ఉత్తమ్ కుమార్ కు హరీష్ రావు 12 ప్రశ్నలు.. చంద్రబాబుని ఇరుకున పెట్టారా?

కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై టీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీతొ పొత్తు ఏ ప్రాతిపదికన చేసుకున్నారంటూ 12 ప్రశ్నలతో కూడిన లేఖాస్త్రాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డికి సంధించారు. చంద్రబాబు ఎప్పటికీ ఆంధ్రా బాబేనని.. తెలంగాణ పక్షం ఆయనెప్పుడూ ఉండరన్నది జగమెరిగిన సత్యమన్నారు. చంద్రబాబుతో కాంగ్రెస్‌ది షరతులతో కూడిన పొత్తా?.. బేషరతు పొత్తా?.. అధికారం కోసం శరం లేని పొత్తు పెట్టుకున్నారా? అంటూ ఘాటైన ప్రశ్నలు వేశారు. కాంగ్రెస్ తన స్వప్రయోజనం కోసం పొత్తు పెట్టుకుందా? లేక రాష్ట్ర ప్రయోజనం కోసం పొత్తు పెట్టుకుందా అనే దానిపై తన వైఖరి చెప్పాలన్నారు.

 

 


అదేవిధంగా గతంలో కాంగ్రెస్, టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడానికి గల కారణాలను వివరించారు. ప్రత్యేక తెలంగాణకు ఒప్పుకున్నందునే గతంలో ఆ పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. నాడు టీఆర్ఎస్.. వందశాతం తెలంగాణ కోసం షరతులతో కూడిన పొత్తులు పెట్టుకుందని వివరించారు. షరతులు ఉల్లంఘించినప్పుడు పొత్తులు తెగదెంపులు చేసుకుని.. మంత్రి పదవులు సైతం వదిలేశామని గుర్తుచేశారు. ఇప్పుడు ఏ ప్రాతిపదికన టీడీపీతో పొత్తు పెట్టుకున్నారో కాంగ్రెస్ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.


హరీష్ రావు చంద్రబాబుని టార్గెట్ చేస్తూ.. ఉత్తమ్‌ కుమార్ రెడ్డికి 12 ప్రశ్నలు సంధించారు.

  1. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా చంద్రబాబు గారు చివరి నిమిషం వరకు ప్రయత్నం చేసారు. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడే ప్రయత్నాలు చేసారు.. చేస్తూనే ఉన్నారు. మరి చంద్రబాబు గారు ఇప్పుడు ఏమన్నా నాకు తెలంగాణ పట్ల ఉండే వ్యతిరేక వైఖరిని మార్చుకున్నాను. భవిష్యత్తులో ఇలాంటి వ్యతిరేక వైఖరిని తెలంగాణ పట్ల ప్రదర్శించనని టీడీపీ పొలిట్ బ్యూరోలో చర్చించి ఏమన్నా తీర్మానం చేసారా? ఆ తీర్మానం కాపీ ఉంటే ప్రజల ముందు పెట్టండి.
  2. సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల విభజన, పోలవరం, ప్రభుత్వరంగ సంస్థల విభజన, హైకోర్టు, నదీజలాల పంపిణీ ఇలా అనేక విషయాల్లో చంద్రబాబు గారు తెలంగాణకు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తున్నారు. అలాంటి తెలంగాణ వ్యతిరేక వైఖరిని విడనాటతానని చంద్రబాబు నుంచి మీరేమన్నా హామీ తీసుకున్నారా? 
  3. విభజన హక్కు చట్టంలో లేకపోయినా ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలోనే రాత్రికి రాత్రి కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసి ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుకోవడం జరిగింది. ఆ ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలుపుతానని చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ ఏమైనా అంగీకారం కుదుర్చుకుందా?
  4. 150 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్ట్ కట్టి.. 50 లక్షల క్యూసిక్కుల నీటి ప్రవాహంతో పోలవరం డ్యాంను ప్రతిపాదించారు. దీనివల్ల భద్రాచలం పట్టణం, రామాలయం మునిగిపోతాయని, తెలంగాణలోని లక్షల ఎకరాలు మునిగిపోతాయని.. దాని ప్రభావం ఎంత ఉంటుందో ఇంకా అంచనా వేయలేదు గనుక డిజైన్ లో మార్పు కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. తెలంగాణ ఇంజినీర్లు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు కూడా డిజైన్ మార్చాలని కోర్టులో కేసు వేశారు. మరి డిజైన్ మార్చడానికి చంద్రబాబు ఒప్పుకున్నారా? చంద్రబాబు వైఖరి ఏంటి? కాంగ్రెస్ స్పష్టం చేయాలి.
  5. చంద్రబాబు గారు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదు.. ఇది అక్రమ ప్రాజెక్ట్.. కొత్త ప్రాజెక్ట్ అని దాదాపు 30 లేఖలు కేంద్రానికి రాసారు. స్వయంగా ఆయనే ఢిల్లీ వెళ్లి గడ్కరీకి, ప్రధానికి ఫిర్యాదు చేసారు. మరి ఇప్పుడు చంద్రబాబు తన వైఖరి మార్చుకొని ఇది అక్రమ ప్రాజెక్ట్ కాదు సక్రమ ప్రాజెక్ట్ అని అంగీకరించారా?
  6. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా కృష్ణా నీటిలో తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీల వాటా కేటాయించడానికి తమకు అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పించగలరా?
  7. కాళేశ్వరం, తమ్మిడిహట్టి, సీతారామ, తుపాకుల గూడెం, దేవాదుల, పెన్‌ గంగ, రామప్ప-పాకాల లింకేజీ తదితర ప్రాజెక్టులపై చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులను చంద్రబాబు వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకున్నారా? ఆ ప్రాజెక్టులు నిర్మిస్తే తమకు అభ్యంతరం లేదని చంద్రబాబు చెప్పగలరా?
  8. తెలుగు జాతి అని మాట్లాడే చంద్రబాబు.. హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు మంచినీళ్లు ఇవ్వడానికి తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారని, అలా తాను ఫిర్యాదు చేయడం తప్పే అని చంద్రబాబు ఏమైనా పశ్చాతాపం వ్యక్తం చేశారా?
  9. 365 రోజులు విద్యుత్ విడుదల చేసే సీలేరు ప్రాజెక్టు లాక్కున్నారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం రోజుకి ఒక కోటి నష్టపోతోంది. సీలేరు ప్రాజెక్టు వెనక్కి ఇవ్వడానికి చంద్రబాబు ఏమైనా ఒప్పుకున్నారా? ప్రాజెక్టుకు బదులుగా తెలంగాణకు నష్ట పరిహారం ఏమైనా ఇచ్చేందుకు చంద్రబాబుతో ఏమైనా ఒప్పందం చేసుకున్నారా?
  10. విద్యుత్ శాఖలోని 1200 మంది ఆంధ్రా ఉద్యోగులను విధుల్లో చేర్చుకుంటామని, తెలంగాణపై ఆర్థిక భారం తొలగిస్తామని చంద్రబాబుతో చెప్పిస్తారా? కోర్టు కేసులను ఉపసంహరింపచేస్తారా?
  11. నిజాం కాలం నాటి ఆస్తులు తెలంగాణకే తప్ప. ఆంధ్రప్రదేశ్‌కు ఉండదనే సత్యాన్ని చంద్రబాబు అంగీకరించారా? ఈ విషయంలో వేసిన కేసులను ఉపసంహరించుకుంటామని ఒప్పందం ఏమైనా చేసుకున్నారా?
  12. హైకోర్టు సత్వర విభజన సహా, ప్రభుత్వ సంస్థల విభజనలో స్తంభన తొలగించడానికి చంద్రబాబు నుంచి ఏమైనా హామీ తీసుకున్నారా?

ఈ అంశాలన్నింటిపై తెలంగాణ ప్రజలకు ఉత్తమ్ స్పష్టతనివ్వాలని, ప్రజల్లోని భయాందోళనలను తొలగించాలని డిమాండ్ చేశారు. కేవలం అధికారం కోసమే పొత్తులు పెట్టుకుంటాం.. రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు అనే భావన ఉంటే ప్రజలను వంచించడమేనని పేర్కొన్నారు. దీనికి ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.