క్లైమాక్స్‌కి హుజూర్‌నగర్‌ క్యాంపైన్... ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ

హుజూర్‌నగర్‌ బైపోల్‌ క్యాంపైన్ క్లైమాక్స్‌కి చేరింది. ప్రధాన పార్టీల అభ్యర్ధులంతా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ర్యాలీలు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా నువ్వానేనా అంటూ తలపడుతోన్న కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హుజూర్‌నగర్‌ ఉపపోరు బరిలో నిలిచిన బీజేపీ, టీడీపీ సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

అభివృద్ధి, సంక్షేమ పథకాల నినాదంతో బరిలోకి దిగిన అధికార టీఆర్‌ఎస్‌ ఈసారి ఎలాగైనాసరే హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తుండగా... మూడుసార్లు ఈ స్థానాన్ని గెలుచుకున్న కాంగ్రెస్‌ మరోసారి విజయం సాధించి సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక, నియోజవర్గమంతా తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి సైదిరెడ్డి... తనకు ఒక్క అవకాశం ఇస్తే.... హుజూర్‌ నగర్‌ ను అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలను కోరుతున్నారు.

అక్టోబర్ 21న జరగనున్న పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, ఎక్కడా ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకుండా ప్రత్యేక పరిశీలకుడు భాస్కరన్‌ టీమ్‌ డేగకన్నుతో కాపలా కాస్తోంది. అయితే... అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారోనన్న ఉత్కంఠ నెలకొంది. దాంతో హుజూర్‌నగర్‌ ఫలితం కోసం యావత్‌ రాష్ట్రం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.