టీఆర్ఎస్, వైసీపీ దోస్తీ.. వైఎస్సార్ అభిమానుల రియాక్షన్ ఏంటి?

 

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీనే. జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే కేసీఆర్ ఆదేశాల మేరకు తాజాగా కేటీఆర్ జగన్ ను కలిశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్, వైసీపీ పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు దగ్గరవడానికి ఓ రకంగా చంద్రబాబు కారణమని చెప్పాలి. శత్రువుకి శత్రువు మన మిత్రుడు అవుతాడు అనే ఫార్ములా ఈ రెండు పార్టీల మధ్య దోస్తీ కుదిరేలా చేసిందని చెప్పాలి. ఏపీలో జగన్, చంద్రబాబు ప్రత్యర్థులు. చంద్రబాబుని గద్దె దించి ఎప్పుడెప్పుడు సీఎం కుర్చీలో కూర్చుందామా అని జగన్ ఎదురుచూస్తున్నారు. అదే విధంగా కేసీఆర్ కి కూడా చంద్రబాబు ప్రధాన ప్రత్యర్థి. చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకంచేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి కూటమిగా ఏర్పడి పని చేసారు. ఆ సమయంలో కేసీఆర్ చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకానొక దశలో టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాదు చంద్రబాబు అనే స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది. చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఏపీ రాజకీయాల్లో అడుగుపెడతాం అంటూ కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఏపీలో వైసీపీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నిజానికి టీఆర్ఎస్, వైసీపీల మధ్య దోస్తీ ఎప్పుడో కుదిరిందనేది బహిరంగ రహస్యం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలో ఉన్న ఒకరిద్దరు వైసీపీ నేతలు టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేసారు. ఇప్పుడు కేటీఆర్, జగన్ భేటీతో ఈ దోస్తీ ఆఫీసియల్ గా ట్రాక్ ఎక్కనుంది.

అయితే టీఆర్ఎస్, వైసీపీల దోస్తీని ఏపీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారంటే మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు మీద కోపంతో తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచిందని ఏపీలో వైసీపీ సంబరాలు చేసుకుంది. చంద్రబాబు మీద పంతం కొద్దీ కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో అడుగుపెడతానంటే వైసీపీ తమకేదో మేలు జరుగుతుందని గంతులేస్తుంది. కానీ సాధారణ ప్రజల ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఈమధ్య వరకు ఆంధ్రా వారి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు. కొన్ని సందర్భాల్లో ఏపీ నాయకుల మీదే కాకుండా సాధారణ ప్రజల మీద కూడా తీవ్ర విమర్శలు చేసారు. మరి ఆ మాటలన్నీ ఏపీ ప్రజల అంత త్వరగా మర్చిపోతారా?. అదీగాక ప్రస్తుతం ఏపీ ప్రజలు ప్రత్యేకహోదా కావాలని బలంగా కోరుకున్నారు. మరి టీఆర్ఎస్ నేతలు ఏపీకి ప్రత్యేకహోదా వస్తే కంపెనీలన్నీ ఏపీకి తరలిపోతాయని ప్రత్యేకహోదాని వ్యతిరేకించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి తరువాత యూ టర్న్ తీసుకున్న బీజేపీ మీద కోపంతో రగిలిపోతున్న ఏపీ ప్రజలు.. మరి ఇప్పుడు ప్రత్యేక హోదాని వ్యతిరేకించిన టీఆర్ఎస్ తో వైసీపీ దోస్తీ అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు?.

సాధారణ ప్రజలే కాదు వైఎస్సార్ అభిమానులు కూడా టీఆర్ఎస్, వైసీపీల దోస్తీని వ్యతిరేకిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో వైఎస్సార్ టీఆర్ఎస్ ను ఎంతగా వ్యతిరేకించేవారో తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా వైఎస్సార్.. కేసీఆర్, ఈటల రాజేందర్ వంటి నేతల మీద విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ఏమన్నా కేసీఆర్ జాగీరా? అంటూ మండిపడ్డారు. తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్ధమవుతుందా రాజేంద్ర? అని ఈటలని వైఎస్సార్ అసెంబ్లీలో విమర్శించడం తీవ్ర దుమారమే రేపింది. కేసీఆర్, హరీష్ రావు కూడా ఈమధ్య వరకు వైఎస్సార్ మీద తీవ్ర విమర్శలు చేసారు. అసలు వైఎస్సార్ బ్రతికుంటే టీఆర్ఎస్ ని ఎదగనిచ్చేవారు కాదనే మాటలు కూడా వినిపిస్తుంటాయి. మరి ఇవన్నీ మర్చిపోయి జగన్ చెప్పాడు కదా అని వైఎస్సార్ అభిమానులు టీఆర్ఎస్ దోస్తీని స్వాగతిస్తారా అంటే డౌటే. చూద్దాం మరి ఏపీ ప్రజలు, వైఎస్సార్ అభిమానులు టీఆర్ఎస్, వైసీపీ దోస్తీని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో.