జుట్టు గురించి కొత్త విషయాలు

 

జుట్టుకి మనం ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందం గురించి పెద్దగా శ్రద్ధపెట్టని వారు సైతం చీటికీ మాటికీ జుట్టుని సరిచేసుకోక మానరు. ఆ జుట్టు రాలిపోతున్నా, తెల్లబడుతున్నా కంగారుపడని మానవుడూ ఉండడు. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే ఈ మధ్యనే జుట్టు గురించి కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. అవేమిటంటే...

ఉక్కుకంటే గొప్పది

మన వెంట్రుకలు, అంతే సన్నగా ఉండే ఉక్కతో సమానమైన బలం కలిగి ఉంటాయని చదివే ఉంటాము. కానీ ఉక్కుకంటే వెంట్రుకే గొప్పది అని చెప్పడానికి ఓ కారణం ఉంది. అదే స్థితిస్థాపకగుణము (elasticity). ఒక వెంట్రుకని దాదాపు ఒకటిన్నర రెట్లు లాగిన తరువాత కానీ అది తెగదు. మరే లోహంలోనూ ఇలాంటి గుణం కనిపించదు. చిత్రమేమిటంటే నిదానంగా లాగేకన్నా గబుక్కున జుట్టుని లాగినప్పుడే అది మరింత బలంగా కనిపిస్తుందట.

 

కారణం తెలిసింది

ఒక పక్క దృఢంగా ఉంటూనే మరోపక్క సాగతీత గుణాన్ని కలిగి ఉండటం వెనుక కారణం ఏమిటా అని పరిశోధన మొదలుపెట్టారు. జుట్టులో ఉండే రెండు సూక్ష్మమైన వ్యవస్థలే దీనికి కారణం అని తేలింది. అవే కార్టెక్స్, మాట్రిక్స్లు! ఒక చిన్నపాటి కార్టెక్స్లో వేలాది ‘alpha helix chains’ అనే కణాలు ఉంటాయి. చుట్టలు చుట్టలుగా ఉన్న ఈ కణాలు జుట్టుని లాగినప్పుడు విచ్చుకుంటాయి. అంటే జుట్టుని లాగినా కూడా తెగకుండా నిలిపి ఉంచుతాయన్నమాట. మాట్రిక్స్ వ్యవస్థలో ఇలాంటి ఏర్పాటు ఏదీ లేకపోయినా, జుట్టు గట్టిదటానికి తోడ్పడుతుంది. అంటే ఈ రెండు వ్యవస్థలూ కలిసి జట్టు పాడవకుండా కాపాడతాయన్నమాట.

 

తడి జుట్టుని దువ్వకూడదా!

జుట్టు దృఢత్వానికి కారణం తెలిసింది సరే! మరి అది ఉష్ణోగ్రతలకి ఎలా ప్రభావితం అవుతుందో కూడా చూడాలనుకున్నారు. అందుకోసం నీటిలో తేమశాతం ఎక్కువగా ఉన్నప్పుడు కార్టెక్స్, మాట్రిక్స్ల పనితీరుని గమనించారు. జుట్టులోకి అధికశాతం తేమ చేరినప్పుడు దానిలోని సాగతీత గుణం కొంత తగ్గి, వెంట్రుకలు త్వరగా తెగిపోతున్నట్లు తేలింది. అంటే తడిగా ఉన్న జుట్టుని దువ్వకూడదంటూ ఇప్పటివరకూ పెద్దలు చెబుతూ వస్తున్న మాట నిజమేనన్నమాట! అలాగే 60 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతల వద్ద వెంట్రుకలు శాశ్వతంగా దెబ్బతినిపోవడాన్ని కూడా గమనించారు. చీటికీ మాటికీ హెయిర్ డ్రయ్యర్ల వంటి పరికరాలు వాడద్దంటూ వినిపించే హెచ్చరికలు కూడా నిజమే అని అర్థమవుతోంది.

పరిశోధకులు కనుగొన్న ఈ కొత్త విషయాలు జుట్టు విషయంలో కొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయని ఆశిస్తున్నారు. జుట్టుని దృఢంగా ఉంచేందుకు కొత్త చికిత్సలను రూపొందించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడవచ్చు. అంతేకాదు! జుట్టులోని కణజాలాన్ని గమనించడం ద్వారా, అదే తరహా కణజాలంతో కొత్తరకం లోహాలను ఉత్పత్తి చేయవచ్చని కూడా భావిస్తున్నారు.

- నిర్జర.