ఈమెను చంపాలనుకుంటోంది ఎవరు..?

అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలి 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు డేరా సచ్ఛా సౌధ అధినేత గుర్మీత్ రాం రహీమ్ బాబా. ఆధ్యాత్మిక ముసుగులో ఆయన చేసిన అసాంఘిక కార్యకలాపాలకు అంతే లేదని..తాజాగా డేరా కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న తనిఖీల్లో వెల్లడవుతోంది. ఈ క్రమంలో ఆయన అక్రమాలకు ప్రత్యక్ష సాక్షి, గుర్మీత్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌ను పట్టుకునేందుకు రెండు రాష్ట్రాల పోలీసులు, ఐటీబీపీ, బీఎస్ఎఫ్, ఆర్మీ గాలింపు చేపట్టాయి. అత్యాచారం కేసులో శిక్ష పడటానికి ముందు..పడిన తర్వాత గుర్మీత్‌ను తప్పించేందుకు హనీప్రీత్ వ్యూహరచన చేశారు..పంచకులలో జరిగిన అల్లర్లు..దోషిగా తేలిన తర్వాత బాబాను రోహ్‌తక్ జైలుకు తరలించే క్రమంలో డేరా అనుచరులు మారణాయుధాలతో విరుచుకుపడటం ఇందులో భాగంగానే జరిగినట్లు పోలీసులు నిర్థారించారు.

 

ఈ అభియోగంగపై హనీప్రీత్‌ను అరెస్ట్ చేసి విచారణ జరపాలి అనుకునే లోపే గత నెల 25 తర్వాత ఆమె కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1న హనీప్రీత్ సింగ్‌పై లుక్ఔట్ నోటీసు జారీ చేశారు. కానీ అంతకు ముందే ఆమె దేశాన్ని వీడి వుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే డేరా అక్రమాల గుట్టు రట్టు చేయాల్సిందిగా పంజాబ్-హర్యానా ఉమ్మడి హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీస్ శాఖ సిర్సాలోని డేరా హెడ్ క్వార్టర్స్‌లో సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో అనేక విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో హనీప్రీత్‌కు చెందినదిగా భావిస్తున్న ఒక డైరి లభించినట్లు.. తన వివాహానికి ఒక ఏడాది ముందు 1998లో ఆమె రాసుకున్న 101 పేజీల డైరీలో రహస్యాలు ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. ఆ డైరీయే ఇప్పుడు డేరా చీకటి సామ్రాజ్యానికి సాక్ష్యంగా నిలిచిందని ప్రచారం జరుగుతోంది.

 

ఆ చీకటి సామ్రాజ్యంలో తమ స్వప్రయోజనాల కోసం గుర్మీత్‌తో పాటు ఎంతోమంది భాగస్వాములయ్యారని ఇప్పుడు వారి భాగోతం ఎక్కడ బట్టబయలు అవుతుందోనని తప్పించుకునేందుకు మల్లగుల్లాలు పడుతున్నారట. ఈ నేపథ్యంలో డేరా బాబా అనైతిక చర్యలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న హనీప్రీత్‌ను అంతమొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో హర్యానా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ప్రత్యర్థుల చేతికి ఆమె చిక్కేలోగా హనీప్రీత్‌ను పట్టుకుని రాష్ట్రానికి తిరిగి తీసుకురావాలని పోలీసు శాఖ పట్టుదలతో ఉంది. హనీ కోసం ఇండో-నేపాల్ బోర్డర్‌లో ముమ్మరంగా వేట కొనసాగిస్తూ.. బోర్డర్ ఫోర్స్, సైన్యం, ఇతర రాష్ట్రాల పోలీసులతో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు హర్యానా డీజీపీ. ఈ నేపథ్యంలో ఆమెను చంపాలనుకుంది ఎవరా అన్నది మిస్టరీగా మారింది.