సెటిలర్ల ఓట్లు తెరాసకు అవసరం లేదా హరీష్ రావు గారూ.!!

 

తెలంగాణలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఇప్పటికే తెరాస అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేస్తోంది. మొత్తానికి తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? అధికారం ఎవరిని వరిస్తుంది? అంటూ చర్చలు మొదలయ్యాయి. అయితే ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు కూడా కీలకం కానున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం ప్రాంతాల్లో ఏపీకి చెందిన సెటిలర్లు ఉంటారు. ఈ ప్రాంతాల్లో సెటిలర్లు గెలుపోటములను ప్రభావితం చేస్తారు. మరి ఈ సంగతి మర్చిపోయారో లేక సెటిలర్ల ఓట్లు మా గెలుపుని ఆపలేవు అనుకున్నారో తెలీదు కానీ.. తెరాస సీనియర్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు సెటిలర్ల ఓట్లను దూరం చేసే ప్రమాదం తెచ్చాయి. కాంగ్రెస్ కి ఓటేయొద్దు అని ప్రజలకు చెప్పాలనుకొని, సెటిలర్ల ఓట్లు దూరమయ్యే వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఇబ్రహీంపూర్ వద్ద జరిగిన సభలో హారీష్ రావు మాట్లాడుతూ..  కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే  ఏపీకి ప్రయోజనంగా మారుతోందని, తెలంగాణకు లాభం లేదని వ్యాఖ్యానించారు. హారీష్ రావు అనే కాదు మరికొందరు తెరాస నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తుందని.. దీనివల్ల ఏపీకి పరిశ్రమలు తరలిపోతాయి, తెలంగాణలో పెట్టుబడులు తగ్గిపోతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెరాస నేతలు కాంగ్రెస్ ని ఇరుకున పెట్టాలని విమర్శలు చేస్తూ.. సెటిలర్ల ఓట్లను దూరం చేసుకుంటున్నారనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.