్స్ గ్రేషియా ప్రకటనలు, దోషులను వదిలేదిలేదని ముఖ్యమంత్రి హామీలు, అధికార ప్రతిపక్షాల నిందారోపణలు అన్నీ ఒకదాని తరువాత మరొకటి చక్కగా పద్దతిగా జరిగిపోతూ, మనం వ్యవస్థలో అన్నివిభాగాలు కూడా సక్రమంగా పనిచేసుకుపోతున్నాయని నిరూపిస్తున్నాయి.

 

ఉగ్రవాదులు దాడిచేసే అవకాశం ఉందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రానికి ముందుస్తు హెచ్చరికలు చేసినప్పటికీ, సరిగా స్పందించక అలసత్వం ప్రదర్శించారని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని, ముఖ్యంగా పోలీసులను నిందిస్తున్నారు. అటువంటి హెచ్చరికలు నిత్యం వస్తున్నవేనని డీజీపీ దినేష్‌ రెడ్డి సర్దిచెపుతున్నారు.

 

నిన్న జరిగిన ఈ ప్రేలుళ్ళు, గతం నుండి మన ప్రభుత్వాలు ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోలేదని మరోసారి ఋజువు చేసాయి. గుణపాఠాలు నేర్చుకోకపోతే పోయె, కనీసం అటువంటి సంఘటనలు జరుగబోతున్నాయని తెలిసిన తరువాత కూడా అంత ఉదాసీనత చూపడం మనకే చెల్లు. తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పినట్లు, దేశ భద్రత మీద దృష్టి పెట్టవలసిన మన గూడచారి వర్గాలను, ప్రతిపక్షాల కదలికల మీద, వారి కార్యక్రమాల మీద దృష్టి పెట్టేందుకు మన ప్రభుత్వాలు వినియోగిస్తున్నపుడు వారి నుండి ఇంత కన్నాఎక్కువ ఏమి ఆశించగలమన్నమాటలు, నిఘా వ్యవస్థల వైఫల్యానికి కారణాలు తెలుపుతున్నాయి.

 

కేవలం, దోషులను పట్టుకొని ఉరితీసి, భాదితులకు ఎక్స్ గ్రేషియా విదిలించినంత మాత్రాన్న ప్రభుత్వ బాధ్యత తీరిపోదు. ప్రజల రక్షణకు వారే పూర్తీ బాద్యత వహించక తప్పదు. అందుకే వారిని ప్రజలు ఎన్నుకోన్నారని గ్రహించాలి.

 

అదే విధంగా, ప్రజలకు భద్రత కల్పించాల్సిన, పోలీసు శాఖను రాజకీయనాయకుల భద్రతకు, వీవీఐపీల రాకపోకల సమయంలో భద్రతకు, ఇతర పనులకు వినియోగించుకోవడం, ప్రభుత్వానికి ప్రజల భద్రతపై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలియజేస్తోంది. రాన్రాను పెరుగుతున్న ఉగ్రవాద దాడులను సమర్ధంగా ఎదుర్కొనేందుకు, ప్రత్యేకమయిన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసుకొనకపోగా, ఉన్న పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేయడం సిగ్గుచేటు.

 

ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, దొంగతనాలు, ఇతర చిన్న, పెద్ద నేరాలను చూసేందుకు ఏర్పాటు చేసుకొన్న మన పోలీసు వ్యవస్థను, ఉగ్రవాదులను పట్టుకోవడానికి కూడా ఉపయోగించు కోవలనుకోవడం అవివేకం తప్ప మరొకటి కాదు. అటువంటి క్లిష్టమయిన పనులను నిర్వహించేందుకు శిక్షణ పొందని పోలీసులను తప్పుబట్టే బదులు, వారి తలకు మించిన పనిని అప్పగించిన ప్రభుత్వాన్ని ఈ విషయంలో నిందించక తప్పదు.

 

గతంలో గోకుల్ చాట్, లుంభినీ పార్కుల వద్ద జరిగిన ఘటనల తరువాత, ప్రభుత్వం ‘అక్టోపస్’ అనే ఒక ప్రత్యేక ఉగ్రవాద నిరోధ సంస్థను సృష్టించింది. అయితే, అది కూడా సక్రమంగా పనిచేయట్లేదని ఇప్పుడు జరిగిన ప్రేలుళ్ళు నిరూపిస్తున్నాయి.

 

ప్రభుత్వం అంటే రాజకీయాలు, అధికారకోసం సిగపట్లు తప్ప మరొకటి కాదని నిరూపిస్తున్న మన రాజకీయ నాయకులు, ఇటువంటి క్లిష్టమయిన విషయాలలో సరయిన అవగాహన లేకపోవడం వల్లనే రాజకీయ జోక్యంతో వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేస్తున్నారు. తత్ఫలితమే పునరావ్రుతమవుతున్న ఇటువంటి సంఘటనలు.

 

రాజకీయ నేతలలో మార్పు రానంతవరకూ, ప్రభుత్వాలలో కూడా మార్పులు ఆశించలేము. ప్రభుత్వాలలో మార్పులు రానంతవరకూ ప్రజలకి భద్రతను ఆశించలేము. మన ప్రభుత్వాలు కేవలం ‘ఫైర్ ఫైటర్’ పనికే పరిమితమవుతున్నాయి తప్ప, అసలు మంటలు అంటుకోకుండా నిరోదించే ప్రయత్నాలు మాత్రం చేయలేకపోతున్నాయి. అందువల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతం కాక మానవని ప్రజలు కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది.