కరీంనగర్ జిల్లా విభజనతో చీలిన క్యాడర్.. అయోమయంలో తండ్రి కొడుకులు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టిఆర్ఎస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాశించారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంట నడిచిన సీనియర్ పొలిటీషియన్ కావడంతో సహజంగానే పార్టీ నేతలు ఆయనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. తన రాజకీయ వారసుడిగా పరిచయమైన ప్రస్తుత హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబుకు అలాంటి ప్రాధాన్యతనే పార్టీ శ్రేణులు ఇచ్చేవారు.  

జిల్లాల విభజన తర్వాత సీన్ మారిపోయింది. హుస్నాబాద్ నియోజక వర్గం మూడు జిల్లాల పరిధిలోకి వెళ్ళిపోవడంతో ఈ తండ్రీ కొడుకులకు కొత్త సమస్యలు మొదలయ్యాయి. వారిని పట్టించుకునే వారే కరువైపోయారు అంటున్నారు. జిల్లాల విభజన తర్వాత కరీంనగర్ వరంగల్ అర్బన్ జిల్లా సిద్దిపేట జిల్లాల పరిధిలోకి హుస్నాబాద్ నియోజక వర్గం వెళ్లింది. కరీంనగర్ జిల్లా పరిధిలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే సతీష్ బాబు చెప్పిన వారికే పదవులు వరిస్తూ ఉండగా.. వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో మాత్రం భిన్నమైన పరిణామాలు ఎదురవుతున్నాయి. తమ అనుచరులకు పదవులు ఇప్పించుకోవటం కష్టమవుతుందని అంటున్నారు. అంతేకాదు కనీసం సమాచారం లేకుండా నామినేటెడ్ పదవులను ఆ జిల్లా నేతలు భర్తీ చేస్తూ ఉండడంతో వీరికి ఆగ్రహం తెప్పిస్తోందని చెప్తున్నారు. కుడాకు సంబంధించిన పదవుల్లో హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన వారికి ప్రాధాన్యం కల్పించకపోవడంతో ఎల్కతుర్తిలో జరిగిన సమావేశంలో బహిరంగంగానే తండ్రీ కొడుకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా వాళ్లు దగ్గరికి రానివ్వరు, వరంగల్ జిల్లా వాళ్లు పట్టించుకోరంటూ ఎమ్మెల్యే సతీష్ బాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలో హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన వారికి డైరెక్టర్ల పదవుల్లో ప్రాధాన్యం కల్పించకపోవడం లక్ష్మీకాంత రావుకు, సతీష్ బాబుకు కోపం తెప్పించిందని పార్టీలో అనుకుంటున్నారు. లోకల్ నేతలకు ఇచ్చిన ప్రాధాన్యం హుస్నాబాద్ నియోజక వర్గ పరిధి లోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల నేతలకు కల్పించకపోవడం పై లక్ష్మీకాంతరావు చురకలేస్తున్నారు. హుస్నాబాద్ నియోజక వర్గం మూడు జిల్లాల పరిధిలోకి వెళ్లడంతో స్థానిక ఎమ్మెల్యే సతీష్ బాబు మూడు జిల్లాల అధికారులతో పాటు ప్రధాన నేతలతోనూ సంబంధాలను కొనసాగించడం కష్టం గా మారింది. ఒక జిల్లా వైపు రాజకీయ పరిణామాలను సరిదిద్దేలోపే మరో జిల్లా పరిధిలో ఇంకో సమస్య ఎదురవుతుంది. దీనివల్ల పార్టీ శ్రేణుల్లో కాస్త అసంతృప్తి వ్యక్తమవుతోందని అంటున్నారు. అసంతృప్తిని తగ్గించేందుకు నేరుగా లక్ష్మీకాంతరావు జోక్యం చేసుకుంటున్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి తగిన ప్రాధాన్యం కల్పించాలంటూ మిగతా జిల్లాల నేతలకు కాస్త గట్టిగానే చెబుతున్నారు. కొడుకు కోసం తండ్రి.. క్యాడర్ కోసం ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి అంటున్నారు జనాలు.