సీఎం రమేష్ చంద్రబాబుకు బినామీ..!!

 

టీడీపీ, చంద్రబాబు నాయుడు ఈ పేర్లు వింటే బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కి విమర్శలు తన్నుకొస్తాయి.తాజాగా జీవీఎల్ మరోసారి టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.ఐటీ కంపెనీల పేరుతో చంద్రబాబు భూకుంభకోణం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకూ భూ కేటాయింపుల్లో కనిపించిన కంపెనీలు రాష్ట్రానికి వచ్చిన దాఖలాలే లేవని చెప్పారు. ప్రభుత్వం కేటాయించిన కంపెనీలన్నీ లోకేష్‌ బినామీలేనని విమర్శించారు. 24 గంటల్లో కంపెనీలకు కేటాయించిన భూముల వివరాలు, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో వారి వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీ కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు లూటీ చేశారని ధ్వజమెత్తారు.నారా లోకేష్‌ అర్హతలపై పవన్‌ కళ్యాణ్‌ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరారు.

ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ బాధితుల దగ్గరకు వెళ్తున్నారని, సహాయక చర్యలు తక్కువ ప్రచారం ఎక్కువ అని ఎద్దేవా చేశారు.కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.కానీ కర్మాగారం విషయంలో కేంద్రం అడిగిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కడప జిల్లాలో టీడీపీ తలపెట్టింది దొంగదీక్షని ఎద్దేవాచేశారు.

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పై జీవీఎల్ కూడా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.సీఎం రమేశ్‌ బినామీ కంపెనీలతో రూ.వందల కోట్లు దారి మళ్లించారని జీవీఎల్ ఆరోపించారు.సొంత కంపెనీ అకౌంట్స్‌లోనే దొంగ లెక్కలు చూపించే వ్యక్తిని చంద్రబాబు పబ్లిక్ అకౌంట్స్ నెంబర్‌గా చేశారని విమర్శించారు. సీఎం రమేష్ లాంటి వ్యక్తుల వల్ల పార్లమెంట్ పరువుపోతుందని ధ్వజమెత్తారు.తక్షణమే రమేష్‌ను పెద్దల సభ నుంచి చంద్రబాబు వెనక్కి తీసుకోవాలన్నారు.లేదంటే చంద్రబాబుకు రమేష్‌ బినామీ అనే ముద్ర వస్తుందని తెలిపారు.టీడీపీలో విలువలు లేవని చెప్పడానికి సీఎం రమేషే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.రమేష్‌తో రాజీనామా చేయించకపోతే ఎతిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.