విలువైన సంపద – మానవత్వమే!


చాలా రోజుల క్రితం అరబ్‌ దేశంలో ఓ వర్తకుడు ఉండేవాడు. ఆ వర్తకుడి దగ్గర ఉన్న గుర్రం చుట్టుపక్కలలోకెల్లా అద్భుతమైనది చెప్పుకొనేవారు. దాని అందానికి కానీ, వేగానికి కానీ సాటి వచ్చే గుర్రం మరోటి లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి గుర్రాన్ని చేజిక్కించుకోవాలని చుట్టుపక్కల ధనవంతులంతా తెగ ఉబలాటపడేవారు. వారిలో ఒమర్‌ ఒకడు. వర్తకుడి గుర్రం కోసం ఒమర్ ఎంత ధనం ఇవ్వచూపినా, బదులుగా ఎన్ని ఒంటెలను ఇస్తానన్నా వర్తకుడు ఏమాత్రం లొంగలేదు. తన గుర్రాన్ని ఎట్టి పరిస్థితులలోనూ ఎవ్వరికీ ఇవ్వబోనని తేల్చి చెప్పేశాడు.

 

వర్తకుడు తన డబ్బుకి లొంగకపోయేసరికి ఒమర్ అహంకారం దెబ్బతిన్నది. పైగా అంత అద్భుతమైన గుర్రం తన దగ్గరే ఉండాలన్నా పట్టుదలా పెరిగిపోయింది. దాంతో- మోసం చేసైనా సరే ఆ గుర్రాన్ని చేజిక్కించుకోవాలని ఒమర్‌ పథకం వేశాడు. ఒక బిచ్చగాడి వేషం వేసుకుని వర్తకుడు వెళ్లే దారిలో పడుకున్నాడు. ఒమర్‌ కాసేపు ఎదురుచూసిన తరువాత అటుగా వర్తకుడు రానే వచ్చాడు. బిచ్చగాడి వేషంలో ఉన్న ఒమర్‌ని చూసి జాలిపడ్డాడు. తన గుర్రం మీద నుంచి దిగివచ్చి అతని చేతిలో కాసిని దీనార్లు ఉంచాడు. తన సంచిలో ఉన్న రొట్టె ముక్కలని అందించాడు. ఇంత చేసినా అతని తృప్తి తీరలేదు ‘నీ కోసం నేను ఏమన్నా చేయగలనా!’ అని అడిగాడు. ‘దయచేసి నన్ను మీ గుర్రం మీద ఎక్కించుకుని మీతో పాటు పట్నానికి తీసుకుపోగలరా! అక్కడ నేను ఏమన్నా జీవనోపాధి చూసుకుంటాను,’ అని అర్థించాడు బిచ్చగాడి వేషంలో ఉన్న ఒమర్‌.

 

ఒమర్‌ మాటలకు వర్తకుడు కరిగిపోయాడు. వెంటనే తనతో పాటుగా పట్నానికి తీసుకువెళ్లేందుకు సిద్ధపడ్డాడు. అందుకోసం బిచ్చగాడిని ముందుగా తన గుర్రం మీదకు ఎక్కించాడు. ఒమర్‌కు కావల్సింది అదే! గుర్రం మీదకు ఎక్కిన వెంటనే దాని జీనుని అందుకుని ఒక్కసారిగా దౌడు తీయించాడు. జరిగిన దానికి వర్తకుడు ఒక్కసారిగా మ్రాన్పడిపోయాడు. అయినా వెంటనే తేరుకుని... ‘గుర్రాన్ని తీసుకుపోతే పోయావు! కానీ ఒక్కమాట విని వెళ్లు!’ అని అరిచాడు. వర్తకుడు ఏం చెబుతాడా అని ఆసక్తిగా ఆగాడు ఒమర్. ‘నువ్వు నా గుర్రాన్ని ఇలా చేజిక్కించుకున్న విషయాన్ని దయచేసి ఎవరితోనూ చెప్పవద్దు,’ అన్నాడు కళ్లనీరు పెట్టుకుంటూ వర్తకుడు.

 

‘ఏం నీ పరువు పోతుందా!’ చిద్విలాసంగా అడిగాడు ఒమర్.

‘అహా పరువు గురించి కాదు. ఈ విషయం కనుక నలుగురికీ తెలిస్తే... ఇక మీదట ఎవ్వరూ దారి పక్కన పడి ఉన్న పేదవాడికి సాయం చేసేందుకు ఆగరు. మానవత్వం మీద పేదల మీద జనానికి నమ్మకమే పోతుంది,’ అన్నాడు వర్తకుడు.
వర్తకుడి మాటలకి ఏం సమాధానం చెప్పాలో ఒమర్‌కు పాలుపోలేదు. వెంటనే గుర్రం దిగి అక్కడి నుంచి వడివడిగా నడిచి వెళ్లిపోయాడు.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.