దగ్గుబాటి ఫ్యామిలీ.. తలా ఒక పార్టీ.. జగన్ కి తలనొప్పి!!

 

ఎన్నికల సమయం దగ్గరపడినప్పుడు పాలిటిక్స్ ఇచ్చే కిక్.. సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కూడా ఇవ్వలేదు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. నాయకులు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి జంప్ చేస్తూ ఉంటారు. జంపింగుల వల్ల పార్టీలకు కొన్నిసార్లు లాభాలు ఉంటే కొన్నిసార్లు తలనొప్పులు వస్తాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు ఎవరి ఊహలకు అందట్లేదు. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో చేరతారో అర్థంకావట్లేదు. దగ్గుబాటి కుటుంబం నుంచి హితేష్ వైసీపీలో చేరడానికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడు హితేష్ తో కలిసి వెళ్లి జగన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు.. తన కుమారుడు వైసీపీ నుండి పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారని తన మనసులో మాట చెప్పారు. అయితే ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ ఉంది.

దగ్గుబాటి కుటుంబం గతంలో కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగింది. పురంధేశ్వరి కేంద్రమంత్రిగా కూడా పనిచేసారు. అయితే విభజన ఎఫెక్ట్ తో ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారవడంతో గత ఎన్నికలు సమయంలో పురంధేశ్వరి బీజేపీలో చేరారు. వెంకటేశ్వరరావు మాత్రం ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరం పాటిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు వారసుడు వంతు వచ్చింది. బీజేపీతో భవిష్యత్తు కష్టం. ఏపీలో భవిష్యత్తు కావాలంటే పక్కా టీడీపీ, వైసీపీ లాంటి పార్టీలు కావాలి. టీడీపీని పురంధేశ్వరి తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఆమె టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అందుకే కుమారుడిని వైసీపీ తరపున బరిలోకి దించాలనుకున్నారు. దానిలో భాగంగానే వెంకటేశ్వరరావు కుమారుడితో వెళ్లి జగన్ ని కలిశారు. అయితే వెంకటేశ్వరావు.. జగన్ ని ఆలోచనలనో పడేసే, ఓ రకంగా చెప్పాలంటే తలనొప్పి తెప్పించే విషయం చెప్పారట. అదేంటంటే పురంధేశ్వరి బీజేపీలోనే కొనసాగుతారు. హితేష్ మాత్రం వైసీపీలో చేరతారు అని చెప్పారట. దీంతో జగన్ కి తలనొప్పి మొదలైంది.

అదేంటి పురంధేశ్వరి బీజేపీలో కొనసాగితే జగన్ కి ఎందుకు తలనొప్పి అనుకుంటున్నారా. అక్కడే ఉంది అసలు మెలిక. మీకు పరకాల ప్రభాకర్ గుర్తున్నారు కదా. అదేనండి ఏపీ ప్రభుత్వానికి మీడియా సలహాదారుగా పనిచేసారు. ఆయన సతీమణి నిర్మల సీతారామన్ ఏమో బీజేపీ సర్కార్ లో రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇంకేముంది భర్త టీడీపీ సలహాదారు, భార్య బీజేపీ మంత్రి.. ఇది చాలు టీడీపీ, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని చెప్పడానికి అంటూ వైసీపీ విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ఒకే కుటుంబంలో వేరు వేరు పార్టీలను అభిమానించడం సహజం, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి అని పరకాల చెప్పే ప్రయత్నం చేసినా విమర్శలు ఆగలేదు. దీంతో పరకాల సలహాదారుగా రాజీనామా చేసారు.

ఎవరి తీసుకున్న గోతిలో వారే పడినట్లు ఇప్పుడు వైసీపీ వంతు వచ్చింది. తల్లి బీజేపీ, కొడుకు వైసీపీలో ఉంటే.. బీజేపీ, వైసీపీవి కుమ్మక్కు రాజకీయాలు అంటూ విమర్శలు మొదలవుతాయి. ఎందుకంటే అది వైసీపీ చెప్పిన ఫార్ములానే కదా. దీంతో జగన్ కి ఏం చేయాలో అర్థంగాక బుర్ర బద్ధలవుతుందట. హితేష్ ని పార్టీలో చేర్చుకోవాలా వద్దా అని తెగ ఆలోచిస్తున్నారట. మరి కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం పురంధేశ్వరి బీజేపీని వీడుతారా లేక.. ఏదైతే అది అవుతుందిలే అని హితేష్ ని పార్టీలో చేర్పించుకొని జగన్ విమర్శలు ఎదుర్కుంటారో చూడాలి.

అయితే హితేష్ వైసీపీ ఎంట్రీ వల్ల.. జగన్ కే కాదు దగ్గుబాటి కుటుంబానికి కూడా కష్టాలు మొదలయ్యాయి. దగ్గుబాటి కుటుంబం మీద కొందరు విమర్శలు చేస్తుంటే.. కొందరు జాలి చూపిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ కూటమితో దగ్గరైతే.. ఎన్టీఆర్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించారు.. అలాంటి కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మ శాంతించదు అంటూ పురంధేశ్వరి మండిపడ్డారు. అయితే మరి మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసినప్పుడు ఎన్టీఆర్ ఆత్మ శాంతించిందా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా అదేస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు. అప్పట్లో వైఎస్ తీరు ఎన్టీఆర్ కి నచ్చేది కాదు. మరి ఇప్పుడు కుమారుడిని.. వైఎస్ తనయుడు స్థాపించిన వైసీపీలో చేర్పిస్తే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందా? అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. మరికొందరైతే దగ్గుబాటి వెంకటేశ్వరావుకి ఎన్టీఆర్ అల్లుడిగా.. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేసిన సీనియర్ నేతగా గుర్తింపు, గౌరవం ఉండేవి. అలాంటి వ్యక్తి ఇప్పుడు కొడుకు టికెట్ కోసం తనకంటే జూనియర్ అయిన జగన్ ని బ్రతిమాలుకుంటున్నారు అంటూ జాలిపడుతున్నారు. మరి జగన్, దగ్గుబాటి కుటుంబం ఈ వ్యతిరేకతను ఎలా అధిగమిస్తుందో చూడాలి.