తలనొప్పి ఇక మాయం

 

తలనొప్పి రాని మనిషెవరుంటారు! ఒకప్పుడైతే ఓ గంటా రెండు గంటలకు మించి తలనొప్పి బాధిస్తే, ఏదో ఒక చిట్కా వైద్యం చేసి దాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించేవారు. మరీ తగ్గకపోతే, తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ మోతాదులో మందులను వేసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. ఇలా తలనొప్పి మొదలైందో లేదో అలా ఓ భారీ మందుబిళ్లను చప్పరించేస్తున్నాము. దానివల్ల మన శరీరం నిదానంగా నొప్పి మాత్రలకు అలవాటుపడిపోతోందనీ, రాన్రానూ మోతాదుని పెంచితేనే కానీ ఆ మందులు పనిచేయవనీ నిపుణులు చేస్తున్న హెచ్చరికలను ఎవరూ పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు. తలనొప్పిలో 200కి పైగా రకాలు ఉన్నాయని చెబుతున్నారు వైద్యులు. వీటిలో చాలావరకు ఆకలికో, ఒత్తిడి కారణంగానో, నిద్రలేమితోనో వచ్చే నొప్పులే! ఇక ‘తిక్క తిక్క’ సినిమాలు చూసిన తరువాత వచ్చే నొప్పులూ లేకపోలేదు. ఇలాంటి తాత్కాలిక తలనొప్పులకి మందుబిళ్లల జోలికి పోకుండా కొన్ని చిట్కాలను ప్రయత్నించి చూస్తే సరి.

 

నిదానించండి!: చాలావరకూ తలనొప్పులు మన రోజువారీ ఉన్న ఉరుకులు పరుగుల కారణంగానే ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి తలలో సన్నటి నొప్పి మొదలవగానే, కాస్త నిదానించేందుకు ప్రయత్నించండి. మీ ఉద్వేగాలను తగ్గించుకోండి. ఓ పది నిమిషాల పాటు మీ శ్వాసను గమనిస్తూ, వీలైనంత నిదానంగా శ్వాసను పీల్చుకునేందుకు ప్రయత్నించండి. వీలైతే కాసేపు ద్యానంలో మునిగిపోండి. లేదా ఏదన్నా మంచి సంగీతంలో లీనమయ్యేందుకు ప్రయత్నించండి.

 

నీళ్లు: రోజువారీ హడావుడిలో మునిగిపోయి చాలామంది తగినంత నీరు తీసుకోవడమే మర్చిపోతూ ఉంటారు. నిజానికి శరీరానికి తగినంత నీరు అందకపోయినా కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి ఎంత పనిలో ఉన్నా, అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాసు నీరు తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకోసారి మరీ చల్లటి నీరు తాగడం కూడా కొందరిలో తలనొప్పికి దారితీస్తుంది. పైగా చల్లటి నీటితో దాహం తీరేది కూడా తక్కువే!

 

వేణ్నీళ్లు- చన్నీళ్లు: మెడ దగ్గర కండరాలు బిగుసుకుపోయినట్లుండే తలనొప్పికి, మెడ వెనుక భాగంలో వేడి నీటి కాపడం పెట్టడం చాలా ఉపశమనంగా ఉంటుంది. అలా కాకుండా కణతల వద్ద మాత్రమే నొప్పి ఉంటే, కొన్ని మంచు ముక్కలను గుడ్డలో చుట్టి పెడితే తలనొప్పి నిదానిస్తుంది. మంచు ముక్కల వల్ల అక్కడి రక్తనాళాల వాపు తగ్గి రక్తప్రసారం తిరిగి యథాస్థితికి వస్తాయి. దీంతో తలనొప్పి కూడా ఉపశమించే అవకాశం ఏర్పడుతుంది.

 

చిన్నపాటి కదలికలు: మాడు మీద, కణతుల వద్దా మర్దనా చేస్తే తలనొప్పి నుంచి కాస్తైనా ఉపశమనం లభించడాన్ని గమనించవచ్చు. తలని రెండు భుజాల వైపుగా కదల్చడం, భుజాలను కూడా కిందకీ మీదకీ ఆడించడం వల్ల ఒత్తిడిలో ఉన్న కండరాలకి కాస్త విశ్రాంతిని ఇచ్చినట్లవుతుంది. ఓ నాలుగడులు అలా నడుచుకుంటూ వెళ్లినా ఉపయోగమే!

 

వంటింటి చిట్కాలు: తలనొప్పిని తరిమికొట్టే ఆయుధాలు మన వంటింట్లో చాలానే కనిపిస్తాయి. అల్లం లేదా పుదీనా ఆకులతో చేసిన తేనీరు పుచ్చుకున్నా, దాల్చిన చెక్కని పొడిచేసి కణతులకు పట్టించినా, లవంగ నూనెని వాసన చూసినా, నిమ్మరసం కలిపిన నీటిని తాగినా... తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. మరో వైపు కాఫీ, మద్యం, చాక్లెట్‌ వంటి పదార్థాలు తలనొప్పిని మరింత తీవ్రతరం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

- నిర్జర.