జగన్‌ యాత్రకు భారీ భద్రత.. డ్రోన్లు, సీసీలు, ఐడీ కార్డులు

 

అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై శ్రీనివాస్ అనే వ్యక్తి కోడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. అప్పటి నుంచి ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్న జగన్ పాదయాత్రకు కొద్ది రోజులు విరామం ప్రకటించారు. ఆరోగ్యం కుదుటపడటంతో 17 రోజుల విరామం తర్వాత  జగన్‌ పాదయాత్ర ఈరోజు ఉదయం ప్రారంభమైంది. విజయనగరం జిల్లా మక్కువ మండలం పాయకపాడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు.

విశాఖ విమానాశ్రయంలో దాడి నేపథ్యంలో జగన్‌ పాదయాత్రకు భారీ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడంచల భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించింది. రెడ్, గ్రీన్, బ్లూ ఐడీ కార్డులను పోలీసులు జారీ చేశారు. జగన్‌ను కలిసే వారికి గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. వీఐపీలకు రెడ్ ఐడీ కార్డులు, జగన్‌తో పాటు ప్రజా సంకల్పయాత్రను అనుసరిస్తున్న వారికి బ్లూ ఐడీ కార్డులు, పాదయాత్రలో సిబ్బందికి గ్రీన్ ఐడీ కార్డులు ఇవ్వనున్నారు. ఇకపై ప్రజలు, కార్యకర్తలు జగన్‌ను కలవాలన్నా, మాట్లాడాలన్నా భద్రతా వలయం బయటినుంచే మాట్లాడాల్సి వస్తుందని పోలీసులు చెప్తున్నారు. 50 మంది పోలీసులతో రోప్‌ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సెల్ఫీల విషయంలోనూ ఆంక్షలు పెట్టనున్నారు. సీఆర్పీఎఫ్‌ పోలీసులు పాదయాత్ర మార్గంలో ముందుగానే తనిఖీలు చేస్తారు. రోడ్‌ క్లియరెన్స్‌ పార్టీని ఏర్పాటు చేశారు. పాదయాత్రలో నిఘాకు డ్రోన్‌ కెమెరాలను వినియోగించనున్నారు. వీటితోపాటు బాడీవేర్‌ కెమెరాలను వినియోగించనున్నారు. అదేవిధంగా జగన్ బస చేసే క్యాంపు చుట్టూ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.