హరికృష్ణ రాజీనామా! ఎందుకో

 

కేంద్రం రాష్ట్ర విభజనపై ప్రకటన చేసేవరకు మౌనం పాటించిన సీమంధ్ర నేతలు ఇప్పుడు వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. అసలు తమ రాజీనామాలతో వారు ఏమి సాధిద్దామనుకొంటున్నారో, అసలు దానివల్ల కేంద్రం మనసు మార్చుకొంటుందని వారు నిజంగా నమ్ముతున్నారో లేదో, లేక సీమంధ్ర ప్రాంతంలో తాము మిగిలిన వారికంటే వెనుకబడిపోతామని భయపడి రాజీనామాలు చేస్తున్నారో గానీ మొత్తం మీద ఒకరిని చూసి మరొకరు పోటీలుపడి మరీ రాజీనామాలు చేస్తున్నారు. తెదేపా రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ కూడా వారం వర్జ్యం, ముహూర్తం అన్ని సరి చూసుకొని ఆదివారం ఉదయం 8.30 గంటలకు యన్టీఆర్ ఘాట్ వద్ద నాటకీయంగా రాజీనామా చేసారు.

 

అయితే, ఆయన రాజ్యసభ సభ్యుడుగా ప్రజలకు ఏమి మేలు చేసారో తెలియదు కానీ, కనీసం రాజ్యసభకు నామినేట్ చేసిన తెదేపా కోసం కూడా ఆయన చేసిందేమీ లేదు. తెదేపా సభలు సమావేశాలు జరిగిన ప్రతీసారి వచ్చి అలకలు, చిరాకు ప్రదర్శించడమే తప్ప ఆయన పార్టీకి ఒరగబెట్టిందేమి లేదు. ఇక పార్టీ (చంద్రబాబు) తనకు చాలా అన్యాయం చేసిందంటూ చాలా కాలంగా పార్టీ వ్యవహారాలకి కూడా దూరంగా ఉంటున్న ఆయన గత కొద్ది రోజులుగా మళ్ళీ పార్టీ తరపున మాట్లాడటం మొదలుపెట్టారు. బహుశః వచ్చే ఎన్నికలలో టికెట్ కోసం ఆయన ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లున్నారు.

 

నందమూరి కుమారుడుగా ఆయన పార్టీ టికెట్ ఆశిస్తే ఆశించవచ్చు తప్ప, లేకుంటే ఆయన ఏవిధంగాను అందుకు అర్హులు కారని చెప్పవచ్చును. ఆయన ఏనాడు బాధ్యతగల పార్టీ సభ్యుడిగా వ్యవహరించలేదు. అదే విధంగా రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు ఏమి చేసారో ఆయనే చెప్పాలి. అటు పార్టీకి గానీ, ప్రజలకు గానీ ఏవిధంగాను అక్కరకు రాని ఆయన, తనకు తీరికున్నపుడు వచ్చి ఒకసారి పార్టీకి, ప్రజలకి మొహం చూపించి మాయమయిపోతుంటారు. మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా జరిగినపోయిన తరువాత వారం వర్జ్యం ముహూర్తం అన్ని చూసుకొని నాటకీయంగా రాజీనామా ఇవ్వడమెందుకు?

 

ఆయన పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు ఆ తేడా ఎన్నడూ కనబడలేదు. అందువల్ల ఆయన రాజీనామా చేయడం వలన ఆయనకే వ్యక్తిగతంగా కొంత నష్టం జరుగుతుంది తప్ప ప్రజలకి కానీ, పార్టీ గానీ మాత్రం ఎటువంటి మేలు జరుగదు. ఆయనకు పార్టీ టికెట్ ఇస్తే ఇవ్వచును కానీ ఇప్పుడు రాజీనామా చేస్తే అందుకు ప్రతిగా ప్రజలు వచ్చే ఎన్నికలలో ఆయనకే ఓటేస్తారని హామీ ఏమీ లేదనే సంగతి ఆయన తెలుసుకొంటే మంచిదేమో.