సిద్ధాంతం కాదు... పదవే ముఖ్యం... చరిత్రకెక్కిన సేన పోరాటం...

ఊహించని ట్విస్టులు, మలుపుల తర్వాత మరాఠా పీఠం చివరికి పులి పంజాకి చిక్కింది. అయితే,  ముఖ్యమంత్రి పదవి, అధికారం కోసం పాతికేళ్ల స్నేహాన్ని, నమ్మిన సిద్ధాంతాలను అలవోకగా వదిలేసింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీల్లాగే తమకు సిద్ధాంతం కాదు... పదవే ముఖ్యమని తేల్చేసింది. శివసేనకు అధికారం, సీఎం పదవి కొత్త కాదు... కానీ ఈసారి చేసిన పోరాటం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది.

నిజమే, శివసేనకు అధికారం కొత్తకాదు. 1995లో, 2014లో బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకుంది. అయితే, మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేనది ప్రత్యేకమైన పాత్ర. పొలిటికల్ కార్టూనిస్టయిన బాల్ ఠాక్రే ముంబై రాజకీయాల్లోకి చాలా విచిత్రంగా అడుగుపెట్టారు. ముంబైలో మరాఠీలను కాదని, వలసవాదులకు ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోందంటూ పెద్ద ఉద్యమానికే బీజం వేశారు. అప్పట్నుంచి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ముంబైలో శివసేన వేళ్లూనుపోయింది. స్థానికతను లేవనెత్తి మరాఠీల మనసుల్లోకి చొచ్చుకుపోయింది. అలాగే, కరుడుగట్టిన మత ఛాందసవాద పార్టీగా ముద్రపడిన శివసేన, ఆ తర్వాత నెమ్మదిగా మరాఠీ అనుకూల సిద్ధాంతం నుంచి హిందూత్వ అజెండా దిశగా అడుగులు వేసింది. 

ఇక, మహారాష్ట్రను ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ కాగా, తొలి కాంగ్రెస్సేతర ముఖ్యమంత్రి పీఠం శివసేనకే దక్కింది. బీజేపీ సహాయంతో 1995 నుంచి 99వరకు మహారాష్ట్రను శివసేన ఏలింది. అయితే, బీజేపీ-సేన మధ్య స్నేహం కొంతకాలం చెడింది. వాజ్ పేయి ప్రభుత్వాల్లో శివసేన భాగస్వామిగా ఉన్నా, ఆ తర్వాత 2014వరకు పెద్దగా సత్సంబంధాలు కొనసాగలేదు. అయితే, 2014 ఎన్నికల్లో కూడా విడివిడిగానే పోటీచేశాయి. అయితే, చర్చల అనంతరం అటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వాల్లో శివసేన భాగస్వామిగా చేరింది. కానీ, రెండు పార్టీల మధ్య మళ్లీ విభేదాలు రావడంతో... 2018లో బంధం తెగింది. అయితే, 2019 ఎన్నికల్లో మళ్లీ కలిసి పోటీ చేశాయి. అయితే,  ఈసారి 50-50 ఫార్ములాను తెరపైకి తెచ్చిన శివసేన... ముఖ్యమంత్రి పీఠం చెరో రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందేనంటూ పట్టుబట్టింది. అందుకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో... మళ్లీ ఇద్దరి మధ్య తెగదెంపులు జరిగాయి. అయితే, ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనుకున్న శివసేన... బీజేపీతో పాతికేళ్ల స్నేహబంధాన్ని తెంచుకుని.... సైద్ధాంతిక విభేదాలున్న ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అలా, సీఎం పీఠం కోసం శివసేన చేసిన రాజకీయం.... హిందూత్వ వాదాన్ని, సిద్ధాంతాలను పక్కనబెట్టిన విధానం ఇప్పుడు చర్చనీయాంశమైంది.