సంతోషం కావాలా - దానం చేయండి!

మనిషి సంఘజీవి. ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ, ఒకరి బాధను వేరొకరు గమనించుకుంటూ సాగినప్పుడే ఆ జీవితానికి పరమార్థం. అందుకే మతాలన్నీ కూడా దానగుణానికి ప్రాధాన్యత ఇచ్చాయి. అయితే ఇలా దానం చేసినప్పుడు మన మెదడు ఎలా స్పందిస్తుంది అన్న అనుమానం వచ్చింది కొందరు పరిశోధకులకి. తనకి ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల మన మనసుకి కష్టం కలుగుతుందా, తృప్తి లభిస్తుందా అని తెలుసుకోవాలని అనుకున్నారు. అలా చేపట్టిన ఓ పరిశోధన ఇచ్చిన ఫలితం ఇదిగో...

 

స్విట్జర్లాండ్లోని జూరిచ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనని చేపట్టారు. ఇందుకోసం వారు ఓ 50 మంది అభ్యర్థులను ఎన్నుకొన్నారు. వీరందరికీ కూడా కొంత డబ్బు ఇస్తానని వాగ్దానం చేశారు. అయితే ఇలా ఇచ్చిన డబ్బుని స్వంతానికి వాడుకోవచ్చునని కొంతమందికి చెప్పారు. ఆ డబ్బుని వేరొకరికి బహుమతి ఇచ్చేందుకు ఉపయోగించవచ్చని మరికొందరికి చెప్పారు. ఈ రెండురకాల వ్యక్తుల మెదడులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో గ్రహించే ప్రయత్నం చేశారు.

 

దానంతో అభ్యర్థుల మెదడులో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో మార్పు కనిపించింది. మన సామాజిక ప్రవర్తనను నియంత్రించే temporoparietal junction, మనలోని సంతోషాన్ని సూచించే ventral striatum, మనం నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడే orbitofrontal cortex... ఈ మూడింటిలోనూ అనూహ్యమైన మార్పులు వచ్చాయట! అభ్యర్థులలో ఎంత డబ్బు దానం చేయాలి, ఎలా చేయాలి అన్న ఆలోచనలు మొదలవడంతోనే ఈ మార్పులు కనిపించాయి.

 

మనకి ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల ఎనలేని తృప్తి లభిస్తుందని సామాజికవేత్తలు ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. పాశ్చాత్యదేశాలలో కొందరు ధనవంతులు తమ సంపదను దానం చేసేయడం వెనుక కూడా ఇదే కారణం కనిపిస్తుంది. ప్రతిదీ మనకే కావాలి, చేతిలో ఉన్నదాన్ని మనమే దాచుకోవాలి అనే స్వార్థం మన మెదడు మీద ప్రతికూల ప్రభావాన్నే చూపుతుంది. అయితే పరిశోధకులు దానగుణం మంచిది అన్నారు కదా అని ఉన్నదంతా ఊడ్చిపెట్టేయాల్సిన అవసరం ఏమీ లేదట! ఇతరులకి ఎంతో కొంత ఇవ్వాలి అన్న ఆలోచనే చాలా సంతోషాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు.

- నిర్జర.