నల్గొండ జిల్లా టీఆర్ఎస్‌లో వర్గపోరు.... మంత్రి-ఎంపీ మధ్య కోల్డ్‌ వార్‌

 

నల్గొండ జిల్లా టీఆర్ఎస్ నేతల్లో అంతర్గత పోరు నడుస్తోంది. ప్రతి విషయంలోనూ గులాబీ నేతలు వ్యూహ, ప్రతివ్యూహాలతో ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య విబేధాలు తీవ్రస్థాయికి చేరడంతో గ్రామస్థాయిలోనూ కార్యకర్తలు వేర్వేరు గ్రూపులుగా విడిపోయి పనిచేస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో మంత్రి జగదీశ్ రెడ్డికి తిరుగులేని పట్టున్నా....  ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో జగదీశ్‌రెడ్డి హవాకు గండిపడింది. దాంతో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గుత్తా అనుచరులకు, టీఆర్ఎస్ నేతలకూ మధ్య వార్ నడుస్తోంది. ముఖ్యంగా నల్గొండను మూడు జిల్లాలుగా విభజించాక టీఆర్ఎస్‌ నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత తారాస్థాయికి చేరింది.

 

నల్గొండ నియోజకవర్గంలో నాలుగు గ్రూపులుగా ఏర్పడిన నేతలు పార్టీ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పట్టుబిగించగా.. మంత్రి జగదీశ్ రెడ్డి తన గ్రూపును పెంచుకుంటున్నారు. గిరిజన నియోజకవర్గమైన దేవరకొండలో ఇద్దరు నేతల మధ్య పోరు సాగుతోంది. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ తమ అనుచరులతో బలప్రదర్శన చేస్తున్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ ఓ వర్గంగా.. జెడ్పీ చైర్మన్, మంత్రి జగదీశ్ రెడ్డి ఓ వర్గంగా పనిచేస్తున్నారు. దీంతో అధికారిక కార్యక్రమాల్లో ఎడమొహం, పెడమొహ‍ంగా ఉంటున్నారు. 

 

ఇక మిర్యాలగూడలోనూ రెండు గ్రూపులు ఉన్నాయి. ఎంపీ గుత్తా అనుచరుడిగా ఎమ్మెల్యే భాస్కర్‌రావు పావులు కదుపుతుండగా..... నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ అమరేందర్ రెడ్డి మంత్రి అనుచరుడిగా కొనసాగుతున్నారు. నాగార్జునసాగర్ ఇన్‌ఛార్జ్‌ నోముల నర్సింహయ్య నాన్ లోకల్ అన్న వాదన బలపడటంతో రెండు గ్రూపులు పనిచేస్తున్నాయి. దాంతో ఆయన ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు హాజరుకాకుండా అతిథి గృహానికే పరిమితం కావాల్సి వస్తోంది. మునుగోడులో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గ్రూపుల మధ్య కూడా విబేధాలు తీవ్రమయ్యాయి. ఒకరు పాల్గొనే కార్యక్రమాలకు ఒకరు దూరంగా ఉండేంత పరిస్థితి అక్కడ నెలకొంది. 

 

వర్గపోరు ఇలా ఉంటే.. నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులను వలసొచ్చిన వారికే కట్టబెడుతున్నారని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే పార్టీల నుంచి వలసొచ్చినోళ్లకు పదవులు ఇవ్వడమేంటని ఉద్యమకాలం నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇంతకాలం గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నల్గొండ కాంగ్రెస్‌కి పేరుంది. ఇప్పుడు దానికి ఏమాత్రం తీసిపోని విధంగా టీఆర్ఎస్‌లో అంతర్గత పోరు సాగుతోంది. దాంతో భవిష్యత్లో పార్టీ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన కార్యకర్తల్లో నెలకొంది.