తెలంగాణ మాజీ స్పీకర్ కి షాక్.. హైకోర్టు నోటీసులు

 

కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి, సంపత్‌కుమార్‌ల విషయంలో తాము ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ కోరుతూ మాజీ స్పీకర్ మధుసూధనాచారికి నోటీసులు పంపింది. గత అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో గవర్నర్‌పై హెడ్‌ఫోన్‌ విసిరిన ఘటనలో  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు సంపత్‌‌కుమార్‌ల ఎమ్మెల్యే సభ్యత్వాలను రద్దు చేస్తూ అప్పటి స్పీకర్ మధుసూధనాచారి నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌కుమార్ లు హైకోర్టును ఆశ్రయించారు. సభ్యత్వాలను పునరుద్దరించాలని సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్‌లు కూడ ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఈ తీర్పును అమలు చేయకపోవడంతో కోర్టుధిక్కరణ పిటిషన్ ను కూడ కోమటిరెడ్డి, సంపత్‌కుమార్ లు దాఖలు చేశారు. ఈ లోగా అసెంబ్లీ రద్దై ఎన్నికలు జరిగాయి. నల్గొండ నుండి కోమటిరెడ్డి, ఆలంపూర్ నుండి సంపత్‌కుమార్ లు ఓటమి పాలయ్యారు.

అయితే కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు  అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రెడ్డిలను కస్టడీలోకి తీసుకోవాలని.. రూ. 10వేల పూచీకత్తుపై వదిలేయాలని హైకోర్టు రిజిష్ట్రార్‌ను ఆదేశించింది. అలాగే మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారికి కూడ కోర్టు నోటీసులు జారీ చేసింది. మరో వైపు ఇదే కేసులో తెలంగాణ డీజీపీ, నల్గొండ, గద్వాల ఎస్పీలకు కూడ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను హైకోర్టు మార్చి 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో నోటీసులు అందుకొన్న వారు ఏం వివరణ ఇస్తారో చూడాలి మరి.