నెల్లూరు జిల్లాను గడగడలాడిస్తున్న వర్షం...

 

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి నెల్లూరు తడిసి ముద్దయిందని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాల్లో వీధులు చెరువులను తలపిస్తున్నాయి. వర్షపు నీటితో రహదార్లు మూసుకుపోవడంతో పలు గ్రామాలలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

ఆత్మకూరు పరిధిలోని ఆరు మండలాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సోమశిల జలాశయం నుంచి పది వేల క్యూసెక్ ల వరద నీరు సంఘంలోని పెన్నా ఆనకట్ట వద్దకు చేరుతుంది. పెన్నా వద్ద ఉన్న రోడ్డుపై ఉదృతంగా వరద నీరు ప్రవహిస్తుండడంతో అధికారులు గేట్లను మూసివేశారు. దీనితో సంఘం నుండి పొదలకూరు, చేజర్ల మండలాల్లోని గ్రామాలకు వెళ్లేందుకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామంలోని చేనేత కార్మికుల ఇళ్ళల్లో వర్షపు నీరు చేరడంతో మగ్గం గుంతలు నిండి పోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మర్రిపాడు మండలం సన్నువారిపల్లి వద్ద బోగేరు వాగు పొంగిపొర్లుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కృష్ణాపురం గ్రామంలోని కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజి వ్యవస్థ సరిగా లేకపోవడంతో కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

రాయలసీమ ప్రాంతం నుండి వస్తున్న వరద ప్రవాహానికి జిల్లాలోని పడుతున్న వర్షాలు తోడవడంతో సోమశిల జలాశయం నిండుకుండలా మారింది. ప్రస్తుతం జలాశయంలో డెబ్బై మూడు టిఎంసిల నీరు నిల్వ ఉండగా ఇన్ ఫ్లో పదకొండు వేల క్యూసెక్యుల నీరు వస్తుంది. అవుట్ ఫ్లో పన్నెండు వేల క్యూసెక్యుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.ఇప్పటి వరకూ కరీఫ్ లో ఎలాంటి వర్షాలు లేని నెల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసాయి. మంగళవారం నుంచి ప్రారంభమైన వర్షాలు ఇప్పటి వరకు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి పదకొండు గంటల నుంచి ప్రారంభమైన వర్షాలూ నిన్న పగలు దాకా కురిసి కొంచం తగ్గుముఖం పట్టినట్లు తెలిస్తోంది. దీంతో ప్రజలు కొంచం ఊపిరి పీల్చుకున్నారు.పగలు వర్షం కురవకపోగా రాత్రి పెద్ద ఎత్తున ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసాయి.మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి అని చెప్పవచ్చు.కేవలం సుల్లూరు పేట నియోజక వర్గం తప్ప మిగతా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్లా వర్షాలు కురుస్తున్నాయి.