రెవెన్యూ అధికారులకు భారీ భద్రత... భరోసా నిలుపుకున్న కేటీఆర్

 

తెలంగాణలో నేటి నుంచి రెవెన్యూ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి చేరనున్నారు. తహసీల్దార్ విజయారెడ్డి ఘటన తరువాత ప్రభుత్వం భద్రత కల్పిస్తామని చెప్పినా వారిలో భయం మాత్రం పోవడం లేదు. వారిలో భరోసా నింపేందుకు ప్రభుత్వం రెవెన్యూ కార్యాలయాలకు పోలీసు భద్రత ఏర్పాటు చేసింది.

నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారితో మమేకమై పని చేసే రెవిన్యూ ఉద్యోగులకు గుండె దడ పట్టుకొంది. ఈ నెల 4న పట్టపగలు తహసీల్దార్ విజయా రెడ్డిని ఓ రైతు సజీవ దహనం చేసిన ఘటన రెవిన్యూ ఉద్యోగుల్లో భయాన్ని పెంచింది. దీనికి తోడు విజయా రెడ్డికి పట్టిన గతే నీకూ పడుతుంది అంటూ ఇప్పటికే పలుచోట్ల రెవిన్యూ అధికారులను బెదిరిస్తున్నారు ప్రజలు. దాంతో మళ్లీ విధులకు వెళ్లాలంటేనే వారు జంకుతున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ఉదయం నుంచి రాత్రి దాకా పని చేసినా ప్రజల్లో ఏమాత్రం సానుభూతి రాకపోగ రోజురోజుకు వ్యతిరేకత పెరిగిపోతూ ఉండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. తాజా ఘటన రెవిన్యూ కుటుంబాల్లో కూడా అభద్రతా భావాన్ని పెంచింది. ఎందుకండీ ఈ ఉద్యోగం మానెయ్యండి.. ఏదో పని చేసుకొని బతుకుదాం అంటూ తన భార్య ఫోన్ చేసిందని ఓ అధికారి వాపోయారు. 

విజయారెడ్డి హత్యతో ఈ నెల 4 నుంచి విధులకు దూరంగా ఉన్న వారంతా లాంఛనంగా మళ్లీ విధుల్లో చేరనున్నారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాలలో భూ వివాదాలూ అధికం. పట్టణ స్వభావం ఉన్న ప్రాంతాలలో భూ వివాదాలూ మరీ అధికం. ఒక్కో భూమికి నలుగురైదుగురు యజమానులు ఉండటం.. వారంతా నా భూమంటే నా భూమి అంటూ క్లైమ్ చేయటం ఫైనల్ గా యంత్రాంగంపై ఒత్తిడి చేస్తూ ఉండటం జరుగుతుంది. తాజాగా భౌతిక దాడులకు పూనుకోవడమే యంత్రాంగంలో భయం పెంచింది. రక్షణ కల్పిస్తామని మంత్రి కేటీఆర్, రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చెప్పటం కొంత ఊరటనిస్తున్నా రోజువారీ విధులు స్వేచ్ఛాయుత వాతావరణంలో చేపట్టటాలంటే కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని పలువురు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

రెవిన్యూ రక్షణకు డీజీపీ మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి సోమవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు కానిస్టేబుళ్లను రక్షణగా పెట్టాలి. మండే స్వభావం ఉన్న ఏ వస్తువు కార్యాలయంలోకి తీసుకెళ్లకుండా చూడాలి. ఇందుకు వీఆర్వో సాయం తీసుకోవాలి. రోజుకు రెండు సార్లు బ్లూకోల్స్, పెట్రోలింగ్ కార్లు తహసీల్దార్ కార్యాలయాల వద్దకు వెళ్లి తనిఖీలు చేయాలి. రెవిన్యూ ఉద్యోగులు ఫిర్యాదు చేయగానే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ ఉద్యోగులపై దాడికి ప్రయత్నించిన వారిని వదిలేయకుండా వెంటనే కేసులు పెట్టాలి. రెవిన్యూ ఉద్యోగులకు సంబంధించి ఏ ఫిర్యాదు వచ్చినా ప్రాథమిక విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదన పంపి.. చర్యలు తీసుకోవాలి. రెవిన్యూ కార్యాలయాల రక్షణ, బాధ్యత సీఐలు, డీఎస్పీలదే. రెవెన్యూ ఉద్యోగులంతా రోజువారి విధులకు హాజరు కావాలని.. ప్రజల సమస్యలు ఏమున్నా పరిష్కరించాలని..డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ కోరింది. రెవిన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు వచ్చి అందుకు 15 రోజుల గడువు కోరిన నేపథ్యంలో ఉద్యోగులెవరూ విధులకు దూరంగా ఉండరాదని విజ్ఞప్తి చేశారు. నిర్భయంగా డ్యూటీలు చెయ్యాలని స్వేచ్ఛాయుత విధి నిర్వహణకు ప్రజల సహకారం తీసుకోవాలని కోరారు.