బరువు తగ్గాలంటే జామకాయ తింటే సరి!

రోజుకో యాపిల్ తింటే రోగాలన్నీ తగ్గిపోతాయని అంటారు. కానీ యాపిల్‌ సామాన్యులకి అందుబాటులో ఉండని పండు. పైగా డయాబెటిస్‌ ఉన్నవారు యాపిల్ ఎక్కువగా తినకూడదని చెబుతూ ఉంటారయ్యే! ఇక రోగాలు తగ్గే అవకాశం ఎక్కడిది. అందుకనే ఈ సామెతని మార్చి రోజుకో జామకాయ తినమని సూచిస్తున్నారు నిపుణులు...

 

బరువు తగ్గిస్తుంది – జామకాయలో పీచుపదార్థం అధికం. కానీ కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు మాత్రం ఇంచుమించుగా కనిపించవు. శరీరానికి పోషణని అందించే ప్రొటీన్లు, విటమిన్లు మాత్రం జామలో పుష్కలంగా కనిపిస్తాయి. ఓ మాటలో చెప్పాలంటే బరువుపెరగకుండా, శక్తిని అందించేందుకు రూపొందించిన మందులా జామకాయ కనిపిస్తుంది.

 

కఫానికి విరుగుడు – కాలుష్యం పుణ్యమా అని ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. కానీ కఫాన్ని కరిగించేందుకు, ఊపిరితిత్తులలో ఏర్పడే ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనేందుకూ దోర జామకాయలు దివ్యంగా పనిచేస్తాయి. ఇందులో సమృద్ధిగా ఉండే సి విటమిన్ మళ్లీమళ్లీ జలుబు రాకుండా అడ్డుకొంటుంది.

 

 

రక్తపోటుకి అడ్డుకట్ట – శరీరంలో సోడియం శాతం పెరిగి పొటాషియం నిష్ఫత్తి తగ్గినప్పుడు, అది రక్తపోటుకి దారి తీస్తుంది. కానీ జామకాయతో ఈ నిష్ఫత్తి సాధారణ స్థితికి చేరుకుటుంది. వందగ్రాముల జామకాయలో కేవలం 2 mg సోడియం ఉంటే... పొటాషియం ఏకంగా 400 mg ఉంటుంది. ఇంకా మన ఒంట్లోని ట్రైగ్లిజరైడ్స్‌, LDL కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుతుంది. వీటన్నింటి కారణంగా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

 

పళ్లని మెరిపిస్తుంది – జామకాయని తినగానే పళ్లు, చిగుళ్లు బలంగా నున్నగా అనిపిస్తాయి. జామకాయలో ఉండే ఆస్ట్రింజంట్‌ అనే పదార్థమే దీనికి కారణం. అంతేకాదు! జామలో వాపుని తగ్గించే లక్షణాలు, సూక్ష్మక్రిములను సంహరించే శక్తి కనిపిస్తుంది. అందుకనే జామకాయని తింటే పళ్ల దగ్గర నుంచీ పేగుల దాకా జీర్ణవ్యవస్థ అంతా బాగుపడిపోతుంది.

 

 

డయాబెటిస్‌ను అదుపుచేస్తుంది – జామకాయలో glycaemic index చాలా తక్కువగా కనిపిస్తుంది. దీనర్థం... జామకాయని తిన్నాక, అందులోని శక్తి నిదానంగా విడుదల అవుతుందన్నమాట. పైగా ఇందులో చక్కెర పదార్థాలు కూడా తక్కువే! అందుకనే డయాబెటిస్‌ ఉన్నవారు నిక్షేపంగా జామకాయని తినవచ్చని చెబుతూ ఉంటారు. ఇక వంశపారంప్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో, ఆ మహమ్మారిని వీలైనంత దూరంగా ఉంచేందుకు కూడా జామ ఉపయోగపడతుందట. జామలో ఉండే ఫోలేట్ ధాతుపుష్టిని కలిగిస్తుంది; ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ కేన్సర్‌ దరిచేరకుండా చేస్తాయి; విటమిన్‌ ఏ కంటిచూపుని మెరుగుపరుస్తుంది... ఇలా చెప్పుకొంటూ పోతే అసలు ఈ జాబితాకి అంతమే ఉండదనిపిస్తుంది. మరింకేం... చిరుతిండి పేరుతో ఏది పడితే అది తినేసే బదులు ఓ నాలుగు జామకాయలని ఇంటికి తెచ్చుకుంటే పోలా!!!

 

- నిర్జర.