చంద్రబాబుకు హరీష్ రావు లేఖ.. 18 ప్రశ్నలతో మెలిక

 

తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు తెరాస నేత హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. 18 ప్రశ్నలతో కూడిన ఈ లేఖను తాజాగా హరీష్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల ప్రజలకు అభ్యంతరాలున్నాయని అన్నారు. చంద్రబాబు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం ప్రకటించలేదని, ప్రజలకు క్షమాపణ చెప్పలేదని అన్నారు. ఏ మొహం పెట్టుకొని తెలంగాణలో పోటీ చేస్తారని ప్రశ్నించారు.

వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ధర్నా చేసిన చంద్రబాబు.. తాను ఏపీకి సీఎం అయ్యాక అదే ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మహాకూటమి నేతలకు పాలమూరు ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు వస్తే.. అనుమతులు లేవని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని నిలదీశారు. రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన విద్యుత్‌ ఇవ్వలేదని.. ఆ కుట్రలను చేధించిన కేసీఆర్ రాష్ట్రానికి విద్యుత్‌ వెలుగులు తెచ్చారని అన్నారు.

తెలంగాణ ఉద్యమం అంటే చంద్రబాబు అసలు గిట్టదని, తెలంగాణ ఏర్పాటును చివరి వరకు చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చేయాలని బాబు ప్రయత్నించారని ఆరోపించారు. తెలంగాణలో రాజకీయ అస్థిరతకు ప్రయత్నించారన్నారు. తెలంగాణ పట్ల చంద్రబాబుకు నరనరాన వ్యతిరేకత ఉందని హరీష్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో పోటీ చేసి నాలుగు సీట్లు సాధించుకుంటే అభివృద్ధికి అడ్డుపడవచ్చనే కుట్రతోనే టీడీపీ ఇక్కడ పోటీ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రైతులు దశాబ్దాలుగా నీళ్ల కోసం పోరాడారని.. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెరాస ప్రభుత్వం రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుందన్నారు.

అయితే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగుకుండా ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి, వాటర్‌ బోర్డులకు చంద్రబాబు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. గోదావరి, కృష్ణా నదుల నీరు సముద్రంలో వృథాగా కలిసిపోయినా చంద్రబాబు బాధపడరు కానీ.. వాటిని తెలంగాణ రాష్ట్రం వినియోగించుకుంటే మాత్రం సహించలేకపోతున్నారని విమర్శించారు. తెలంగాణ నాశనం కావాలని కోరుకుంటున్న ఆయన.. తిరిగి ఇక్కడ పోటీ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

చంద్రబాబుకు హరీష్ రావు రాసిన బహిరంగ లేఖలోని 18 ప్రశ్నలు:

  • నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవాలని కుట్రలు చేయడం లేదా?
  • పాలమూరు కడతామని 2014 ఎన్నికల్లో మీరు హామీ ఇవ్వలేదా?
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్మడం మీ దుష్ట ఆలోచన కాదా?
  • పాలేరుకు నీళ్లివ్వడం కూడా పాపమేనా?
  • కెసి కెనాల్ కోసం తుమ్మిళ్ల వద్దంటారా?
  • కల్వకుర్తిపై కుట్రలు చేస్తున్నది నిజం కాదా?
  • పోలవరానికి బదులుగా కృష్ణా నీళ్లు ఇవ్వకుండా నాటకాలు ఆడడం లేదా?
  • శ్రీశైలం నుంచి తెలంగాణకు నీరివ్వొద్దనడం మీ కుతంత్రం కాదా?
  • ఎవరి అనుమతితో కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు?
  • పోలవరం మండలాలు గుంజుకోవడం మొదటి అన్యాయం కాదా?
  • సీలేరు ప్లాంటు పోవడం వల్ల ఏడాదికి రూ.500 కోట్ల నష్టం చేయడం లేదా?
  • విద్యుత్ పంపిణీ విషయంలో దుర్మార్గమైన వైఖరి అవలంభించలేదా?
  • పిపిఏలను ఏకపక్షంగా రద్దు చేసి, 2,465 మెగావాట్లు ఎగ్గొట్టలేదా?
  • రూ.4,557 కోట్ల నష్టం చేసిన కుటిలత్వం మీది కాదా?
  • ఇవ్వాల్సిన కరెంటు ఇవ్వకుండా.. టెండర్లలో పాల్గొన్న కుంచితత్వం మీది కాదా?
  • ఖాళీ భవనాలు ఇవ్వక పోవడం మీ సంకుచితత్వం కాదా?
  • హైదరాబాద్ ఆస్తుల్లో వాటా అడగడం మీ దురాశ కాదా?
  • విభజన మాయని గాయం అని బాధ పడలేదా?