ఇవి తింటే క్యాన్సర్‌ని ఆహ్వానించినట్టే!

చిన్నా పెద్దా ధనిక పేదా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కనికరం లేకుండా కబళిస్తోన్న వ్యాధి క్యాన్సర్. దీన్ని అరికట్టడం చేతకాక ప్రపంచం దేశాలన్నీ పరిశోధనల్లో మునిగి తేలుతున్నాయి. ఎందుకు వస్తుందో ఎవరికి వస్తుందో ఎలా వస్తుందో అర్థం కాని మహమ్మారి క్యాన్సర్. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాల జోకిలి పోకుండా ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు అన్నది మాత్రం సత్యం. 

 

బిస్కట్లు, కేకులు వంటి వాటి దగ్గర్నుంచి బొబ్బట్లు వంటి సంప్రదాయ వంటకాలన్నిటికీ ప్రధాన దినుసు మైదాపిండి. ఇది పాంక్రియాస్ మీద తీవ్ర ఒత్తిడి కలిగించి ఇన్సులిన్ లెవెల్స్ ని అస్తవ్యస్తం చేస్తుంది. అదే విధంగా చక్కెర కూడా ఎక్కువ తీసుకోకూడదు. స్థూలకాయం, మధుమేహాలకు కారణమయ్యే చక్కెర పాంక్రియాస్, కాలేయాలతో పాటు జీర్ణవ్యవస్థను కూడా పాడు చేస్తుంది. అందుకే పండ్లు, తేనె వంటి వాటి ద్వారా అందే సహజ చక్కెర తప్ప నేరుగా చక్కెరను తీసుకోవడం మంచిది కాదు. 

 

పాలు తాగితే ఎముకలు గట్టి పడతాయని అందరూ అంటారు. అయితే వయసు పెరిగేకొద్దీ పాలలో ఉండే ల్యాక్టోజ్ ను అరాయించుకునే శక్తి తగ్గిపోతుంది. కాబట్టి వయసు పెరిగేకొద్దీ పాలు మోతాదు దాటి తాగడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ప్యాట్రిక్ హాఫార్డ్. 

 

వీటితో పాటు సరిగ్గా ఉడికించకుండా క్షణాల్లో తయారుచేసే జంక్ ఫుడ్... చక్కెరతో పాటు కెమికల్స్ ఎక్కువగా ఉండే సోడాలు...  మైదా, పాలు, చక్కెర కలిపి తయారు చేసే డోనట్స్ కూడా  ఎంతో కీడు చేస్తాయి. ఒకేసారి పది చెంచాల చక్కెరని కడుపులోకి పంపించే ఏ ఆహార పదార్థమైనా ప్రమాదకరమేనంటారు న్యూయార్క్ టైమ్స్ సృష్టికర్త, ప్రముఖ వైద్యులు అయిన డాక్టర్ జోసెఫ్ మెర్కోలా.

 

ఇక సోడియం, నైట్రేట్ ఎక్కువగా ఉండే మాంస పదార్థాలని ముట్టవద్దనేది అమెరికన్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ సూచన. ఉప్పు ఎక్కువ వేసి, నూనెలో వేయించే బంగాళాదుంప చిప్స్ జోలికి పోవద్దంటున్నారు మసాచుసెట్స్ లోని క్లార్క్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ డేల్ హ్యాటిస్. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తరచుగా తీసుకుంటే ఉదర క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని 2005లొ క్యాన్సర్ సైన్స్ మ్యాగజైన్ చేసిన పరిశోధనలో సైతం వెల్లడైంది. అదే విధంగా క్యాన్స్ లో నిల్వ చేసి అమ్మే ఆహార పదార్థాలు,  మార్గరీన్ చీజ్ వంటివి కూడా ఎక్కువ తీసుకోకూడదనేది నిపుణుల సూచన.

 

కాబట్టి వీలైనంత వరకూ వీటి జోలికి పోకుండా జాగ్రత్తపడండి. క్యాన్సర్ ని మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా చూసుకోండి. 

- sameeranj