సంగీతంతో సంతోషం!

 


సంగీతానికి శిశువుల నుంచి పశువుల వరకు స్పందించి తీరతాయంటారు పెద్దలు. శాస్త్రీయ సంగీతాన్ని వినడం వల్ల జ్ఞాపకశవక్తి, గ్రహణశక్తి మెరుగుపడతాయని ఇప్పటికే ఓ పరిశోధన రుజువుచేసింది. సంగీతం వినగానే మనసు సంతోషంతో నిండిపోవడం, ప్రతి ఒక్కరికీ అనుభవంలో ఉన్న విషయమే! ఇప్పుడు ఈ విషయాన్ని కూడా శాస్త్రీయంగా రుజువు చేసే ప్రయత్నం చేశారు ఫిన్లాండుకి చెందిన పరిశోధకులు.

 

రెండు ఆసుపత్రులు:

మెదడు మీద సంగీతపు ప్రభావాన్ని తేల్చుకునేందుకు ఇటలీలోని రెండు ఆసుపత్రులలోని రోగులను ఎన్నుకొన్నారు. వీరికి తొలుత సంగీతాన్నీ ఆ తరువాత సాధారణ శబ్దాలనూ వినిపించారు. ఈ రెండు రకాల ధ్వనులనూ వినేటప్పుడు వారి మెదడులో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గమనించారు. సంగీతం విన్నప్పుడు మెదడులో ఉండే డోపమైన్‌ అనే రసాయనంలో మార్పులు వస్తున్నట్లు తేలింది. డొపమైన్‌కు చెందిన DRD2 rs1076560 అనే వ్యవస్థ ఉత్తేజితం అవుతోందని గ్రహించారు.

 

ఏమిటీ డోపమైన్‌ :

మెదడులోని వివిధ కణాల మధ్య సమాచారాన్ని ప్రసారం చేసే రసాయనమే డోపమైన్‌. ఈ డోపమైన్‌ పనిచేయకుంటే శరీరంలోని కండరాలు ఒక్క అంగుళం కూడా కదలవు. శరీరాన్ని నిస్సహాయంగా మార్చివేసే పార్కిన్సన్స్‌ వ్యాధి కూడా ఈ డోపమైన్ లోపం వల్లే ఏర్పడుతుంది. అంతేకాదు! మనిషి ఉద్వేగాలను కూడా ఈ డోపమైన్ నియంత్రిస్తుంది. డోపమైన్ స్థాయి ఎక్కువైనప్పుడు మనిషి సంతోషంగా ఉంటాడు.

 

సంగీతం – డోపమైన్‌ :

సంగీతం విన్నప్పుడు ఈ డోపమైన్‌లో సానుకూల మార్పులు వస్తున్నాయని తేలింది. దీని వల్ల శ్రోతలలోని భావోద్వేగాలు చాలా సానుకూలంగా మారిపోయాయట. అదే సమయంలో కర్ణకఠోరమైన శబ్దాలను విన్నప్పుడు డోపమైన్‌లో ప్రతికూలమైన మార్పులని గమనించారు. అయితే మనలోని జన్యవులని బట్టి ఈ మార్పులు ఉంటాయని తేల్చారు. సంగీతం కొందరిలో ఉధృతమైన మార్పుని కలిగిస్తుందనీ, మరికొందరిలో సాధారణ మార్పులను తీసుకువస్తుందనీ బయటపడింది.

 

మనిషి మనసు మీద ధ్వని ప్రభావం ఉంటుందని తేలిపోయింది. అయితే ఎలాంటి ధ్వని ఏ ప్రభావం చూపుతుందో తెలుసుకుంటే... మనలోని రోగాలను నయం చేసేందుకూ, మనసుని కుదుటపరిచేందుకు కూడా సంగీతాన్ని ఓ చికిత్సగా ఉపయోగించే అవకాశం ఉంది. ఆ దిశగా పరిశోధనలు మొదలయ్యాయి కూడా!

- నిర్జర.