జగన్ తో పాదయాత్ర..చంద్రబాబుతో భేటీ

 

ఏపీ రాజకీయాల్లో ఏ ప్రజాప్రతినిధి ఎప్పుడు ఏ పార్టీలోకి మారతాడో అర్ధం కానీ పరిస్థితి. ముఖ్యంగా మాజీ ప్రజాప్రతినిధుల దారెటో కనిపెట్టటం ఎవరి తరం కావటం లేదు. వరుసపెట్టి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులని కలుస్తున్నారుగాని ఏ పార్టీలో చేరతారు అనేదానిపై స్పష్టత ఇవ్వట్లేదు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ గుప్త ఆ కోవకు చెందిన వారే. 2009 ఎన్నికల్లో మధుసూదన్ గుప్తా గుంతకల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఈయన ఏ పార్టీ తరఫునా పోటీ చేయలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో తను మళ్లీ పోటీ చేయడం మాత్రం ఖాయమని గుప్తా గతంలో ప్రకటించారు. అయితే ఏ పార్టీ తరఫున అనే అంశం గురించి ఆయన స్పష్టతను ఇవ్వలేదు.

గత ఏడాది అనంతపురం జిల్లాలో  వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో మధుసూదన్ గుప్తా కనిపించారు. జగన్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జగన్ తో కలిసి పని చేసిన అనుభవం ఉందని, ఆ అనుబంధంతోనే జగన్ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించినట్టుగా మధుసూదన్ గుప్తా తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ లో చేరుతున్నారనే వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. కానీ అనూహ్యంగా ఆయన నిన్న వెలగపూడిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. దీంతో ఆయన టీడీపీలో చేరుతున్నారని ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టే గుప్త కూడా కొంతకాలంగా టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా పాలుపంచుకుంటున్నారు. అంతేకాకుండా మధుసూదన్‌ గుప్తను టీడీపీలోకి తీసుకొచ్చి గుంతకల్లు ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కూడా గత కొంతకాలంగా తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారు. వైసీపీ,టీడీపీ అధ్యక్షులని కలిసిన గుప్తా..ఏ పార్టీలో చేరతారో లేక ఇంకే పార్టీ అధ్యక్షున్ని కలుస్తారో చూద్దాం..!