దీపావళి రోజున ఊహించని ప్రమాదాలు

 

దీపావళి అంటేనే టపాసులు గుర్తుకువస్తాయి. ఈ రోజున ఎవరి ఆసక్తిని బట్టి వారు ఎన్నోకొన్ని టపాసులను కాల్చకమానరు. అలాంటప్పుడు అవి ఒంటి మీద పడే ప్రమాదం ఉందనో, టపాసులు హఠాత్తుగా పేలిపోవచ్చుననో హెచ్చరిస్తూ రకరకాల జాగ్రత్తల గురించి మనం తరచూ వింటూ ఉంటాము. కానీ దీపావళితో ఊహించని కొన్ని విపత్తులు కూడా లేకపోలేదు.

 

గర్భవతులకు:

దీపావళి రోజున చుట్టబెట్టేసే పొగ, అందులోంచి వెలువడే రసాయనాలు కడుపులోని బిడ్డకు అంత క్షేమం కాదని సూచిస్తున్నారు. పైగా టపాసులకి వచ్చే శబ్దం సైతం బిడ్డకు అపాయమని హెచ్చరిస్తున్నారు. ఇక శ్వాసకోశ వ్యాధులు ఉన్న గర్భవతులైతే దీపావళి నాడు టపాసులకి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. చెవులకు దూది పెట్టుకుని, పొగచూరని ప్రదేశంలో దీపావళి సంధ్యవేళను గడపమంటున్నారు.

 

పిల్లలకు:

నెలల పిల్లలకు దీపావళి నిజంగా పరీక్షా సమయమే! 85 డెసిబుల్స్‌కి పైగా వినిపించే శబ్దాలు వీరి వినికిడి శక్తి మీద ప్రభావం చూపవచ్చు. అతడి మెదడునే దెబ్బతీయవచ్చు. అలాంటిది దీపావళి టపాసులు ఒకోసారి 150 డెసిబుల్స్ వరకూ శబ్దాన్ని విడుదల చేస్తాయి. అందుకే పిల్లవాడి చెవులలో దూది ఉంచమని సూచిస్తున్నారు. శబ్దాలు సద్దుమణిగినా కూడా పిల్లవాడు ఇంకా గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే వైద్యుని సంప్రదించమంటున్నారు. ఇక పిల్లవాడి లేత ఊపిరితిత్తులు కూడా పటాసుల పొగకి తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పసిపిల్లలను దీపావళికి వీలైనంత దూరంగా ఉంచమని కోరుతున్నారు.

 

వృద్ధులు:

దీపావళి సందడి వృద్ధులకు ఏమంత క్షేమకరం కాదు. అకస్మాత్తుగా వినిపించే టపాసుల శబ్దం వల్ల వీరి రక్తపోటు ఒక్కసారిగా హెచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇక గుండెసంబంధ వ్యాధులు ఉన్నవారు ఒకోసారి ఈ శబ్దాల వలన గుండెపోటుకి లోనయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. టపాసుల వల్ల వృద్ధులలో కొన్నాళ్లపాటు నిద్రలేమి, అధికరక్తపోటు వంటి సమస్యలు ఏర్పడవచ్చునట.

 

పెంపుడు జంతువులు:

కుక్కలు, పిల్లులు సూక్ష్మమైన శబ్దాలను సైతం వినగలుగుతాయి. కాబట్టి దీపావళి నాడు పేలే టపాసులు వీటి వినికిడి శక్తి మీద తీవ్రంగా ప్రభావం చూపుతాయి. అందుకే మన ఇంట్లోని పెంపుడు జంతువులు దీపావళి రోజున పిచ్చెత్తినట్లుగా అటూఇటూ పరుగులు తీసేందుకో, ఏ మూలనన్నా దాక్కునేందుకో ప్రయత్నించడాన్ని గమనించవచ్చు. పైగా వాటికి వాసన పీల్చే శక్తి కూడా అధికంగా ఉండటంతో వాతావరణంలోని రసాయనాలకి అవి ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు. ఇక టపాసులను కాల్చేటప్పుడు వాటికి ఏ భూచక్రాలో తగులుకొని గాయాలయ్యే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే వాటిని శబ్దాలు వినిపించని గదిలో ఉంచడమో, మందపాటి దుప్పటి చుట్టడమో చేయాలి. అన్నింటికీ మించి వాటిని బలవంతంగా టపాసులు కాల్చే ప్రదేశంలో వాటిని ఉంచే ప్రయత్నం చేయకూడదు.

 

ఇంతేకాదు! ఆస్తమా వంటి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, మానసిక సమస్యలు ఉన్నవారు... టపాసుల శబ్దాలకీ, పొగకీ వీలైనంత దూరంగా ఉండేలా వారి కుటుంబసభ్యులు జాగ్రత్తతీసుకోవాలి. అప్పుడే దీపావళి అందరికీ గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. లేకపోతే ఆ రాత్రి కాళరాత్రిగా నిలిచిపోతుంది.

 

- నిర్జర.