పురుషులలో రొమ్ము సమస్యలు


ప్రకృతిపరంగా మగవారికి రొమ్ము ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి వారికి రొమ్ముకి సంబంధించిన ఏ సమస్యలూ ఉండనే ఉండవనుకుంటారు. కానీ ఇది అపోహ అనీ, మగవారిలోనూ రొమ్ముకి సంబంధించిన సమస్యలు వస్తాయని వైద్యలు చెబుతున్నారు. అవేమిటంటే...

 

మగవారిలో పెరిగే రొమ్ములు- గైనకోమాస్టియా

ఆడపిల్లలైనా, మగపిల్లలైనా రొమ్ముకి సంబంధించిన కణజాలం ఇద్దరిలోనూ ఉంటుంది. ఆడవారిలో ఈస్ట్రోజన్‌ అనే హార్మోను ప్రభావం వల్ల కౌమార వయసు నుంచి రొమ్ము పెరుగుదల ఉంటుంది. మగవారిలో ఈ ఈస్ట్రోజన్‌ ప్రభావం తక్కువగానూ, ఆండ్రోజన్‌ అనే హార్మోను ప్రభావం ఎక్కువగానూ కనిపిస్తుంది. కౌమార వయసుకి చేరుకున్న మగపిల్లలలో ఒకోసారి శరీరంలోని హార్మోనులు గతి తప్పే ప్రమాదం ఉంది. దీని వల్ల తగినంత ఆండ్రోజన్‌ ఉత్పత్తి కాకపోవడం... అదే సమయంలో ఈస్ట్రోజన్‌ ఉత్పత్తి అవసరానికి మించి ఉండటం జరిగిందనుకోండి- వారిలోనూ రొమ్ములు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని గైనకోమాస్టియా అంటారు.

 

కౌమార వయసులో గైనకోమాస్టియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ, దీనికి ఇతరత్రా కారణాలు కూడా లేకపోలేదు. కొన్ని రకాల మందుల దుష్ప్రభావం, కీమోథెరపీ, కిడ్నీ లేదా కాలేయ సమస్యలు కూడా మగవారిలో రొమ్ములు పెరిగేందుకు దోహదపడుతుంటాయి. గైనకోమాస్టియా వల్ల ఆరోగ్యపరంగా ఎద్దగా ప్రభావం లేనప్పటికీ, రొమ్ములతో కనిపించే మగవారు ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. ఒకవేళ కౌమార వయసులోని పిల్లలో ఈ సమస్య ఏర్పడితే వారు తోటివారి ఎగతాళికి గురయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి మానసిక కారణాల వల్ల వారి వ్యక్తిత్వమే దెబ్బతినవచ్చు. 

 

సాధారణంగా ఈ సమస్య దానంతట అదే సర్దుకుంటుంది. కానీ నెలల తరబడి కనుక గైనకోమాస్టియా లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. ఎందుకంటే తొలినాళ్లలో కనుక గైనకోమాస్టియాను గుర్తిస్తే పోషకాహారం తీసుకోవడం, తగిన వ్యాయామం చేయడం వంటి చిన్నపాటి చర్యలతో వాటిని నివారించవచ్చు. ఒకోసారి వైద్యులు ఈస్ట్రోజన్‌ ఉత్పత్తిని నియంత్రించే మందుల ద్వారా కూడా వీటిని నయం చేస్తారు. మరీ అత్యవసరం అయితే సర్జరీ ద్వారా మగవారి రొమ్ములలో అధికంగా పేరుకున్న కొవ్వుని తొలగిస్తారు. ఒకప్పుడు చాలా అరుదుగా కనిపించిన ఈ గైనకోమాస్టియా సమస్య పురుగుల మందులు, కాస్మెటిక్‌ ఉత్పత్తుల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోవడం వల్ల మరింత తరచుగా కనిపిస్తుండటం ఆందోళన కలిగించే విషయం.

 

మగవారిలో రొమ్ము క్యాన్సర్‌

మగవారికి ఏదో కారణంగా రొమ్ముల ఏర్పడే అవకాశం ఉందని చాలామందికి తెలుసు! కానీ మగవారిలో రొమ్ము క్యాన్సర్‌ కూడా వస్తుందన్న విషయమే ఎవరూ నమ్మరు! కానీ ఇది నిజం. 90 శాతానికి పైగా రొమ్ము క్యాన్సర్‌లు మహిళలలో కనిపిస్తున్నప్పటికీ, మగవారిలో కూడా ఈ సమస్యల వచ్చే ప్రమాదం లేకపోలేదు. అయితే ఈ సమస్య ఉన్న మగవారు మరింత తీవ్రంగా ప్రభావితం అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే తమలో కూడా రొమ్ము క్యాన్సర్‌ ఉందని మగవారు గుర్తించే సందర్భం తక్కువ. పైగా వారిలో ఛాతీ మీద తగినంత కణజాలం ఉండదు కాబట్టి, క్యాన్సర్‌ వారి శరీరంలోని ఇతర భాగాలకు చాలా త్వరగా వ్యాపిస్తుంది.

 

గైనకోమాస్టియాలాగానే రొమ్ము క్యాన్సర్‌ కూడా ఈస్ట్రోజన్‌ అసమతుల్యత వల్ల ఏర్పడే ప్రమాదం ఉంది. దీనికి తోడు
అతిగా మద్యపానం సేవించడం వల్ల వచ్చే లివర్‌ సిరోసిర్‌ వ్యాధి వల్లా, రేడియేషన్‌కు గురవ్వడం వల్ల కూడా మగవారిలో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక వృషణాలకు సంబంధించిన వ్యాధులు కూడా ఒకోసారి రొమ్ము క్యాన్సర్‌కు కారణం అవుతాయట. వంశపారంపర్యంగా ఈ వ్యాధి ఉన్నవారికి, రొమ్ము క్యాన్సర్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు.

 

రొమ్ము క్యాన్సర్‌ను నిర్ధరించడంలో కానీ, చికిత్స చేయడంలో కానీ ఆగామగా తేడా ఉండదు. మమ్మోగ్రఫీ, బయాప్సీల ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను నిర్ధారిస్తారు. శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ కణితని తొలిగించి... కీమోథెరపీ, హార్మోను థెరపీల సాయంతో వ్యాధిని అదుపులోకి తీసుకువస్తారు. అయితే ఎంత త్వరగా ఈ క్యాన్సర్‌ను గుర్తిస్తే అంత ప్రభావవంతంగా చికిత్స ఉంటుంది. అందుకే మగవారు కూడా ఈ కింది లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి-

 

- చనుమొనలో ఎలాంటి మార్పులు కనిపించినా అశ్రద్ధ చేయకూడదు. చనుమొన నుంచి రక్తస్రావం జరగడం, పుండు పడటం, రంగుమారడం, ఆకారంలో మార్పు కనిపించడం వంటి లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి.

- రొమ్ము భాగంలో వాపు, నొప్పి, చర్మం రంగుమారడం.

- ఛాతీ భాగంలో గడ్డలు కనిపించడం, చర్మం అడుగున రంగుమారడం.

- భుజాల దగ్గర గడ్డలు ఏర్పడం (లింఫ్‌ గ్రంధుల వాపు వల్ల).

- హఠాత్తుగా బరువు తగ్గిపోవడం, తరచూ నీరసంగా ఉండటం.

- రొమ్ము లోపల ఉన్న ఎముకలలో నొప్పి రావడం.

 

వీటిలో ఏ సమస్యలు ఉన్నా తక్షణమే వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది.వైద్యం విస్తృతంగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఎంత త్వరగా మనం ప్రతిస్పందిస్తామన్నదాని మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం మగవారిలో రొమ్ము క్యాన్సర్‌ రాదు వంటి అపోహలను తొలగించుకొని, అవగాహన పెంచుకోవడం అవసరం.

- నిర్జర