డబ్బుతో కొనలేనిది

అతనో పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగి. సంస్థ కోసం రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేయడంలోనే అతనికి అంతులేని తృప్తి ఉండేది. అలా పనిచేసని ప్రతిసారీ అతనికి పై అధికారుల నుంచి అభినందనలో, పదోన్నతలో లభించేసరికి... తను ఆ సంస్థకి ఉన్నతికి ఎంతగా అవసరమో తెలిసొచ్చేది. అలాంటి ఉద్యోగి ఓ అర్ధరాత్రి వేళ తన ఇంటికి చేరుకునేసరికి, అక్కడ తన పదేళ్ల కొడుకు ఇంకా మేలుకునే కనిపించాడు.

‘‘ఇంత రాత్రయ్యింది ఇంకా పడుకోలేదా’’ అంటూ చిరాగ్గా కొడుకుని అడిగాడు ఉద్యోగి. అతని మనసులో ఇంకా ఉద్యోగం తాలూకు చిరాకు అలానే ఉంది. ‘‘లేదు! నీతో కలిసి తిందామని ఎదురుచూస్తున్నాను’’ అన్నాడు కొడుకు దీనంగా. ‘‘నాతో నీకు పోటీ ఏమిటి! సమయానికి తిని, చదువుకొని, పడుకోక..’’ అంటూ విసుగ్గా భోజనాల బల్ల దగ్గరకి చేరుకున్నాడు తండ్రి. కొడుకు ఏమీ మాట్లాడకుండా ఒకో ముద్దా నిదానంగా తింటున్నాడు. అలా తింటూనే తండ్రి వంక చూస్తున్నాడు. తండ్రి ఇంకా తన ఆఫీసు వ్యవహారాల నుంచి బయటపడలేదు. తన ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ, ఏవో మెయిల్స్ చూసుకుంటూ అన్యమనస్కంగా భోజనం చేస్తున్నాడు.

‘‘నాన్నా! నువ్వు రోజుకెంత సంపాదిస్తావు?’’ అని హఠాత్తుగా అడిగాడు కొడుకు. ఆ మాటలకి తండ్రికి ఒక్కసారిగా కోపం వచ్చింది. ‘‘నీకసలు బుద్ధుందా! పెద్దవాళ్లను ఇలాంటి ప్రశ్నలు అడగకూడదని తెలియదా! అయినా అడిగావు కాబట్టి చెబుతున్నా విను. నా జీతం రోజుకి రెండువేలు. నా తోటివారందరికంటే అది రెట్టింపు. ఎంత కష్టపడితనే నేను ఈ స్థాయికి చేరుకున్నానో తెలుసా!’’ అన్నాడు తండ్రి. అతని మాటలలో తెలియని గర్వమేదో తొణికిసలాడింది. కొడుకు కాసేపు ఏం మాట్లాడలేదు. అటు తరువాత బిక్కుబిక్కుమంటూ ‘‘నాన్నా! నాకు ఓ వేయి రూపాయలు ఇవ్వగలవా!’’ అంటూ అడిగాడు.

 

ఆ మాటలతో తండ్రిలోని కోపం నషాళానికంటింది. ‘‘ఇందాకేమో! నీ జీతం ఎంత అని అడిగావు. ఇప్పుడేమో ఓ వేయి రూపాయలు ఇమ్మంటున్నావు. ఇలా నన్ను విసిగించడానికేనా ఇంత రాత్రివేళ మెలకువగా ఉన్నది. అయినా అంత డబ్బుతో నీకేం పని...’’ అంటూ నానా తిట్లూ తిట్టి చివరికి ఓ వేయి రూపాయల నోటు కొడుకు మొహం మీద విసిరికొట్టాడు.
కొడుకు కళ్లమ్మట నీళ్లు తిరుగుతుండగా నిదానంగా అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. తండ్రి భోజనం పూర్తయ్యింది. ఇక పడుకుందామనుకుంటూ ఉండగా కొడుకు గుర్తుకువచ్చాడు. ‘పాపం తెలిసీతెలియని వయసు. వాడిని మరీ ఎక్కువగా తిట్టాను. ఆఫీసులో కోపమంతా వాడిమీదే చూపించాను,’ అని జాలిపడుతూ ఓసారి కొడుకు గదిలోకి తొంగిచూశాడు. కొడుకు ఇంకా మెలకువగానే ఉన్నాడు. వాడి ముందు బోలేడు చిల్లర ఉంది. ‘వాడేదో కొనుక్కోవాలనుకొని డబ్బులు పోగేసినట్లున్నాడు. దానికి తక్కువ కావడంతో నన్ను అడిగాడు పిచ్చివెధవ’ అనుకున్నాడు.

కొడుకు భుజం మీద చేయివేసి- ‘ఏం నాన్నా! ఏం కొనుక్కోవాలనుకుంటున్నావు. నేను ఇచ్చిన డబ్బుతో లెక్క సరిపోతుందా’ అని అనునయంగా అడిగాడు. కొడుకు బెరుకుగా- ‘‘నాన్నా వచ్చే సోమవారం నా పుట్టినరోజు. ఆ రోజు నువ్వు నాతోపాటు ఇంట్లోనే ఉంటావా!’’ అని అడిగాడు. ‘‘అబ్బే సోమవారమా! ఇంకేమన్నా ఉందా. అయినా మరీ అత్యవసరం అయితే తప్ప నేను సెలవు పెట్టనని నీకు తెలుసు కదా..’’ అన్నాడు తండ్రి తడుముకోకుండా.

 

కొడుకు మరేం మాట్లాడకుండా తన చేతిలో ఉన్న చిల్లరనంతా తండ్రి దగ్గరకి జరిపాడు. దాని మీద ఇందాక తండ్రి ఇచ్చిన వేయి రూపాయలు కూడా పెట్టాడు. ‘‘నాన్నా నీ రోజు జీతం రెండు వేలన్నావు కదా! ఇవిగో రెండువేలు. ఇవి తీసుకునన్నా నాతో ఒక్కరోజు గడపవా ప్లీజ్. నేను ఆర్నెళ్ల నుంచి దాచుకున్న డబ్బంతా కలిపి వేయి రూపాయలయ్యింది. దానికి నువ్వు ఇందాక ఇచ్చిన వేయి రూపాయలు కలిపితే రెండేవేలవుతాయి. ఇవి తీసుకుని నా పుట్టినరోజు నాతోనే గడుపు ప్లీజ్‌!’’ అంటూ ఏడవడం మొదలుపెట్టాడు.

తండ్రికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తాను ఎదుగుతున్నాడని సంబరపడ్డాడే కానీ, ఆ ఎదిగే క్రమంలో ఏ లోతుల్లోకి జారిపోతున్నాడో ఇన్నాళ్లూ అతను గ్రహించలేకపోయాడు. ఎదుగుదల అందరికీ అవసరమే! కానీ దానికోసం దేన్ని ఎంతవరకు వదులుకోవాలి అన్నదే ప్రశ్న.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.