విశాఖకు రాజధాని తరలిస్తే ఇంత నష్టమా? కలలో కూడా ఊహించలేరు!!

ఏపీ రాజధానిని మూడు భాగాలుగా విభజించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ని విమర్శలు ఎదురైనా.. మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గకుండా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ అయింది. అయితే ఈ మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కొత్త రాజధానిని నిర్మించడం అంటే.. పసి పిల్లాడిని పెంచి పెద్ద చేయడం లాంటిది. పిల్లోడు పుష్టిగా పెరగాలంటే టైంకి పాలు, ఫుడ్, నీళ్లు సరిగ్గా అందించాలి. అలా కాకుండా పాలు ఒక దగ్గర, ఫుడ్ ఒక దగ్గర, నీళ్లు మరో దగ్గర అంటూ.. అటు ఇటు తిప్పితే పిల్లోడి ఎదుగుదలకే ప్రమాదం. ఇప్పుడు ఏపీ పరిస్థితి కూడా అలానే ఉంది. ముందు రాజధానిగా ఓ పెద్ద నగరాన్ని నిర్మించి అభివృద్ధికి బలమైన పునాది వేయాలి. ఆ రాజధాని మీద వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని మిగతా నగరాలను అభివృద్ధి చేయాలి. దానిని అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు. దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అంతేకాని ఇలా పరిపాలన వికేంద్రీకరణ చేయడం వల్ల ఒరిగేదేమి లేదు. ఇలా మూడు నాలుగు రాజధానుల అనుకంటూ పొతే.. ఏపీకి అంటూ ఓ పెద్ద నగరం లేకుండా పోతుంది. ఎక్కడా పూర్తిగా అభివృద్ధి జరగదు. పెద్ద పెద్ద కంపెనీలు రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపవు.

మన దేశంలోని పలు రాష్ట్రాలను తీసుకోండి. వాటికంటూ రాజధానిగా ఓ పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాతే.. రాష్ట్రంలోని మిగతా నగరాలను అభివృద్ధి చేసుకున్నాయి. తమిళనాడుని తీసుకోండి. రాజధాని చెన్నైని బాగా అభివృద్ధి చేసుకుంది. దాంతో పాటే కోయంబత్తూర్, తిర్పూర్, ట్రిచీ, సేలం ఇలా ఎన్నో నగరాలను అభివృద్ధి చేసుకుంది. మహారాష్ట్రని తీసుకుంటే ముంబై, నాగపూర్, పూణే ఇలా ఎన్నో నగరాలు అభివృద్ధి చెందాయి. సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణను తీసుకుంటే.. తెలంగాణకు ఆదాయం తెచ్చే కామధేనువు హైదరాబాద్. రాష్ట్రానికి భారీగా ఆదాయం తెచ్చే పునాది హైదరాబాద్ ఉంది కాబట్టే.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం వంటి నగరాలలో.. ఐటీ హబ్ లు, మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడుతోంది.

దాదాపు అన్ని రాష్ట్రాలు.. ముందు రాజధానిగా ఓ పెద్ద నగరాన్ని అభివృద్ధి చేసుకొని.. ఆ తరువాత రాష్ట్రంలోని మిగతా నగరాలని అభివృద్ధి చేసుకొని దూసుకుపోతున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం.. మూడు రాజధానులు పేరుతో.. అసలు ఏపీకి అంటూ ఓ పెద్ద నగరం లేకుండా చేస్తోంది. హైదరాబాద్ కి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. వసతులు, ఆదాయ వనరులు ఉండటంతో.. లక్షల్లో ప్రజలు హైదరాబాద్ కి వలస వచ్చారు. ఇప్పుడు ఏపీలో ప్రాంతానికో రాజధాని పెట్టుకుంటే పొతే.. పెట్టుబడులు ఎలా వస్తాయి? రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది?. ఈ మూడు రాజధానుల వల్ల ఏపీకి ఆదాయం తగ్గిపోవడమే కాదు.. భారీగా ఆర్ధిక భారం కూడా పడనుంది. గత ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించింది. వివిధ ప్రభుత్వ శాఖల కోసం పలు భవనాలు నిర్మించింది. అధికారులు, ఉద్యోగుల వసతి కోసం ఏర్పాటు చేసింది. ఇప్పుడు జగన్ సర్కార్ పరిపాలనను విశాఖకు మారిస్తే.. కొత్తగా భవనాలు నిర్మించాలి, ఉద్యోగులకు వసతి కల్పించాలి. ఇదంతా ఆర్ధిక భారం కాదా?

వివిధ శాఖలను తీసుకుంటే విశాఖకు తరలి వెళ్లాల్సిన ఉద్యోగులు సుమారుగా లక్షమంది ఉంటారు. ఈ ఉద్యోగులందరికీ విశాఖ వద్ద 200 చదరపు గజాల ఇంటి స్థలాలను నామమాత్రపు రేటుకు ప్రభుత్వం కేటాయిస్తుంది. కొత్త ఇళ్ల నిర్మాణానికి ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల ప్రత్యేక గృహనిర్మాణ భత్యం (హెచ్‌బిఎ) ఇవ్వనుంది. ఇళ్ళు నిర్మించే వరకు, ప్రభుత్వం ఉద్యోగులకు నివాస సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుంది. ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ .50 వేల నుండి గరిష్టంగా లక్ష రూపాయల వరకు షిఫ్టింగ్ భత్యం ఇవ్వనుంది.

1) ఒక్కొక్కరికి 200 గజాల ప్లాటు
గవర్నమెంటు రేటు వైజాగ్ లో గజం 21,000 కంటే తక్కువ ఎక్కడా లేదు.
అంటే 1,00,000x 200x 21,000 = 42,000 కోట్లలుతుంది.
రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టడటం సాధ్యం కాదన్న వారు.. కేవలం ఉద్యోగుల స్థలాల కోసం 42 వేల కోట్లు ఖర్చు పెట్టడం సాధ్యమేనా?
సరే ఎక్కడో సిటీకి దూరంగా ఇచ్చినా గజం రూ. 5,000 కంటే తక్కువ ఎక్కడా వుండదు.
పోనీ గజం 5,000 తీసుకున్నా.. 10,000 కోట్లు ఖర్చవుతుంది.

2) ఒక్కొక్కరికి 25 లక్షల గృహ నిర్మాణ భత్యం.
1,00,000 x 25,00,000 = 25 వేల కోట్లు

3) షిఫ్టింగు భత్యం 50,000 నుండి లక్ష వరకు.
సగటు గా ఒక్కొక్కరికి 75,000 అనుకుంటే
1,00,000 x 75,000 = 750 కోట్లు

అంటే కేవలం ఉద్యోగుల కోసమే దాదాపు 50 వేల కోట్లు వెచ్చించాల్సి వస్తుంది.
ఇంకా అయిపోలేదు. పలు శాఖల భవనాలు కూడా ఉన్నాయి.
* విజయవాడలో 4 లక్షల చదరపు అడుగులలో వంద కోట్ల ఖర్చుతో R&B భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో వంద కోట్లతో మరో భవనం నిర్మిస్తారా?
* మంగళగిరిలో 2 లక్షల చదరపు అడుగులలో 108 కోట్ల ఖర్చుతో ఏపీఐఐసీ భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 108 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా?
* మంగళగిరిలో లక్ష చదరపు అడుగులలో 40 కోట్ల ఖర్చుతో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 40 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా?
* విజయవాడలో లక్ష చదరపు అడుగులలో 143 కోట్ల ఖర్చుతో విద్యుత్ సౌధ నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 143 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా?
* వెలగపూడిలో శాసనసభ, శాసనమండలి మరియు సచివాలయం భవనాలకు కలిపి నిర్మాణానికి సుమారు 500 కోట్లు ఖర్చయింది. ఇప్పుడు మళ్లీ విశాఖలో సచివాలయం కోసం ఎన్ని కోట్లు ఖర్చుపెడతారు?
* గొల్లపూడిలో 30 వేల చదరపు అడుగులలో నాలుగున్నర కోట్ల ఖర్చుతో దేవాదాయ భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో మరో భవనం నిర్మిస్తారా?
* వెలగపూడిలో 58 కోట్ల ఖర్చుతో కమాండ్ కంట్రోల్ నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 58 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా?
* మంగళగిరిలో 65 వేల చదరపు అడుగులలో 19 కోట్ల ఖర్చుతో ఏపీ పోలీస్ టెక్ టవర్స్ నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 19 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా?

అమరావతిలో ఎన్నో భవనాల నిర్మాణం జరిగింది. వేల ఎకరాల భూమి ఉంది. ఆ భూమి అమ్మగా వచ్చిన డబ్బుతో రాజధానిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం రాజధానిని తరలించాలని నిర్ణయించింది. అసలే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఇన్ని వేల కోట్ల ఖర్చుతో రాజధానిని తరలిస్తే.. అదంతా ప్రభుత్వం మీద భారం కాదా? ప్రజా ధనం వృధా కాదా?. ఇప్పటికైనా ఆలోచించండి.