టీడీపీకి షాకిచ్చిన హైకోర్టు.. ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు

 

అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకు షాక్ తగిలింది. శాసనసభ్యుడిగా ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.  2014 ఎన్నికల్లో ఆయనపై పోటీచేసి ఓడిపోయిన వైసీపీకి చెందిన తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగాలని ఆదేశించింది. ఎన్నికల సందర్భంగా ఈరన్న దాఖలు చేసిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. మంగళవారం ఈ తీర్పును వెల్లడించింది.

2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఈరన్న, వైసీపీ నుంచి తిప్పేస్వామి బరిలోకి దిగారు. ఈ పోటీలో ఈరన్న, తిప్పేస్వామిపై 14వేల పై చిలుకు ఓట్లతో గెలిచారు. అయితే ఈరన్న ఎన్నికల అఫిడవిట్‌లో తన మీద ఉన్న కేసుల వివరాలు, భార్య ప్రభుత్వ ఉద్యోగి అనే వివరాలను పేర్కొనలేదు. దీంతో ఈరన్న ఎన్నికను సవాల్‌ చేస్తూ 2014 జూన్‌లో తిప్పేస్వామి హైకోర్టును ఆశ్రయించారు. ఉద్దేశపూర్వకంగా కేసుల వివరాలు ఇవ్వలేదని, భార్య ప్రభుత్వ ఉద్యోగి అనే సమాచారం ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించి.. తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరారు.

టీడీపీ తరపున పోటీ చేసేందుకు తన క్లయింటుకు చివరి నిమిషంలో బీఫాం లభించిందని, ఈ నేపథ్యంలో ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తి వివరాలు పేర్కొనలేకపోయారని ఈరన్న తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈరన్న భార్య ప్రభుత్వ ఉద్యోగి అయినా తర్వాత రాజీనామా చేశారని.. 2002లో కర్ణాటకలోని ఓ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసు చిన్నదేనని, ఈకేసును అఫిడవిట్‌లో పేర్కొనకపోయినా ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదని.. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని న్యాయవాది కోరారు. ఈ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. ఈరన్నకు షాక్ ఇస్తూ తీర్పు ఇచ్చింది. ఈరన్న ఎన్నిక చెల్లదని తీర్పు వెలువడడంతో వైసీపీ కార్యకర్తలు మడకశిరలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ తీర్పుపై ఈరన్న అప్పీల్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.