మంత్రి కావడానికి అర్హత అక్కర్లేదా!

 

అనగనగా ఓ ఆరోగ్యశాఖా మంత్రి. ఆయనగారు ఆసుపత్రిని చూసేందుకు వెళ్లారు. ఆసుపత్రిలోపల అడుగుపెట్టేసరికి అక్కడ ‘మెటర్నటీ వార్డు’ కనిపించింది. అది ఏమిటని అడిగారు- ‘అది స్త్రీల కోసం నిర్మించిన వార్డు’ అని జవాబు వచ్చింది. ‘మరి పురుషులకి మెటర్నిటీ వార్డు’ ఎందుకు లేదని ఎదురు ప్రశ్నించారు మంత్రివర్యులు. ఇది నిజంగా జరిగిందని కొందరూ, ఏదో సరదాకి సృష్టించబడిందని కొందరూ చెబుతుంటారు. కానీ ఇందులో అమాయకత్వం మాత్రమే ఉంది. విషయం తెలిస్తే సరిదిద్దుకునే అవకాశం ఉంది. కానీ మూఢత్వం ఉంటే ఏంటి పరిస్థితి! ఇప్పుడు దేశం అంతా ఇదే చర్చ నడుస్తోంది!

మంత్రులుగా ఉన్నవారికి మన సంస్కృతి మీద గౌరవం ఉండటం తప్పేమీ కాదు. పైగా అది అదనపు అర్హత కూడా! దేశం పట్ల మరింత శ్రద్ధగా పనిచేసేందుకు ఆ గౌరవం తోడ్పడుతుంది. కానీ ప్రతిదీ మన దేశంలోనే ఉద్భవించిందనీ, పాశ్చాత్యులు కనుగొన్నదంతా ట్రాష్‌ అనీ చేసే వాదన పిడివాదానికి దారితీస్తుంది. జ్ఞానం ఏ ఒక్క దేశం సత్తు కాదు. అది ప్రపంచ హక్కు! కాబట్టే ఈ రోజు మనం ఇంత సౌకర్యంగా జీవించగలుగుతున్నాం. ఇంత తెలివిగా మసులుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఒక్కసారిగా జ్ఞానం అంతా భారతీయుల సొత్తు అని నిరూపించే ప్రయత్నం చేయడం, ప్రతి అంశాన్నీ భారతదేశ పురాణాలతో ముడిపెట్టే ప్రయత్నం చేయడం అంటే... కాళ్లు వెనక్కి తిప్పి నడవడమే!

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ డార్విన్‌ సిద్ధాంతాన్ని ఆమోదించేశాయి. రామాయణంలో కోతుల ప్రస్తావన, వామనుడి అవతారం ఈ సిద్ధాంతాన్ని బలపరిచేవే అని వాదించేవాళ్లూ లేకపోలేదు. కానీ ఒక పెద్దాయనకి ఆ సిద్ధాంతం నచ్చలేదు. కోతి మనిషిగా మారడాన్ని ఎవడన్నా అడవికి వెళ్లి చూశాడా అంటూ గయ్‌ మన్నాడు. అంతేకాదు! మంత్రాలన్నీ laws of motionని నిరూపించే సిద్ధాంతాలు అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ అన్న మనిషి ఎవరో సామాన్యుడు కాదు. కేంద్ర మానవవనరుల, ఉన్నతవిద్య శాఖా మంత్రి ‘సత్యపాల్‌ సింగ్‌’గారు. తన ఆలోచనల ప్రకారం పాఠ్యపుస్తకాలు మార్చేయాలని కూడా చెబుతున్నారు!

విద్యాశాఖామంత్రే ఇలా మాట్లాడితే ఇక చెప్పేదేముంది. ఇదే దారుణం అనుకుంటే ఇంతకంటే చిత్రమైన ఉపమానాలు పలు రాష్ట్రాల నుంచి వినిపిస్తున్నాయి. ఉదాహరణకు అసోంలో మంత్రిగా పనిచేస్తున్న ‘హిమాంత విశ్వ వర్మ’నే తీసుకోండి. మనం చేసే పాపాల వల్లే కేన్సర్‌, ప్రమాదాలు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని కర్మసిద్ధాంతాన్ని వెలువరించారు. ఇంతకీ ఈయన ఏ శాఖ మంత్రో చెప్పలేదు కదా... ఆరోగ్యశాఖ మంత్రి!!!

తవ్వుకుంటూ పోతే ఇలాంటి ఉదాహరణలు తట్టెడు కనిపిస్తాయి. మంత్రులేం ఖర్మ, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ వంటి వ్యక్తే, తనకేది తోస్తే అది చెప్పుకొంటూ వివాదాలు పెంచుకుంటూ వెళ్లిపోతున్నారు. ఈ పోటీలో తామేం తక్కువ తినలేదంటూ సాక్షిమహరాజ్ వంటి పార్లమెంట్‌ సభ్యులు సైతం నోటిని ఎడాపెడా ఆడించేస్తున్నారు. దాంతో పుష్పక విమానాల నుంచే విమానాలు వచ్చాయనీ, సీతాదేవి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ అనీ రకరకాల కబుర్లు వినిపిస్తున్నాయి.

ఒకప్పుడు ఏదన్నా శాఖకి మంత్రిగా నియమించేందుకు సదరు వ్యక్తి అర్హతలను, అనుభవాన్నీ పరిగణలోకి తీసుకునేవారు. కానీ పరిస్థితి మారిపోయింది. బాగా మాట్లాడతారనో, నమ్మకస్తులనో, అనుకూలంగా పనిచేస్తారనో, అసమ్మతితో ఉన్నాడనో, మిత్రపక్షం వాడనో... ఇలా నానా కారణాలతో మంత్రులుగా నియమిస్తున్నారు. ఆ కారణాల మధ్య ప్రతిభ అన్న కారణం మాత్రం కాగడా పెట్టినా కనిపించడం లేదు.

పైన చెప్పుకొన్న ఉదాహరణలలో ఎక్కువ బీజేపీ వ్యక్తులవి ఉన్నంత మాత్రాన, మిగతా పార్టీలు నిష్కళంకంగా ఉన్న అపోహ పడటం మంచిది కాదు. నిన్నటికి నిన్న కర్నాటకలో ఎనిమిదో తరగతి చదివిన వ్యక్తి ‘నాకు విద్యాఖాఖ వద్దు మొర్రో, నాకు ఆసక్తి లేదు’ అని చెప్పినా వినకుండా... కుమారస్వామి ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టారు. ఇష్టమూ, అర్హతా లేని పదవిని ఆ వ్యక్తి ఎలా నిర్వహిస్తారో అన్న ఆలోచన కూడా లేకపోయింది. దీని వల్ల చివరికి నష్టపోయేది ఎవరయ్యా అంటే....