కోమటిరెడ్డి మీద కోపం కోర్టుతో కొట్లాటగా మారుతోందా?

కోర్టులకి , ప్రభుత్వాలకి మధ్య గొడవ ఎప్పుడూ వుండేదే! చాలా అంశాల్లో కోర్టుల ఆదేశాల్ని ప్రభుత్వాలు ఎలా అమలు చేయకుండా వుండాలా అని దార్లు వెతుకుతుంటాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి, హైకోర్టులకి మధ్య గొడవే కాదు సుప్రీమ్ కోర్టుకు , కేంద్రానికి కూడా అప్పుడప్పుడూ అభిప్రాయ భేదాలు వస్తూనే వుంటాయి. కానీ, మన రాజ్యాంగం ప్రకారం కోర్టు ఆదేశిస్తే ఎవరైనా శిరసావహించాల్సిందే. అందుకు ప్రభుత్వాలు, ప్రభుత్వ పెద్దలు కూడా అతీతం కారు. నిజానికి వారు బాధ్యతగా కోర్టు తీర్పుల్ని పాటించకపోతే సామాన్య జనానికి కూడా న్యాయస్థానాలపై గౌరవం తగ్గిపోయే ప్రమాదం వుంది. అందుకే బాధ్యత గల ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు ఎప్పుడూ పాల్పడదు!

 

 

కోర్టులకి, గవర్నెమంట్ కు గొడవ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే… హైద్రాబాద్ హైకోర్టు తెలంగాణ సర్కార్ పై సీరియస్ అయింది. ఏకంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కూడా సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది. నిజానికి అసెంబ్లీకి సంబంధించినంత వరకూ స్పీకర్ దే అంతిమ నిర్ణయం. ఆయన ఆదేశాల్ని ప్రశ్నించటానికి వీల్లేదు. కానీ, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లపై తెలంగాణ స్పీకర్ తీసుకున్న చర్యలు వివాదాస్పదం అయ్యాయి. వేటు పడ్డ ఎమ్మెల్యేలు వేరే గత్యంతరం లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన సస్పెన్షన్ వేటు ఎత్తి వేసింది. వారికి గన్ మెన్లను కూడా తిరిగి కేటాయించాలని కేసీఆర్ సర్కార్ ని ఆదేశించింది. కానీ, ఇంతవరకూ ఇద్దరు ఎమ్మెల్యేల్ని స్పీకర్ అసెంబ్లీలోకి రానివ్వలేదు. గన్ మెన్లను ప్రభుత్వం కేటాయించలేదు. ఇదే న్యాయమూర్తుల ఆగ్రహానికి కారణమైంది.

 

 

బహిష్కృత ఎమ్మెల్యేల్ని తిరిగి సభలోకి అనుమతించాలనీ, వారికి భద్రత కల్పించాలనీ, జీతభత్యాలు ఇవ్వాలని ఆదేశిస్తోన్న హైకోర్ట్ ఒక దశలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ని సూటిగా ప్రశ్నించిందట. మీరు ప్రభుత్వం తరుఫున వాదిస్తున్నారా? లేక ఒక పార్టీ తరుఫునా? అంటూ ఏజీపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిజంగా తెలంగాణ సర్కార్ పునరాలోచించుకోవాల్సిన అంశమే! ఎందుకంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అధికార పక్షం గొడవగా మొదలైన బహిష్కరణ వ్యవహారం కోర్టుకి, ప్రభుత్వానికి మధ్య విభేదంగా మారుతోంది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా చూస్తే అంత మంచిది కాదు. కాకపోతే, ఇప్పుడు కోర్టు చెప్పినట్లు కోమటిరెడ్డి, సంపత్ లను తిరిగి అసెంబ్లీలోకి ఆహ్వానిస్తే అది టీఆర్ఎస్ కు ఓటమిగా ప్రచారం అవుతుంది. బహుశా ఇదే తెలంగాణ సీఎం మదిలో మెదులుతున్న ఆలోచన కావచ్చు. కానీ, కొన్నిసార్లు కేసీఆర్ గులాబీ బాస్ గా కాకుండా ప్రభుత్వ అధినేతగా నిర్ణయం తీసుకుంటేనే హుందాగా వుంటుంది. స్పీకర్ తో బహిష్కరణ వేటు ఎత్తి వేయిస్తే మరింత డ్యామేజ్ జరగకుండా వుంటుంది. కోమటిరెడ్డి, సంపత్ సభలోకి వచ్చాక వార్ని తమ ఎమ్మెల్యేలతో కలిసి ఎదుర్కోవటం టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరీ అసాద్యం ఏం కాదు. ఆ కోణంలో ఆలోచించకుండా పట్టుదలకి పోయి కోర్టు ధిక్కరణ అంచున నిలవటం జనం ముందు అంత మంచి సంకేతమేం కాదు.

 

 

కోమటిరెడ్డి, సంపత్ లకు కోర్టులో దక్కిన తీర్పు, వారి కోసం న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు ఖచ్చితంగా టీకాంగ్ కు ఉత్సాహాన్నిచ్చేవే. జనంలోనూ, సభలోనూ టీఆర్ఎస్ ను ఈ వివాదంతో కొంత వరకూ ఇరుకున పెట్టవచ్చని వారు ఆలోచిస్తుండవచ్చు. కాకపోతే, ఈ గొడవ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు రాల్చేటంత సంచలనాత్మకమైందైతే కాదు!

Related Segment News