కేసీఆర్ నాటిన "మొక్క"కే దిక్కు లేదు

పల్లెలు పచ్చబడాలి..అన్నదాత తలెత్తుకుని తిరగాలి..ఇదంతా జరగాలంటే పచ్చదానన్ని పెంచడమొక్కటే మార్గం. అలా తెలంగాణ మొత్తాన్ని సస్యశ్యామలం చేసే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఊరూరా ఉద్యమంలా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మన్ననలు అందుతున్నాయి..తెలంగాణ బాటలో నడిచేందుకు అనేక రాష్ట్ర ప్ఱభుత్వాలు ముందుకు వస్తున్నాయి. అయితే కేవలం మొక్కలను నాటడమే కాదు నాటిన వాటికి సరైన పోషణ కూడా లభిస్తేనే ముఖ్యమంత్రి ఆశయం నెరవేరినట్లు.

 

అయితే ఆర్భాటంగా మొక్కలను నాటడంతోనే అధికారులు పని అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది..సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాటినే మొక్క ఎండిపోవడం. హరితహారం కార్యక్రమంలో భాగంగా జూలైలో కరీంనగర్ జిల్లా మానేర్‌కట్ట వద్ద మహాఘని మొక్కను నాటారు సీఎం. ప్రస్తుతం ఇది వాడిపోతూ..పూర్తిగా ఎండిపోవడానికి సిద్ధంగా ఉంది. అయితే తాము మొక్కను సంరక్షించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని..కానీ ఈ నెల 9వ తేదిన రాత్రి ముగ్గురు వ్యక్తులు మొక్క వద్ద నిలబడి ఏదో చేశారని..ఆ రోజు నుంచి ఆ మొక్క క్రమంగా వాడిపోతోందని కాపలాదారు చెబుతున్నాడు. అయితే స్వయంగా ముఖ్యమంత్రి నాటిన మొక్కనే నిర్లక్ష్యం చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా నాటిన మొక్కల పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.