ఆనందానికి మార్గాలివే!

జీవితమనే ప్రయాణాన్ని ఆనందంగా సాగించాలని ఎవరికి మాత్రం అనిపించదు. కానీ ఏం చేస్తాం. నిరంతరం బోలెడు సమస్యలు. నిత్యం బోలెడు స్పర్థలు. ఆరోగ్యంగానూ, ఆర్థికంగానూ అంతా సవ్యంగానే ఉన్నా మనసులో ఏదో తెలియని వేదన. అదిగో అలాంటివారి కోసమే నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇవి పాటస్తే మీ మనసు ఆనందంతో వెల్లివిరియడం ఖాయమంటున్నారు.


ఆనందాన్ని నటించండి- ఈ విషయం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, మనసు ఏదో తెలియన బాధతో నిండిపోయినప్పుడు... ఆ బాధ స్థానంలో ఆనందాన్ని నిలిపి ఉంచే ప్రయత్నం చేస్తే ఉపయోగం ఉంటుందని అంటున్నారు. ఆవేశం, ఆక్రోశంతో చిరాకుగా ఉన్న మనసుని సంతోషంతో నింపేందుకు ప్రయత్నిస్తే మనలోని ప్రతికూలమైన అనుభూతులు తగ్గిపోతాయన్నది చాలామందికి అనుభవమైన విషయమే!


ప్రకృతికి దగ్గరగా ఉండండి- మనిషికీ, ప్రకృతికీ మధ్య ఓ అవినాభావ సంబంధం ఉంది. అది ఫలానా అని చెప్పలేం కానీ ప్రకృతికి సంబంధించిన ఏ లక్షణాన్ని చూసినా మనసు ఆనందంతో నిండిపోతుందన్నది విజ్ఞానశాస్త్రం కూడా ఒప్పుకున్న విషయం. కాసేపు నీలాకాశాన్ని చూసినా, వెన్నెలలో గడిపినా, ఎగిరే పక్షుల గుంపుని గమనించినా, చెట్లని తడిమి చూసినా... మనసులో ఏదో తెలియని ప్రశాంతత చోటు చేసుకోవడాన్ని గమనించగలం.


వర్తమానంలో జీవించండి- మనిషికి ఉండే అదృష్టమూ, దురదృష్టమూ అతని మెదడే! అది ఎంతగా విశ్లేషించగలదో అంతగా విచారించగలదు కూడా! అలాంటి మెదడుని గతం తాలూకు బాధాతప్తమైన జ్ఞాపకాలలోనో, భవిష్యత్తులో ఏం జరగనుందో అన్న భయాలతోనో కాకుండా... వర్తమానంలో నిలిపి ఉంచగలిగితే చాలావరకు వేదన తగ్గుతుంది. మనం ఎంత కాదనుకున్నా గతం అనుభవాల రూపంలోనూ, భవిష్యత్తు ప్రణాళికల రూపంలో ఎలాగూ మనలో సుడులు తిరుగుతుంటాయి. అంతకుమించి వాటిని పట్టుకు వేళ్లాడితే మిగిలేది వేదనే!


జీవితం పట్ల స్పష్టత- జీవితం పట్ల చాలామందికి తమదంటూ ఓ అభిప్రాయం ఉండదు. ఏదో గాలికి సాగిపోయే నావలాగా అలాంటి జీవితాలు గడిచిపోతుంటాయి. సమాజం దృష్టిలో గొప్పవారనిపించుకోవడమో, తమ అహంకారాన్ని చల్లార్చుకోవడమో... వారి ప్రాధాన్యతలుగా ఉంటాయి. అంతేకానీ తన ప్రత్యేకత ఏమిటి? ఏం సాధిస్తే తన జీవితపు చివరిక్షణంలో తృప్తిగా శ్వాసని విడువగలం? అన్న ఆలోచన ఉండదు. కానీ అలాంటి ప్రశ్నలు మొదలైన తరువాత జీవితంలోని ప్రతిక్షణమూ విలువైనదిగా కనిపిస్తుంది. అలాంటి జీవితాన్ని గడుపుతూ, తన లక్ష్యం వైపుగా ఒకో అడుగూ వేస్తున్నప్పుడు తృప్తితో కూడిన ఆనందం లభిస్తుంది.


ఆరోగ్యాన్ని కాపాడుకోండి- ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పిన మాటను పదే పదే ఒప్పచెబుతూ ఉంటాము. కానీ పీకలమీదకు వచ్చేదాకా దాని గురించి పెద్దగా పట్టించుకోం. రొజూ కాసేపు వ్యాయామానికి కేటాయించడం కాలయాపన కాదు. అది మన జీవితకాలాన్ని పెంచుకుంటూ కాలయముడికి దూరంగా ఉండటమే! అనారోగ్యంగా ఉన్న శరీరంతో మనసు కూడా చిన్నబోతుంది. అందుకని వ్యాయామం, శరీర శ్రమ, పోషకాహారం పట్ల ఎప్పుడూ అశ్రద్ధ వహించకూడదు.


బంధాలను నిలుపుకోండి- మన దగ్గర డబ్బు ఉండవచ్చు. ఏదన్నా అవసరం వస్తే ఆ డబ్బుతో పని జరగవచ్చు. కానీ మనకోసం బాధపడే  ఓ నలుగురు మనుషులు లేనప్పుడు ఎంత డబ్బున్నా ఉపయోగం ఉండదు. డబ్బు లేకుండా ఈ లోకంలో పని జరగవచ్చు కానీ మనుషుల తోడు లేకుండా జరిగే పనిలో జీవం ఉండదు. టీవీ ముందు ఓ గంట గడిపేబదులు ఇంట్లోవారితే గడపితే ఉండే తృప్తి వేరు. పాతకాలపు మిత్రులని, బంధువులని అప్పుడప్పుడూ పరామర్శిస్తే మిగిలే అనుభూతి వేరు.


ఆనందం ఫలానా లక్షణంలో ఉంది. ఫలానా పనిచేస్తే వస్తుంది అని ఐదారు కారణాలు చెప్పడం మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే ఆనందం మన మనసులో ఉంది. మరి ఏం చేస్తే అది వెలికివస్తుందో తెలుసుకోవడం మన చేతుల్లోనే ఉంది. అందుకనే ఆనందానికి సంబంధించి ప్రతి ఒక్కరికీ తమదైన ఓ జాబితా ఉంటుంది. మరి మీ జాబితా ఏమిటో శోధించి చూసుకోండి.

 

- నిర్జర.