జలదిగ్బంధంలో రాష్ట్రాలు

దక్షిణాది రాష్ట్రాలు వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలు వర్షాలతో తడిసిముద్దవుతున్నాయి. గడచిన వారం రోజులుగా కేరళను వణికిస్తున్న వర్షాలు తమ ప్రతాపాన్ని ఇతర రాష్ట్రాల వైపు చూపిస్తున్నాయి. ఇరవై రోజుల క్రితం వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడితే ఇప్పుడు ఈ అతి వర్షాలతో పరిస్థితి దారుణంగా మారింది. దక్షిణాది రాష్ట్రాలపై వరుణుడు చూపిస్తున్న ఆగ్రహానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. కేరళలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పర్యాటక రాష్ట్రమైన కేరళకు ఇప్నట్లో ఎవ్వరూ రావద్దంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం వినతి చేసుకుంది. అక్కడ ఎక్కడ చూసినా నీరే. లక్షలాది ఇళ్లు నీట మునిగాయి. ప్రజలు సాయమో రామచంద్రా అని ఎదురు చూస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ఏరియల్ సర్వేలో ఆయనకు అక్కడి పరిస్థితి కళ్లకు కట్టినట్లు అయ్యింది. దీంతో కేంద్రం నుంచి తక్షణ సాయంగా రెండు వందల కోట్లు ప్రకటించారు. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకూ దాదాపు నాలుగు వందల మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

 


ఎప్పుడూ పర్యాటకులతో, పచ్చని అందాలతో కళకళలాడే కేరళ ఇప్పుడు దయనీయంగా మారింది. ఆ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు పొరుగు రాష్ట్రాలు ముందుకు రావడం ముదావహం. తెలంగాణ ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ సాయాన్ని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి 25 కోట్ల చెక్కును కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌కు అందజేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తమ వంతు సాయంగా పది కోట్ల రూపాయలు అందజేశారు. తెలుగు వారు ఆపదలో ఉంటే ఆదుకునేందుకు ముందుకు వచ్చే తెలుగు సినీ హీరోలు కేరళకు సాయం చేసేందుకు ముందుకు రావడం మంచి పరిణామం. ఈ విశాల మనసు ఇంతకు ముందు తమిళ హీరోలకు మాత్రమే ఉండేది. అది ఇప్పుడు తెలుగు హీరోలకు కూడా పాకడం ఆనందించాల్సిన అంశమే. తెలుగు హీరోలు అక్కినేని నాగార్జున తన వంతు సాయంగా 28 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ 25 లక్షలు, మహేష్ బాబు 25 లక్షలు, కల్యాణ్ రాం 10 లక్షలు, ప్రభాస్ 25 లక్షలు, పరుణ్ తేజ్ 10 లక్షలు, దిల్ రాజ్ 10 లక్షలు సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే తమిళ హీరోలు తమ వంతు సాయం ప్రకటించారు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచి దాని ద్వారా లక్షలు, కోట్లు పారితోషికాల రూపంలో తీసుకుంటున్న తెలుగు హీరోలు తమను ఇంత వారిని చేసిన సమాజానికి ఏ చేయాలని ముందుకు రావడం శుభ పరిణామమే కదా.

 

 


ఇక తెలుగు రాష్ట్రాలు కూడా వర్షాలకు విలవిల్లాడడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ గత నాలుగు రోజులుగా వర్షాలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డాయి ప్రభుత్వాలు. తెలుగు రాష్ట్రాల్లో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగిపొరలుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నదులైన గోదావరి, క్రష్ణ, వంశధార, నాగావళి, శబరి నీటితో కళకళలాడుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులు కూడా నిండుకున్నాయి. ఈ ప్రాజెక్టుల నుంచి నీటిని సముద్రంలోకి వదలుతున్నారు. వర్షాకాలంలో కురిసిన వర్షాలతో జలాశయాలు నిండుతున్నా... ఆ తర్వాత కాలల్లో ఆ నీటిని వాడుకునేందుకు వీలుగా నీటిని నిల్వ చేసుకోవడానికి ఏర్పాట్లు మాత్రం ఏ ప్రభుత్వం చేయడం లేదు. సాంకేతికత ఎంత పెరిగినా నీటిని నిలువ చేసే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇప్పటికైనా భవిష్యత్ అవసరాలను ముందుగా గ్రహించి నీటిని నిలువ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటే మంచిది.