జనాలు చనిపోతున్నా పట్టించుకోరా... తెలంగాణ సర్కార్ పై హైకోర్టు సీరియస్!!

 

తెలంగాణలో డెంగ్యూ మరణాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీ నివారణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ సోకి పలువురు మృతిచెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై దాఖలైన పిటిషన్‌ను ఈరోజు హైకోర్టు విచారించింది. మనుషులు చనిపోతున్నా వైద్య ఆరోగ్యశాఖ ఎందుకు స్పందించడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగ్యూ నివారణ చర్యలపై ఎలాంటి చర్యలు చేపట్టారో వివరించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. అంతేకాదు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య, మున్సిపల్‌ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ, పబ్లిక్‌ హెల్త్‌ డైరక్టర్లు, ఇతర ఉన‍్నతాధికారులు రేపు ఉదయం హైకోర్టులో హాజరు కావాలంటూ ఆదేశించింది.

డెంగ్యూ వచ్చి మనుషులు చనిపోతున్నా ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మనుషులు చనిపోతున్నా స్పందించరా అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. డెంగ్యూపై ప్రజల్లో కనీస అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హైకోర్టు తెలిపింది.