కలలను అదుపు చేసే వాసనలు

పిల్లల నుంచి పెద్దల దాకా అందర్నీ ఈ కలలు తన మాయాజాలంలో పడేస్తాయి. ఒకోసారి భయంకరమైన కలలు భయపెడితే, ఇంకోసారి మంచి కలలు హాయినిస్తాయి. కల కలేనని తెలిసినా ఎందుకో కలలు కూడా మంచివే రావాలని కోరుకుంటాం ఎవరైనా. కానీ కలల్ని మనమెలా శాసిస్తాం చెప్పడి మంచివి మాత్రమే రావాలని, చెడ్డకలలు రాకూడదని కదా! కానీ, కొంతవరకు ప్రభావితం అయితే చెయ్యచ్చు అంటున్నారు జర్మనీకి చెందిన పరిశోధకులు.

 

కలలపై వాసనల ప్రభావం

మనకొచ్చే కలలు మనం పీల్చే వాసనల మీద ఆధారపడి వుంటాయిట. అంటే, మంచి వాసనలను పీల్చినప్పుడు పాజిటివ్ కలలు, చెడు వాసనలు పీల్చినప్పుడు నెగటివ్ భావాల కలలు వస్తాయిట. జర్మనీ పరిశోధకులు కొంతమందిపై పరిశోధన చేసినప్పుడు ఈ విషయం తెలిసింది. నిద్రపోతున్న వారు అత్యధిక గాఢత కలిగిన మంచి, చెడు వాసనలను పీల్చేలా చేసి, వారి కలల్లో తలెత్తే మార్పుల్ని పరిశీలించారు హీడెల్ బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు. వాసన అందించే ప్రేరణను బట్టి కలల్లో మార్పులు రావడం గుర్తించారు వీరు. నిజానికి ఇలాంటి అధ్యయనం నిర్వహించడం ఎంతో కష్టం. ఎందుకంటే నిద్రలో ఉండేవారికి అందించే వాసన కలలపై ప్రభావం చూపించేంత గాఢంగా వుండాలి. అదే సమయంలో ఆ వాసన గాఢత వారిని నిద్ర నుంచి లేపేంతగా ఉండకూడదు. ఈ రెండింటి మధ్యగా వ్యక్తులు మంచి నిద్రలో వుండగా వారికి వాసనలు అందించి వారి కలల్లో వచ్చే మార్పులను అధ్యయనం చేయాలి. కొంచెం కష్టమైనా మొత్తానికి పరిశోధకులు మంచి ఫలితాలనే సాధించారు.
 

కలలపై లోతుగా అధ్యయనాలు

నిజానికి గతంలో కలలకు సంబంధించి ఎన్నో అధ్యయనాలు జరిగాయి. వాటిలో శబ్దాలు, ఒత్తిడి, వైబ్రేషన్స్ వంటివి కలలపై ప్రభావం చూపించడం గుర్తించారు. మనం నిద్రలో వుండగా బయట నుంచి వినిపించే శబ్దాలు కలలో జరిగే సంఘటనల్లో మనకి వినిపిస్తుండటం మనందరికీ తెలిసిందే. అలాగే రోజు మొత్తంలో జరిగే సంఘటనలు, మన మానసిక స్థితి మన కలలపై ప్రభావం చూపటం కూడా చూస్తుంటాం. అందుకే పిల్లలకి నిద్రపోయే ముందు భయపెట్టే కథల లాంటివి చెప్పకూడదు అంటారు పెద్దవాళ్ళు. ఇక మన విషయంలో కూడా నిద్రపోయే ముందు ఎలాంటి ఆలోచనలు లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలని అంటారు.
 

ఇంతకీ ఎందుకీ పరిశోధనలు?

శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో భాగంగా మంచి నిద్రలో ఉన్నవారికి కుళ్ళిన కోడిగుడ్ల వాసన చూపించారుట. దాంతో ఆ వాసన పీల్చినప్పుడు వారికి ప్రతికూల భావాలుండే కలలు రావడం గమనించారు. అలాగే గులాబీ పూల సువాసన పీల్చేలా చేసినప్పుడు సానుకూలమైన కలలు రావడం గుర్తించారు ఈ అధ్యయనంలో. వాసనలు... అవి కలలపై చూపించే ప్రభావం గురించి ఇంతటి పరిశోధన ఎందుకు అంటే వారి సమాధానం ఏంటో తెలుసా? కొంతమందిపై అనవసరమైన ఉద్వేగాల్ని, అయిష్టాల్ని పెంచుకునే వారికి మానసిక స్వాతన చేకూర్చడానికి అన్నారు. అంటే ఏ వాసనలకి వారు ఎలా స్పందిస్తున్నారో వారి కలలని బట్టి గుర్తించవచ్చు. దాంతో వారి మానసిక భావోద్వేగాలని సువాసనల ద్వారా నియంత్రించడానికి ప్రయత్నించవచ్చు అంటున్నారు పరిశోధకులు.
 

అలా అయితే మంచిదే...

సహజంగా కొందరిలో తెలియని భయాలు, అయిష్టాలు ఉంటాయి. వాటిని పోగొట్టుకోవడం ఎలాగో తెలీక ఇబ్బందిపడతారు. అలాంటి వారికి ‘వాసనల’తో వాటిని నియంత్రించడానికి ప్రయత్నించవచ్చు అన్నది ఆ పరిశోధన సారాంశం. ఆ దిశగా మరింత పరిశోధన జరుగుతోంది ఇంకా. సువాసనల ద్వారా మంచి భావాలు పెంపొందించేందుకు వీలయితే అంతకన్నా కావలసినది ఏముంటుంది చెప్పింది. ప్రస్తుతానికైతే కలలతో సరిపెట్టుకుందాం. సో ఈరోజు నుంచి నిద్రపోయే గదిలో మంచి గులాబీల సువాసనలు వచ్చేలా చూసుకోండి. మంచి మంచి కలలలో తేలిపోండి. బావుంది కదా!