మంచి పాస్‌వర్డ్‌ కోసం 10 చిట్కాలు

ఇవాళ రేపట్లో కంప్యూటర్లో ఏదో ఒక అకౌంట్‌ లేకుండా పూట గడవడం లేదు. అది ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ కావచ్చు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ కావచ్చు... ఏదీ కాకపోయినా కనీసం ఈ-మెయిల్‌ అకౌంటన్నా కావచ్చు. వీటన్నింటికీ మంచి పాస్‌వర్డుని ఎంచుకోవడం ఒక సమస్యే! ఆ మన దగ్గరే ఏముందిలే నష్టపోయేందుకు అనుకోవడానికి కూడా లేదు. మన వ్యక్తిగత సమాచారాన్నీ, ఫైళ్లని తస్కరించడం దగ్గర్నుంచీ... మన కాంటాక్ట్‌ లిస్టులో ఉండేవారి మెయిల్స్‌కు తప్పుడు మెయిల్స్‌ పంపడం వరకూ హ్యాకర్లు దేనికైనా తెగించగలరు. ఎవరిపడితే వారి పాస్‌వర్డులను ఛేదించేందుకు ప్రత్యేకమైన సాఫ్టవేర్లు అందుబాటులో ఉన్నాయంటే నమ్మగలరా! అందుకే అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఈ చిట్కాలు-

 

1- చిన్నపాటి పాస్‌వర్డులకు కాలం చెల్లిపోయింది. మీ పాస్‌వర్డు కనీసం 10 అక్షరాలకు పైనే ఉండాలంటున్నారు నిపుణులు. ఇక మరీ జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భాలలో కనీసం 12 నుంచి 14 అక్షరాలు ఉండాలని సూచిస్తున్నారు.

 

2- పాస్‌వర్డులో కేవలం అక్షరాలే ఉంటే సరిపోదన్నది అందరికీ తెలిసిందే! అంకెలు, అంకెల దిగువున ఉండే సింబల్స్, క్యాపిటల్‌ లెటర్స్‌, స్మాల్‌ లెటర్స్ ఇలా కీబోర్డు మీద టైప్‌ చేయదగిన అన్ని రకాల సంకేతాలనీ వాడాల్సిందే!

 

3- మీకు సంబంధించిన వ్యక్తిగతమైన వివరాలని (ఉదా॥ పుట్టినరోజు, భార్యపేరు) పాస్‌వర్డులో ఉంచితే పాస్‌వర్డుని ఛేదించడం సులువైపోతుంది. అందుకే మీకు బాగా గుర్తుండి, మీ చుట్టుపక్కల వారికి ఏమాత్రం అవగాహన లేని (ఉదా॥ తల్లి తరఫు ఇంటి పేరు, పిల్లలకి పురుడు పోసిన డాక్టరు పేరు) పాస్‌వర్డులను ఎంచుకోవాలి.

 

 

 

4- నిఘంటువులో కనిపించే పదాలను (ఉదా॥ house, system, daughter) ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్‌వర్డుగా ఉంచకూడదు. వీటిని పాస్‌వర్డు తస్కరించే సాఫ్టవేర్లు పసిగట్టేస్తాయి. My wife, happy home వంటి రోజువారీ వాక్యాలను కూడా ఇవి పట్టేస్తాయి.

 

5- చాలామంది బలమైన పాస్‌వర్డునే ఎంచుకొంటారు. కానీ పాస్‌వర్డు మర్చిపోయినప్పుడు కంప్యూటర్‌ అడిగే ప్రశ్నలకు గాను చాలా తేలికైనవి ఎంచుకొంటారు. ఫలితంగా ఎవరైనా సదరు ప్రశ్నలకు జవాబు చెప్పి మీ అకౌంటులోకి ప్రవేశించే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.

 

 

 

6- మనసులో ఏదో ఒక వాక్యాన్ని అనుకొని అందులోని పదాల తొలి అక్షరాలతో పాస్‌వర్డుని ఏర్పాటు చేసుకోవడం ఒక మంచి పద్ధతి. ఉదా॥ My Son was born on 14th January 2000 అన్న వాక్యాన్ని గుర్తుంచుకోవడం చాలా తేలిక. దీని ఆధారంగా MSWBO1422000 అన్న పాస్‌వర్డుని సృష్టించుకోవచ్చు.

 

7- వేర్వేరు అకౌంట్లకి ఒకటే పాస్‌వర్డుని ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదన్నది నిపుణులు హెచ్చరిక. ఒకవేళ అలా వాడాల్సి వచ్చినా, తప్పనిసరిగా అందులో ఎంతో కొంత మార్పు చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు పైన ఎంచుకొన్న MSWBO1422000 పాస్‌వర్డుని AMAZONకి కూడా వాడాలనుకుంటే MSWBO-amaze-1422000 అంటూ పాస్‌వర్డుకి తగిన మార్పు చేయవచ్చు.

 

 

 

8- బ్యాంకింగ్‌ వంటి ఆర్థికపరమైన, గోప్యమైన లావాదేవీలు జరిపే ఖాతాలకి చెందిన పాస్‌వర్డుల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. వీటిని తరచూ మారుస్తూ ఉండటం, మరే ఇతర పాస్‌వర్డులతో సంబంధం లేకుండా ఉంచడం అవసరం. ఇందుకోసం ఎలాంటి అనుమానం రాని పాస్‌వర్డులు కావాలనుకుంటే ఆన్‌లైన్లో http://passwordsgenerator.net/ వంటి సైట్లు ఉచితంగా క్లిష్టమైన పాస్‌వర్డులను అందిస్తాయి.

 

9- ఎట్టి పరిస్థితులలోనూ పాస్‌వర్డుని బయటవారితో పంచుకోకూడదు. ఇవాళ ఉన్న బంధం రేపు ఉంటుందని చెప్పలేం కదా! ఒకవేళ అలా ఎవరితోనన్నా పాస్‌వర్డుని పంచుకోవల్సిన సందర్భం వచ్చినా, ఎవరికన్నా పాస్‌వర్డు తెలిసిపోయిందన్న అనుమానం కలిగినా... వెంటనే దానిని మార్చివేయడం మంచింది. 

 

10- ఈ రోజుల్లో పది రకాల ఖాతాలకు పది రకాల పాస్‌వర్డులు కావాల్సి వస్తోంది. పైగా అవి క్లిష్టంగా ఉండాలన్న నియమం ఎలాగూ ఉంది. దీంతో తరచూ ఏదో ఒక పాస్‌వర్డుని మర్చిపోవడం అతి సహజం. ఇందుకోసం వీటిని వీటిని ఎక్కడన్నా భద్రమైన చోట రాసి ఉంచుకోవడంలో తప్పులేదు. అయితే అలా రాసి ఉంచుకున్న కాగితాన్ని నిర్లక్ష్యంగా ఉంచితే మాత్రం అసలుకే ఎసరు తప్పదు!

- నిర్జర.