జగన్ నెల రోజుల పాలన.. హిట్టా? ఫట్టా?

 

రాష్ట్ర విభజన తరువాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకి పట్టంకట్టిన ఏపీ ప్రజలు.. రెండోసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పట్టంకట్టారు. జగన్ ఏపీ సీఎంగా మే 30 న ప్రమాణం స్వీకారం చేసారు. అంటే జగన్ సీఎంగా ప్రమాణం చేసి నెల రోజులు పూర్తయింది. మరి జగన్ మొదటి నెలరోజుల పాలన ఎలా ఉంది?. బాబుని కాదనుకొని ఒక్క ఛాన్స్ ఇచ్చిన ఏపీ ప్రజల మనసు జగన్ గెలుచుకున్నారా? మొదటి నెలరోజుల పాలనలో బాబు కంటే మెరుగ్గా పాలించారా? వంటివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎంగా బాబు ప్రమాణస్వీకారం చేయడానికన్నా ముందే.. కేంద్రాన్ని ఓ విషయంలో పట్టుబట్టారు. తెలంగాణలోని 7 పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణం చేస్తానన్నారు. అనుకున్నది సాధించారు. పోలవరం ముంపు మండలాల విషయంలో విజయం సాధించిన బాబు.. సీఎం హోదాలో తొలి సంతకాలు చేసిన కొన్ని అంశాలపై మాత్రం పూర్తిగా విజయం సాధించలేకపోయారనే చెప్పాలి.

సీఎంగా ప్రమాణం చేసిన బాబు అప్పుడు ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. తొలి సంతకం.. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు, చేనేత రుణ మాఫీ ఫైలుపై సంతకం చేసారు. అయితే ఇవి ఐదేళ్లల్లో పూర్తిస్థాయిలో జరగలేదనే చెప్పాలి. రెండో సంతకం.. వృద్ధులు, వితంతువులకు రూ. 1000 పెన్షన్, వికలాంగులకు రూ. 1500 పెన్షన్ ఫైలుపై చేసారు. ఈ విషయంలో బాబు మాట నిలబెట్టుకున్నారు. అంతేకాదు తరువాత పెన్షన్ ని రెట్టింపు కూడా చేసారు. మూడో సంతకం.. అన్ని గ్రామాలకు తాగునీరు అందించే 'ఎన్టీఆర్ సుజల స్రవంతి' పథకం ఫైలుపై చేసారు. రూ.2 కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించాలనే ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. కానీ ఈ పథకం పూర్తిస్థాయిలో ఆచరణ సాధ్యం కాలేదు. నాలుగో సంతకం.. బెల్టు షాపుల రద్దు ఫైలుపై చేసారు. ఈ విషయంలో బాబు విఫలమయ్యారనే చెప్పాలి. ఇక ఐదో సంతకం.. ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంచే ఫైలుపై సంతకం చేశారు. ఈ విషయంలో బాబు మాట నిలబెట్టుకున్నారు.

బాబు ఐదేళ్ల పాలన చూసాం కాబట్టి తొలి ఐదు సంతకాల అంశాలు నెరవేర్చారో లేదో ఓ స్పష్టత ఉంది. అయితే జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకొని నెలరోజులే అవుతుంది కాబట్టి.. ఈ నెల రోజుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చర్యలు గురించి ప్రధానంగా చర్చిద్దాం. 

సీఎంగా ప్రమాణం చేసిన జగన్.. రూ.2000 ఉన్న పెన్షన్ ను రూ.2250 కు పెంచుతూ తొలి సంతకం చేసారు. అయితే ఈ విషయంలో జగన్ కాస్త విమర్శలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో పెన్షన్ రూ.3000 లకు పెంచుకుంటూ పోతామని క్లియర్ గా రాసినప్పటికీ, ఎన్నికల ప్రచారంలో మాత్రం పెన్షన్ రూ.3000 చేస్తామని పదేపదే చెప్పారు. దీంతో ప్రజలు జగన్ సీఎం కాగానే పెన్షన్ రూ.3000 చేస్తారనుకున్నారు. తీరా సీఎం అయ్యాక మేనిఫెస్టోలో రాసినట్టే పెంచుకుంటూ పోతామని సంతకం చేసారు. దీంతో కాస్త విమర్శలు ఎదురయ్యాయి.

జగన్ తన మంత్రివర్గంలో అన్ని సామజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రశంసలు అందుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రివర్గంలో 50 శాతం చోటు కల్పించారు. దళిత మహిళను హోంమంత్రిగా నియమించారు.

ఇక అమ్మఒడి పథకంపై కొన్ని విమర్శలు ఎదురైనప్పటికి జగన్ కి ఈ విషయంలో మంచి మార్కులు పడ్డాయనే చెప్పాలి. పాఠశాలకు కి పిల్లల్ని పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని జగన్ ప్రకటించారు. అయితే ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలకే వర్తిస్తుందని కొందరు నేతలు చెప్పడంతో.. పెన్షన్ లో మెలిక పెట్టినట్టే ఈ పథకంలో కూడా మెలిక పెట్టారంటూ విమర్శలు వచ్చాయి. దీంతో తరువాత మళ్ళీ ఏ పాఠశాలలో చదివినా వర్తిస్తుందని నేతలు చెప్పుకొచ్చారు. అయితే విశ్లేషకులు మాత్రం ఈ పథకాన్ని  ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయడం కూడా మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే జగన్  ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చేస్తానని, రెండేళ్లలో వాటి రూపు రేఖలే మారిపోతాయని చెప్తున్నారు. అందుకే ఆ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముందనేది విశ్లేషకుల భావన. అంతేకాదు ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన వారికి కూడా పథకం వర్తిస్తే.. బడ్జెట్ మరింత భారమవుతుందని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

అదేవిధంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఫిరాయింపులను ప్రోత్సహించనని, ఒకవేళ ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరాలనుకుంటే.. కచ్చితంగా రాజీనామా చేసి రావాల్సిందేనని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి.. ప్రశంసలు అందుకున్నారు.

ఇక ఈ నెల రోజుల్లో జగన్ ని బాగా ఇబ్బంది పెట్టిన అంశం ఏదైనా ఉందా అంటే ప్రత్యేకహోదా అనే చెప్పాలి. జగన్ హోదా విషయంలో మొదటి నుంచి దృఢ నిశ్చయంతో ఉన్నారు. హోదా వచ్చే వరకు పోరాడతామని చెబుతూ వస్తున్నారు. అయితే సీఎం అయ్యాక మాత్రం కేంద్రంలో బీజేపీకి పూర్తీ మెజారిటీ ఉందని, బ్రతిమాలడం తప్ప గట్టిగా అడగలేం అన్నట్టుగా మాట్లాడారు. దీనికి తోడు బీజేపీ హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దీంతో జగన్ హోదా విషయంలో ఎలాంటి అడుగులు వేస్తారోనన్న ఆసక్తి నెలకొంది.

అవినీతిరహిత పాలన అందించడమే తమ ప్రధాన లక్ష్యమని చెబుతున్న జగన్.. గత ప్రభుత్వ అవినీతిపై కేబినెట్ సబ్ కమిటీని కూడా వేశారు. అంతేకాదు అక్రమ కట్టడాలపై చర్యలు అంటూ.. ఏకంగా గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికనే కూల్చేసి సంచలం సృష్టించారు. అయితే ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ప్రజాధనాన్ని వృథా చేసారని విమర్శించారు. అయితే కొందరు మాత్రం.. 'మార్పు మననుంచే మొదలు కావాలి అంటారు. అందుకే జగన్ మొదట ప్రభుత్వ అక్రమ కట్టడాన్ని కూల్చేసి, తరువాత మిగతా అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టారు.' అంటున్నారు. అదేవిధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ సన్నిహితంగా ఉంటూ.. నీళ్ల పంపకం, విభజన సమస్యలు పరిష్కారానికి అడుగులు వేస్తున్నారు. మరి ముందు ముందు జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.