రేవంత్ అరెస్ట్...నివేదిక నమ్మశక్యంగా లేదు

 

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ పై ఈ రోజు ఉదయం విచారణ జరగ్గా.. డీజీపీ మహేందర్‌ రెడ్డిని విచారణకి హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. తాజాగా డీజీపీ కోర్టులో హాజరయ్యారు. విచారణ చేపట్టిన కోర్టు.. ఎవరినైనా, ఎప్పుడైనా అరెస్టు చేస్తారా? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రేవంత్‌ రెడ్డిని అరెస్టు చేయాలని ఏ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారని డీజీపీని కోర్టు ప్రశ్నించింది. అక్కడ ఉన్న ఎస్పీ ఇచ్చిన సమాచారం మేరకు తానే మౌఖికంగా ఆదేశాలు జారీచేశానని డీజీపీ నివేదించారు. అయితే, ఈ వ్యవహారంలో పోలీసుల తీరు పూర్తిగా ఆక్షేపణీయంగా ఉందని, పద్ధతి ప్రకారం అనుసరించలేదని కోర్టు మండిపడింది. నిఘావర్గాలు అక్కడ ఉన్న పరిస్థితిని అంచనా వేస్తూ ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పించగా.. వాటన్నింటిపైనా హైకోర్టు అనుమానాలు వ్యక్తంచేసింది.

ఒక్క నివేదికపైనా అధికారుల సంతకాలు, తేదీలు, అధికారిక ముద్రలు కూడా లేవని, నిఘావర్గాలే వాటిని ఇచ్చినట్టు ఎలా నమ్మాలని నిలదీసింది. కేవలం తమకు ఇవ్వడానికే సృష్టించినట్టు అవి కనబడుతున్నాయి తప్ప నమ్మశక్యంగా లేవని వ్యాఖ్యానించింది. అయితే, నిఘావర్గాల నివేదికలు అలాగే ఉంటాయని, వాటిపై స్టాంపులు వేసే ప్రక్రియ రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థలో లేదని డీజీపీ వివరణ ఇచ్చారు. ఒకవేళ బయట వ్యక్తులెవరైనా సృష్టించి సంతకాలు లేకుండా పత్రాలు ఇస్తే కూడా ఎవరినైనా అరెస్టు చేస్తారా? అని పదే పదే ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు వ్యవహార శైలి సరిగా లేదని సూటిగా వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? అని ప్రశ్నించింది. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా ఎలా వ్యవహరించాలన్న అంశంపై ఓ పద్ధతి ఉండాలని, హుందాగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో ఈ నెల 12న కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.