ప్రతి క్షణాన్నీ ఒడిసి పట్టుకో...


 

కొంతమందిని చూస్తే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆనందాన్ని అడుగడుగునా పంచుకుంటూ, జల్లుకుంటూ వెళుతూఉంటారు. వారి జీవితాల్లో ఆనందం మాత్రమే ఉందా అన్నట్టు కనిపిస్తారు. "సీక్రెట్ ఏమిటి" అని వారిని కలిసిన ప్రతీ ఒక్కరు ఆలోచనలో పడక తప్పదు. ఇంతకీ సీక్రెట్ ఏమై ఉంటుంది? దానికి సమధానం తెలుసుకునే ముందు మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. ఆనందం, సంతోషం, అనగానే వెంటనే మీకు గుర్తు వచ్చే కొంతమంది పేర్లు ఒకచోట వ్రాయండి. అదేవిధంగా మీ జీవితంలో సంఘటనలు కూడా రాయండి. లిస్టు ఎంత వుంది?  చిన్నది అయితే కొంచం ఆనందం కోసం సీరియస్‌గా  ఆలోచన మొదలు పెట్టండి. ఎందుకంటే కొన్ని విషయాలు, సంఘటనలు మాత్రమే మనకి ఆనందాన్ని పంచుతాయి అని మనం చాలా గట్టిగా నమ్ముతాం. 

అదే చంటి పిల్లలని ఒకసారి గమనించండి.... ఒక బొమ్మ కావాలని అడుగుతాడు. పేచీలు పెడతాడు. ఇస్తే సరేసరి, లేకపోతే వాడిని సముదాయిస్తే మరచిపోయి వేరొక వస్తువుతో ఆడుకుంటాడు, ఆనందంగా గడిపేస్తాడు. వాడి దృష్టిలో ఆడుకోవటం ముఖ్యం.... ఆడుకునే వస్తువు కాదు. కానీ మనకి ఆనందంగా ఉండడం ముఖ్యంకాదు అలా ఉండడానికిగల కారణాలు ముఖ్యం. డబ్బు, ఉద్యోగం, హోదా ఇవ్వన్నీ ఉన్నవాళ్ళు ఆనందంగా ఉంటారని కొంతమంది అభిప్రాయం. మరి వాళ్ళు ఆనందంగా ఉంటున్నారా? అవి మాత్రమే మనిషికి ఆనందానికి కారణాలు అనుకోవటం కేవలం అపోహ మాత్రమే. అవి లేనివాళ్ళు ఎంతోమంది చాలా ఆనందంగా ఉంటున్నారనేవిషయం మీకు తెలుసా. ఎందుకంటే అవేవీ లేనివారు వారికున్న వాటితో తృప్తిగా జీవిస్తున్నారు. అందుకే వాళ్ళు ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతున్నారు.  
    
పసిపిల్లల బోసినవ్వు చూసినా, పండువెన్నెలని చూసినా, వర్షపు చినుకుల్లో తడిసినా, సూర్యోదయ - సూర్యాస్తమయాలని చూసినా మనస్సు ఆనందంతో పొంగిపోతుంది. ఆ ఆనందానికి కారణాలు గానీ, లాభాలుగానీ ఏమిటి? అని ఆలోచిస్తామా? అలాగే జీవితంలో ఆనందంగా ఉండాలి అన్నది మన నిర్ణయం అయితే పరిమితులు ఉండవు. కారణాలు వెతుక్కోము. వేటికీ ఆపాదించం. కాబట్టి ఆనందంగా వుండాలి అంటే సీక్రెట్ ఒకటే ఆనందంగా వుండాలని కోరుకోవటం... ఆ ఆనందాన్ని దేనితో ముడిపెట్టకుండా, అలాగే  అదేదో దానంతట అదే వస్తుందని ఎదురు చూడకుండా  ఎప్పుడూ మనతోనే వుంది అని నమ్మితే...  ప్రతీ క్షణాన్నీ ఆస్వాదిస్తే ఆనందం మన సొంతం.

-రమ