సాయానికి ప్రతిఫలం!

 

అతను ఆ రోజు తన పాత బండి మీద 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసుకి బయల్దేరాడు. అవడానికి 40 కిలోమీటర్లు అన్నమాటే కానీ ఆ దారంతా చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ దారిలో దొంగతనాలూ ఎక్కువే! దానికి తోడు ఆ రోజు విపరీతమైన మంచు కురుస్తోంది. అలాంటి సమయంలో అతనికి రోడ్డు పక్కగా నిలిపిన ఓ కారు కనిపించింది. ఆ కారు కదలడం లేదు. ఏమై ఉంటుందా అని అతను కారుకి దగ్గరగా వెళ్లి చూశాడు. లోపల ఒక పెద్దాయన బిక్కచచ్చిపోయి ఉన్నాడు. కారు తలుపు తీసి బయటకు వచ్చేందుకు కూడా ఆయనకు ధైర్యం చాలడం లేదు. కారు టైరు పంక్చర్‌ అయి ఉంది.

 

‘నాపేరు రవీంద్ర! మీరు నన్ను చూసి కంగారుపడనవసరం లేదు. మీ దగ్గర ఇంకో టైరు ఉంటే చెప్పండి. నేను సరిచేసి పెడతాను,’ అంటూ భరోసా ఇచ్చాడు బండి మీద అక్కడికి చేరుకున్న వ్యక్తి. అతను అంతగా భరోసా ఇచ్చినా కూడా కారులోని మనిషికి ధైర్యం చాలడం లేదు. అందుకనే కారు తలుపు తీయకుండానే ‘స్పేరు టైరు, రిపేరు చేసే సామాన్లు డిక్కీలోనే ఉన్నాయి,’ అంటూ తడబడుతూ సమాధానం చెప్పాడు.

 

రవీంద్రకి పెద్దాయన భయం అర్థమైంది. తనలో తను నవ్వుకుంటూ డిక్కీ తెరచి కావల్సినంత సరంజామా అంతా బయటకు తీశాడు. వాటితో కారు టైరు సరిచేయడం మొదలుపెట్టాడు. ఓ గంట గడిచేసరికి పని పూర్తయ్యింది. పాడయిన టైరు స్థానంలోకి మరో టైరు చేరింది. కానీ పాపం రవీంద్ర బట్టలన్నీ గ్రీజుతో మాసిపోయాయి. అతని వాలకం చూసిన కారులో పెద్దాయనకి చెప్పలేనంత పశ్చాత్తాపంగా తోచింది. వెంటనే కారులోంచి దిగి- ‘నువ్వు లేకపోతే ఈ దారిలో నా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది. నువ్వు చేసిన సాయానికి బదులుగా ఎంత డబ్బు కావాలో చెప్పు,’ అంటూ తన పర్సుని బయటకు తీశాడు.

 

‘మీరు ఆపదలో ఉన్నారని సాయపడ్డానే కానీ, డబ్బులు ఆశించి కాదు. మీరు అంతగా నా రుణం తీర్చుకోవాలంటే దానికో మార్గం లేకపోలేదు. మీకెప్పుడైనా కష్టాలలో ఉన్న మనిషి తారసపడితే, నేను మీకు చేసిన సాయాన్ని తల్చుకోండి. నా సాయానికి బదులుగా అతనికి మీరు చేతనైనా సాయం చేయండి,’ అనేసి తన దారిన తను వెళ్లిపోయాడు రవీంద్ర. పెద్దాయన తన మార్గంలో సాగిపోయాడు.

 

ఆ రోజు పెద్దాయన, తన ఇంటికి దగ్గరగా ఉన్న ఓ హోటల్‌కి చేరుకున్నాడు. గత కొన్ని వారాలుగా ఆయనకు ఆ హోటల్‌కు వస్తూనే ఉన్నాడు. అక్కడ పనిచేసే ఒక సర్వర్‌ని చూసి ఆయనకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఆ సర్వర్‌ నిండు గర్భవతి! పాపం విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఆమె పనిచేయాల్సి వస్తోందే అని జాలి కలిగేది పెద్దాయనకి. ఆమె అంతగా పనిచేస్తున్నా కూడా ఆమె మొహంలో వీసమెత్తయినా చిరాకు లేకపోవడం చూసి ముచ్చటగా తోచేది. పనితాలూకు అలసట ఆమె మొహంలో ప్రతిఫలిస్తున్నా, తను హోటల్‌కు వెళ్లిన ప్రతిసారీ చిరునవ్వుతో పలకరిస్తూ, మర్యాదగా సేవచేయడం చూసి... ఆమెకు ఏదన్నా సాయం చేస్తే బాగుండు అనిపించేది. కానీ అలాగే అశ్రద్ధ చేసేవాడు. కానీ ఇవాళ జరిగిన సంఘటనతో ఎందుకో ఆయన మనసు మరింత మెత్తబడింది. ‘ఆపదలో ఉన్నవారికి సాయం చేసి తన రుణం తీర్చుకోమన్న’ రవీంద్ర మాటలు పదేపదే గుర్తుకువచ్చాయి. అంతే! తన జేబులో ఉన్న ఓ పదివేల రూపాయలు తీసి ఆమెకు బిల్లుతో పాటు అందించాడు. ఆమె ఆ డబ్బులు చూసి అతన్ని ‘ఎందుకని’ అడిగేలోపే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తనకు అందిన సాయాన్ని చూసి ఆమె నోట మాట రాలేదు. ఆ సంఘటనను తన భర్తతో పంచుకునేందుకు ఆ రోజు హడావుడిగా ఇంటికి చేరుకుంది. అక్కడ ఆమె భర్త చొక్కా మీద గ్రీజు మరకలతో కనిపించాడు. తమ ఇద్దరికీ ఆ రోజు తారసిల్లిన మనిషి ఒక్కరేనన్న విషయం తెలుస్తుందో లేదో మరి!

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.