హరీష్ తో ఎదురుదాడి... ఈటలకు చీవాట్లు

 

కాగ్ నివేదికపై కాంగ్రెస్ కారు కూతలు కూస్తోందంటూ మంత్రి హరీష్ రావుతో ఎదురుదాడి చేయించినా... కాగ్  అక్షింతలతో కేసీఆర్‌‌ ఆత్మరక్షణలో పడ్డారనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో ఆర్ధిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందంటూ ప్రభుత్వాన్ని కడిగిపారేయడమే కాకుండా‌.... అన్ని రంగాల్లో లోపాలను ఎత్తిచూపడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అసలెక్కడ లోపం జరిగింది? కారణమెవరనే దానిపై పోస్టుమార్టం మొదలుపెట్టారు. ఇంతకాలం ఆదర్శ పాలన సాగిస్తున్నామని చెబుతుంటే... కాగ్‌ మాత్రం తమను ప్రజల ముందు దోషులుగా నిలిపిందని కేసీఆర్ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.

 

ప్రభుత్వం చెబుతున్నట్లుగా తెలంగాణ మిగులు రాష్ట్రం కానే కాదని... ముమ్మాటికీ లోటు ఉందని ప్రభుత్వ లెక్కల్లోని డొల్లతనాన్ని ఎండగట్టిన కాగ్.... అప్పులను ఆస్తులుగా చూపడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. FRBM రూల్స్‌‌ ప్రకారం GSDPలో 3.5శాతానికి మించి అప్పులు తీసుకోకూడదనే నిబంధన ఉన్నా.... ప్రభుత్వం 4శాతానికి మించి అప్పులు చేసిందని కాగ్ కడిగిపారేసింది. ఇదే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందనే మాట వినిపిస్తోంది. అప్పులపై కాగ్‌ కొర్రీలు పెట్టడంతో భవిష్యత్‌లో అప్పులు పుట్టవని కేసీఆర్ ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. అసలే ఎన్నికలవేళ అన్ని వర్గాలను ఆకర్షించేందుకు కొత్త పథకాలు ప్రకటిస్తే... ఇప్పుడు కొత్త అప్పు పుట్టకపోతే సంక్షేమ కార్యక్రమాల అమలు కష్టమవుతుందని టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.

 

దీనంతటికీ ఆర్ధిక లెక్కల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటమే కారణమని కేసీఆర్‌‌ సీరియస్‌‌ అయినట్లు తెలుస్తోంది. అందుకే ఆర్ధికమంత్రి ఈటలను, ఆర్ధికశాఖ కార్యదర్శిని పిలిచి గట్టిగా చీవాట్లు పెట్టినట్లు చెబుతున్నారు. ఆర్ధికశాఖను నిర్వహించడంలో విఫలమయ్యారంటూ ఈటెలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. రెవెన్యూ వ్యయాన్ని కేపిటల్ ఎక్స్ పెండీచర్ లో చూపించడం వల్లే ఇదంతా జరిగిందని గుర్తించిన కేసీఆర్.... ఇది ఆర్ధికశాఖ వైఫల్యానికి పరాకాష్ట అంటూ ఈటలకు చీవాట్లు టాక్ వినిపిస్తోంది. ఆర్ధికశాఖ నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వం అప్రతిష్ట కావాల్సి వచ్చిందని కేసీఆర్ ఫైరైనట్లు చెబుతున్నారు. అసలు ఆర్ధికమంత్రిగా మీరేం చేస్తున్నారంటూ ఈటలను గట్టిగా మందలించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కాగ్ ఎత్తిచూపిన లోపాలపై ఇంటర్నల్‌ ఆడిటింగ్‌‌‌కు ఆదేశించిన కేసీఆర్‌‌.... అన్నింటిపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.