ఆనందం చిరునామా ఇదిగో...

 

‘‘ఆనందం. ఒక మానసిక స్థితి అది. జీవితంలో కోరుకున్నవన్నీ దక్కినా అది స్వంతం అవుతుందన్న గ్యారంటీ ఏం లేదు’’ అంటున్నారు పరిశోధకులు. ‘‘సానుకూల మనస్తత్వం’’ మీద శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాల నుంచి పరిశోధనలు చేస్తున్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ పరిశోధనల్లో పలు ఆసక్తికర అంశాలు తెలిశాయి. ‘‘కావల్సినవన్నీ ఉన్నా ఆనందంగా లేము’’ అని బాధపడేవారికి మేం చెప్పేది ఒక్కటే - ఆనందాన్ని అందించేవి, నిలబెట్టేవి వక్తుల అలవాట్లు, ఆహారం, ప్రవర్తనలే. ఎందుకంటే ఈ అంశాలే మెదడులో ఆనందానికి సంబంధించిన సంకేతాలిచ్చే ‘‘ఉత్ప్రేరకాల’’ స్థాయిని పెంచుతాయి అని గట్టిగా చెబుతున్నారు ఆ పరిశోధకులు.


ఇంతకీ ఏమిటా అలవాట్లు అంటే...

‘‘ఆటలు చిన్నపిల్లలకి చాలా ఇష్టం. ఓ గంట ఆడనిస్తే చాలు హుషారుగా మనం చెప్పినట్టు వింటారు. పెరిగినకొద్దీ ఆ ఆటలకి దూరమవుతూ... ఆ ఆనందాన్ని, హుషారుని కూడా దూరం చేసుకుంటున్నామన్నమాట. ‘‘నేను ఆనందంగా వుండాలి’’ అని కోరుకునే ప్రతి ఒక్కరూ హాయిగా ఆడుకోండి చాలు’’ అంటున్నారు సిడ్నీలోని హ్యాపీనెస్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు. ఆటలన్నారు కదా అని వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్ ఆడితే సరిపోతుందని అనుకోకండి. రన్నింగ్, స్విమ్మింగ్, టెన్నిస్, క్రికెట్... ఇలా ఒళ్ళు అలిసేలా ఆడే ఆటలు ఆడాలి. అప్పుడు మెదడులో ‘‘ఎండార్ఫిన్’’ అనే హార్మోన్ ప్రేరేపించబడుతుంది. ఈ హార్మోను నొప్పులు తెలియకుండా చేస్తుంది. ఆనందాన్నిస్తుంది. కాబట్టి ఆటలు ఆనందానికి చిరునామాలు.


వ్యాయామం ఒంటికి మంచిదేగా...

‘‘వ్యాయామం - మీకు నచ్చిందే చేయండి. కానీ, రోజూ తప్పకుండా చేయండి. దానివల్ల గుండె నుంచి రక్తప్రసరణ మెరుగుపడి ఉల్లాసం కలుగుతుంది’’ అంటున్నారు స్విన్‌బర్న్ విశ్వవిద్యాలయం పరిశోధకులు. మానసిక ఆందోళనతో బాధపడేవారిలో మెదడు ముందు భాగానికి సరైన రక్తప్రసరణ ఉండటం లేదని వీరి పరిశోధనల్లో తేలిందట. అందే వ్యాయామం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరిగి, ఒత్తిడి తగ్గి ఉత్సాహం,  స్థైర్యం పెరుగుతాయట. సో.. రోజూ వ్యాయామం ఒంటికి మంచిది. మనసుకీ మంచిది.


ఆనందానికి ఆహారమూ ముఖ్యమే...

పౌష్టికాహారం తీసుకోకపోతే అలసిపోవడం, ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు వస్తాయి. అవి నేరుగా మనిషి ఆనందం మీద ప్రభావం చూపిస్తాయి. అలాగే కొన్ని ఆహార పదార్ధాలు నేరుగా ఆనందాన్ని కలిగించే ‘‘సెరోటానిన్’’ అనే ఉత్ప్రేరకం స్థాయిని పెంచుతాయి. ఎక్కువ మాంసకృత్తులు, తక్కువ పిండి పదార్ధాలు కలిగిన ఆహారాన్ని తీసుకునేవారిలో ఈ ‘‘సెరోటానిన్’’  స్థాయులు తక్కువగా వుంటాయిట. పిండి పదార్ధాలున్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ట్రైప్టోఫాన్ అనే రసాయనం ప్రేరేపితమవుతుంది. అదే సెరోటెనిన్‌గా మారుతుంది. చాక్లెట్, హెర్బల్ టీ వంటివి కూడా ఆనందాన్ని కలిగించే ఆహారాలే అంటున్నారు బ్రిటన్ పరిశోధకులు.


ధ్యానం.. ఆనంద యోగం...

టిబెట్ బౌద్ధ సన్యాసులలో సెరోటానిన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు పరిశోధకులు. ధ్యానం వల్ల మెదడులో ఆనందాన్ని కలిగించే భాగం ప్రేరేపితమవుతున్నట్టు, అలా ధ్యానం చేసే వ్యక్తులు ఉత్సాహంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటున్నట్టు తేలింది వీరి పరిశోధనల్లో. రోజూ ఓ ఐదు నిమిషాలపాటు మనసుని, మెదడుని నియంత్రిస్తూ ఏకాగ్రతతో ధ్యానం చేయగలిగితే చాలు.. అమితానందం మీ స్వంతం. అందుకు మేము హామీ అంటున్నారు వీరు.


ఆ నలుగురు... ఆనందాన్నిస్తారు...

ఇక ఆఖరుది.. ముఖ్యమైనది.. ‘‘నలుగురు మనుషులు’’. రోజూ ఓ నలుగురు వ్యక్తులతో మనసువిప్పి మాట్లాడితే చాలు ‘‘ఆక్సిటోసిన్’’ అనే రసాయనం స్థాయులు పెరుగుతాయి. దానివల్ల మనసులో ప్రేమాభిమానాలు పొంగుతాయి. అనుబంధాలు బలపడతాయి. అంతులేని ఆనందం స్వంతమవుతుంది. ఒంటరితనం ఒత్తిడిని, నిరుత్సాహాన్ని పెంచుతుంది. అందుకే ఆనందంగా ఉండాలి అనుకుంటే నలుగురిలో కలవండి. మాట్లాడండి. సంతోషాన్ని పొందండి, పంచండి. ఇదే విస్కాన్సిన్ విశ్వవిద్యాలయ పరిశోధకుల ఉవాచ.

ఆనందం అడ్రస్ తెలిసిందిగా.. మరి ఆనందాన్ని పట్టుకుని మన జీవితాలలో నింపుకోవడమే మిగిలింది. అన్నీ చిన్నవే. ఆచరించడం కూడా కష్టమేం కాదు. ఎటొచ్చీ ఆనందం వాటిల్లో దాగుందని మనకి తెలియదు అంతే. దీర్ఘకాలం పరిశోధనల తర్వాత పరిశోధకులు తేల్చిచెప్పిన ఆ సత్యాలు మనకి మార్గ నిర్దేశం చేస్తున్నాయి. ఆలోచించండి. ఆటలు, వ్యాయామం, ఆహారం, ధ్యానం, నలుగురిలో కలవటం... ఇవి చాలు అవధులు లేని ఆనందాన్ని అందుకోవటానికి.


-రమ ఇరగవరపు