అమిత్ షా ఓటమిని తన ఖాతాలో వేసుకోరట..?

ఇటీవల ముగిసిన గుజరాత్ రాజ్యసభ ఎన్నికలను బీజేపీ అధిష్టానం ఎంత సీరియస్‌గా తీసుకుందో తెలిసిందే. తమకు బద్ధ శత్రువైన అహ్మద్ పటేల్‌ను ఓడించడానికి ప్రధాని మోడీ, అమిత్‌ షా చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్నీ కావు. మెజారిటీ ప్రకారం తమకు రెండు సీట్లు గెలుచుకునే సత్తా ఉందని తెలిసికూడా..కావాలని మూడో అభ్యర్థిగా బల్వంత్ సింహ్‌ను పోటీలో నిలబెట్టారు. ఆయన్ను గెలిపించేందుకు గానూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి ఆరుగురిని బయటకు వచ్చేలా చేశారు. ఈ చర్యతో అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్టానం మిగిలిన శాసనసభ్యులను కాపాడుకునేందుకు బెంగళూరులో క్యాంప్ నిర్వహించింది.

 

తీరా రాజ్యసభ ఎన్నికలు రానే వచ్చాయి..బీజేపీ అధిష్టానం మూడు స్థానాలు తమవేనని భావించింది. కానీ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అహ్మద్ పటేల్ విజయం సాధించడంతో కాషాయదళానికి షాక్ తగిలినట్లైంది. దీంతో లెక్క ఎక్కడ తేడా కొట్టిందా అని పోస్ట్‌మార్టం మొదలెట్టింది కమలదళం. ఈ రివైండింగ్‌లో బీజేపీ ఓడిపోవడానికి కారణం "వాఘేలా" అని తేలింది. వచ్చే ఎన్నికల్లో సీఎం సీటు మీకే అని చెప్పి వాఘేలా నెత్తిన రాజ్యసభ ఎన్నికల భారాన్ని పెట్టారు మోడీ, అమిత్ షా. పాపం ఆయన శక్తికి మించి కష్టబడ్డారు కూడా. అయితే కాంగ్రెస్ నుంచి చీల్చిన ఆరుగురి ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించడం, పోలింగ్ రోజు ఇద్దరు ఎమ్మెల్యేలు తమ ఓటు బీజేపీకేనని బహిరంగంగా చెప్పడం వాఘేలాను చిక్కుల్లోకి నెట్టింది. ఈ రెండు అవకాశాలతో కాంగ్రెస్‌ను అదృష్టం వరించింది.

 

వాఘేలా తప్పిదం కారణంగానే బీజేపీ నవ్వులపాలు అవ్వాల్సి వచ్చిందని ఢిల్లీలోని పార్టీ పెద్దలు నివేదిక రెడీ చేసేశారు. షా కూడా ఓటమి తాలుకూ పాపం మొత్తాన్ని వాఘేలాపైకి నెట్టేసి చేతులు దులుపుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మోడీ, అమిత్ షా ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. తమ సామాజిక వర్గాన్ని ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న అక్కసుతో సొంతపార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు అహ్మద్ పటేల్‌కు ఓటేశారు. ఈ మ్యాటర్‌ను ఏ మాత్రం కదపని బీజేపీ హైకమాండ్‌ వాఘేలాను బలి పశువును చేయడం అర్థరహితం అంటూ గాంధీనగర్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.