ఆదివారం లేట్గా నిద్రలేస్తే గుండెజబ్బు ఖాయం!

 

రోజంతా ఉరుకుల పరుగుల జీవితం. క్షణం కూడా ఊపిరి సలపనీయని బాధ్యతలు. ఎక్కడికన్నా పారిపోవాలి అనిపించేంత ఒత్తిడి. అందుకనే శనివారం సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తుంటారు చాలామంది. ఇక శనివారం వచ్చిందంటే తమలోని గూడు కట్టుకుపోయిన ఒత్తిడిని దూరం చేసుకునేందుకు బార్కి బయల్దేరతారు. అర్ధరాత్రి దాకా గడిపి తీరికగా ఇంటికి చేరుకుంటారు. ఆపై కళ్లు మూతలు పడేదాకా టీవీ చూస్తూ కూర్చుంటారు.

 

మర్నాడు ఆదివారమే కదా! ఓ గంట ఆలస్యంగా నిద్ర లేవచ్చులే అన్న భరోసా వీరిది. నిజంగానే మర్నాడు బారెడు పొద్దెక్కాకే నిద్రలేస్తారు. కానీ అదేం విచిత్రమో ఒత్తిడి ఏమాత్రం తగ్గినట్లు అనిపించకపోగా... విసుగ్గా, బద్ధకంగా తోస్తుంది. ఇలా అదనంగా నిద్రపోయినా కూడా నిస్సత్తువగా తోచడానికి ‘సోషల్ జెట్లాగ్’ అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. నిద్రని ఆపుకొని ఆపుకొని ఒకేసారి పడుకోవడమే ఈ సోషల్ జెట్లాగ్కి కారణం.

 

సోషల్ జెట్లాగ్ వల్ల మనం నిద్రపోయే సమయాలు ఒకసారి ఎక్కువగానూ, మరోసారి తక్కువగానూ ఉంటాయి. జీవగడియారంలో వచ్చే ఈ మార్పులు జన్యువుల మీద ప్రభావం చూపుతాయి. మన గుండెని కూడా ప్రభావితం చేస్తాయి. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు అమెరికాలోని అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక సర్వేని చేపట్టారు.
సర్వేలో భాగంగా 22 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న 984 మందిని పరిశీలించారు. వారు ఆదివారం నాడు ఎంత ఎక్కువసేపు నిద్రపోతున్నారో చెప్పమని అడిగారు. ఆ తర్వాత వారి ఆరోగ్యానికీ, మానసిక ప్రశాంతతకీ సంబంధించిన వివరాలు సేకరించారు. ఆదివారంపూట ఒక్క గంట ఎక్కువగా పడుకున్నా కూడా మనకి గుండెజబ్బు వచ్చే అవకాశం 11 శాతం ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది! పైగా అంతసేపూ నిద్రపోయినా కూడా వారికి చిరాగ్గానూ, నిద్ర తీరనట్లుగానూ తోచిందట.

 

మనసు, ఆరోగ్యమూ సవ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర ఉండాలన్నది అందరికీ తెలిసిన విషయమే! కానీ ఆ నిద్ర కూడా ఎప్పుడూ ఒకే తీరున ఉండాలని ఈ పరిశోధన రుజువు చేస్తోంది. మర్నాడు ఆదివారం కదా అని శనివారం టీవీ చేస్తూనో, కబుర్లు చెబుతూనో, మందు కొడుతూనో కాలక్షేపం చేయనే వద్దని హెచ్చరిస్తోంది. వారం పొడుగూతా ప్రతి రాత్రీ ఏడు గంటలకు తగ్గకుండా నిద్రపోతూ... ఒకే దినచర్యని పాటించాలన్నది పరిశోధకుల హెచ్చరిక!

- నిర్జర.